LOCAL WEATHER

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

కొత్త జిల్లాలు ఎలా ఉండాలి....???

కొత్త జిల్లాలు అంటూ ఓ విషయం మరో సారి తెరపైకి వచ్చింది...అయితే ఇదేమీ మొదటి సారి కాదు... కొన్నాళ్ళు  వార్తల్లోకి రావడం వివాదాలు వలననో మరి దేని వల్లనో ఈ విషయం తెరమరుగు అవుతోంది...అయినా...కాకపోయినా... ప్రతీ సారీ కొత్త జిల్లాల స్వరూపం అంటూ... వారిచ్చే మేపులు వివాదాస్పదం అవుతున్నాయి... ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్‌ని విభజించినంత అడ్డదిడ్డంగా విభజన చెయ్యటం వలన ఎవరికి లాభం కలుగుతోందో తెలియదు గానీ... ప్రజలకి ఇబ్బందులు పెంచుతోందీ వ్యవహారం.

ఉదాహరణకి... విజయవాడ నగరాన్ని తీసుకుంటే....ఇక్కడో జిల్లా కేంద్రం ఏర్పడుతున్నప్పటికీ ...కొత్త జిల్లాల ప్రకారం నగరంలో మూడో వంతు ప్రక్క జిల్లా మచిలీపట్నం లోనికి వెళుతోంది.... అలా వెళ్లి ఇలా వెళ్ళి పనిచేసుకునే అవకాశం విజయవాడ దగ్గరలో ఉండగా, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నానికి వెళ్ళాలిసి వస్తుంది... దీనికి  ఆశాస్త్రీయమైన విభజనే కారణం. జిల్లాల విభజన కోసం పరిగణలోనికి తీసుకున్నది పార్లమెంటు నియోజక వర్గాలని.... వీటిని ఆధారం చేసుకుంటే తేలిగ్గా విభజించేయవచ్చు.... దీని వలన విభజన పని తగ్గచ్చేమోగానీ... ప్రజలకి దశాబ్దాల పాటూ పాట్లు తప్పవు.... 

అసలు పార్లమెంటు నియోజక వర్గాలని అనుసరించే జిల్లాలు ఉండాలా... లేక ప్రజల అవసరాలని బట్టి ఉండాలా.... ఎందుకంటే... నియోజక వర్గాలు ఆయా ఓటర్ల సంఖ్యని బట్టి... ఎక్కడో దూరంగా ఉన్న ఊళ్ళని కూడా కలిపి చెయ్యాలిసి ఉంటుంది.... ఇందులో ప్రజల అవసరాల కంటే... ఓటర్ల సంఖ్యే ప్రధానంగా కనపడుతుంది.... కాబట్టి వీటిని ఆధారంగా చేసుకుని జిల్లాలని చేస్తే... ప్రజల అవసరాలకి న్యాయం జరగదు....కొత్త జిల్లాల విభజన అంటే... ప్రజలకి పాలన మరింత అందుబాటులోనికి రావటం......ఈ జిల్లాలు కనీసం మరో 50 ఏళ్ల పైన ఇదే స్వరూపంలో ఉండి, ప్రజలకి పాలన అందుబాటులో ఉండేట్లు ఉండాలి.....దీనికి గానూ ఓ కమిటి క్రింది స్థాయి వరకూ వెళ్ళి పరిశీలించాలిసి ఉన్నది....

ఆ కమిటి సభ్యులు ఇప్పటికే ఉన్న 13 జిల్లాలలో పర్యటించి.... ప్రజల అభిప్రాయాలని-అవసరాలని-వారి కదలికలు ఏ నగరం వైపుకి ఉన్నాయో....వారికి ఏది ప్రయాణ సౌకర్యంగా ఉన్నదో చూసి.... దానిబట్టి జిల్లాల విభజన చెయ్యాలి.... ఉదాహరణకి: గన్నవరం మచిలీపట్టణం జిల్లాలోనికి వెళుతుంది....అయితే, గన్నవరం నుండి బస్ లేక రైలు కనెక్టివిటి సౌకర్యం లేదు..... అందువలన పార్లమెంటు పరిధిని పరిగణలోనికి తీసుకోకూడదు.... అలాగే, రాజకీయ  ప్రాబల్యం  కోసమో... ఉద్యోగుల అవసరాల కోసమో.... లేక సామాజిక వర్గ విభజన కోసమో జిల్లాల తయారి ఉండకూడదు.... 

ఆంధ్ర రాష్ట్ర విభజన రెండు సార్లు జరిగిన సందర్భంగా అప్పుడు ఉన్న రాజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసం అనేక "తెలుగు--ఊళ్లు--జిల్లాలు"ప్రక్క రాష్ట్రాల వారికి వెళ్ళిపోయినా చూస్తూ ఉండిపోయ్యారు. ఉదాహరణకి...వెల్లూరు-బళ్ళారి-కోలార్-రాయచూర్-భద్రాచలం-అశ్వారావుపేట-సత్తుపల్లి-కోదాడ-గంజాం లాంటి ప్రాతాలు అనేకం ఆంధ్రా నుండి దూరం అయినాయి.... 

రాజకీయ అవసరాలు మారుతుంటాయి... రాజకీయ నాయకులు వస్తుంటారు..."పోతుంటారు"... కానీ జిల్లాలు ఇలానే ఉండి ప్రజలకి సేవలు అందిస్తుంటాయి....కాబట్టి, ప్రస్తుత అవసరాలు కాకుండా దశాబ్దాల ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని విభజన చెయ్యాలి...

మరో సంగతి.... జిల్లాల  పేర్లు... అవి సున్నిత అంశాలుగా..... రాజకీయ అంశాలుగా అవసరాలుగా ఉండ కూడదు.... పేరు పెట్టేటప్పుడు.... ఆయా జిల్లాలని మార్చాలన్నప్పుడు అనేక వర్గాల నుండి  "మనోభావాల" పేరుతొ అనవసర గందరగోళం జరిగే అవకాశం ఉన్నది.... అందువలన, జిల్లాలకి రాజకీయ నాయకుల పేర్లు కాకుండా.... ఆయా జిల్లాలలో ఉన్న ఊళ్ళ పేర్లు, కొండల పేర్లు, నదుల పేర్లు, దేవుడి పేర్లు ఉన్నట్లయితే బాగుంటుంది... "దేవుడి పేరైతే అసలు ఏ ఇబ్బంది ఉండదు....ఎందుకంటే.... ఏ అవసరం వచ్చినా  ఏ గుడినైనా ఇట్టె కూల్చేయ్యగల సమర్ధ నాయకులు మనకున్నారు"... కాబట్టి....దేవుడి పేరుతొ ఉన్న జిల్లాల విభజనగానీ, పేరు మార్చటానికి ఏ ఇబ్బంది ఉండదు...

"ఇప్పటికి ఉన్న 13 జిల్లాలు వాటివాటి స్వంత సంస్కృతిని ఐడెంటిటీ కలిగి ఉన్నాయి"..... వాటిని అడ్డదిడ్డంగా విభజించటం కొరివితో తలగోక్కున్నట్లు అవుతుంది....అందువల్ల, పదమూడు జిల్లాల స్వరూపం మారకుండా.... ఆయా జిల్లాలనే రెండుగా మారిస్తే ఏ గొడవా ఉండదు.... ప్రక్క జిల్లాలు అన్న మాట ఉండదు.... దీనికి పార్లలమెంటు సెగ్ మెంట్లు ముడి పెట్టకుండా, అసెంబ్లి నియోజక వర్గాలని ఆధారం చేసుకుని........ప్రజల అవసరాలు ఏ ఏ ఊళ్ళ వైపు ఉన్నాయో వాటిని గమనించి వాటిని ముఖ్య పట్టణంగా చేసి జిల్లాలని చేస్తే బాగుంటుంది....దీని ప్రకారం....


శ్రీకాకుళం:  

       01] పలాస జిల్లా :  ఇచ్చాపురం,  పలాస, టెక్కలి,  పాతపట్నం, 

02] శ్రీకాకుళం జిల్లా [అరసవల్లి జిల్లా]:  ఎచ్చెర్ల, రాజాం, శ్రీకాకుళం, 

ఆమదాలవలస, పాలకొండ. 

-----

విజయనగరం

03] పార్వతీపురం జిల్లా : కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు.

04] విజయనగరం జిల్లా : S.కోట, విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల.

----

విశాఖపట్నం:

05] నర్సీపట్నం జిల్లా: పాడేరు, నర్సీపట్నం, అరకు, మాడుగుల, చోడవరం.

06] విశాఖపట్నం జిల్లా [సింహాద్రి జిల్లా]: భీమిలి,పెందుర్తి, విశాఖ-4, గాజువాక,

అనకాపల్లి,  యలమంచిలి, పాయకరావుపేట.  

----

తు.గో జిల్లా: 

07] రాజమండ్రి జిల్లా [ రాజమహేంద్రి జిల్లా]:రంపచోడవరం, రాజానగరం, జగ్గంపేట,  రాజమండ్రి, రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, కొత్తపేట.

8] కాకినాడ జిల్లా[తు.గో.జిల్లా] : ప్రత్తిపాడు , తుని, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం , ముమ్మడివరం అమలాపురం,గన్నవరం,  రాజోలు.

----

ప.గో.జిల్లా   

   
9] ఏలూరు జిల్లా [ హేలాపురి జిల్లా]:కొవ్వూరు, పోలవరం,గోపాలపురం, చింతలపూడి, 

దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు,

10] భీమవరం జిల్లా [ప.గో.జిల్లా]:నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, 

ఉండి, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం.

----

కృష్ణ:  

11] విజయవాడ జిల్లా [పశ్చిమ కృష్ణ జిల్లా]: జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, 

గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్.

12] మచిలీపట్టణం జిల్లా[తూర్పు కృష్ణ జిల్లా]: కైకలూరు, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్టణం, పెడన.

----

గుంటూరు: 


13] నరసరావుపేట [పల్నాడు జిల్లా]: మాచర్ల, గురజాల,పెదకూరపాడు, 

సత్తెనపల్లి,వినుకొండ, నరసరావుపేట.

14] గుంటూరు: మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల, 

పత్తిపాడు, వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, చిలకలూరిపేట.

---

ఒంగోలు: 

15] మార్కాపురం జిల్లా : యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దర్శి,

16] ఒంగోలు జిల్లా: అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు, 

ఒంగోలు, కొండెంపి , కందుకూరు,

---

నెల్లూరు:


17] కావలి జిల్లా[ఉత్తర పెన్నా జిల్లా]: కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు.

18] నెల్లూరు జిల్లా[దక్షిణ పెన్నా జిల్లా]: నెల్లూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, 

వేంకటగిరి, గూడూరు, సూళ్ళురిపేట,

---

చిత్తూరు: 


19] చిత్తూరు జిల్లా [కాణిపాకం జిల్లా]: తంబళ్ళపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, 
పూతలపట్టు, చిత్తూరు, కుప్పం.

20] తిరుపతి జిల్లా [బాలాజీ జిల్లా]:   చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, గంగాధర నెల్లూరు.

---

అనంతపురం: 

21] అనంతపురం జిల్లా:  రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, 

తాడిపత్రి, అనంతపురం, సింగనమల. 

 22] పుటపర్తి జిల్లా: హిందూపురం, మడకశిర,  రాప్తాడు, పెనుకొండ,  ధర్మవరం, పుటపర్తి, కదిరి.

----

కర్నూలు:

23] కర్నూలు జిల్లా: పాణ్యం, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ.

24] నంద్యాల జిల్లా [శ్రీశైలం జిల్లా]: దొన్. బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల,  నందికోట్కూరు,శ్రీశైలం. 

----

కడప:

   

25] కడప జిల్లా: జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలపురం. కడప, బద్వేల్.

26] పులివెందుల జిల్లా:  పులివెందుల. రాయచోటి, రాజంపేట,  కోడూరు. 


షుమారుగా పై విధంగా చేసి, జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రక్క జిల్లా ఊళ్ళని కూడా... ఆయా జిల్లాల ప్రజాభిప్రాం సేకరించి....కలప వచ్చును.... జిల్లాలని చేసేది ప్రజలకి పాలన మరింత చేరువ అవటానికే అని ఉంటే చాలు...చాలా చక్కగా జిల్లాలని విభజన చెయ్యవచ్చును....


ది ఇలా ఉంటే... 

ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరిన తరవాత కొన్ని చోట్ల ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తుండగా...

చాలా చోట్ల ఇదేదో ప్రభుత్వ వ్యవహారం అనుకుంటున్నారు....

ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నదనుకున్న విజయవాడ వాసులకి ఏ మాత్రం చిమ కుట్టినట్లైనా లేదు... 

ఓ ప్రక్కన విజయవాడ నగరంలో మూడో భాగం మచిలిపట్నానికి వెళుతున్నా.... 

మరోప్రక్క, నూజివీడు-కైకలూరు ప్రాంతాలు ప్రక్క జిల్లాలో కలుస్తున్నా ఏ మాత్రం అభ్యంతరాలు చెప్పటం లేదు....  

చైతన్యం లేకనా... లేక ఆ ఇది జరిగేనా అన్న అనాసక్తో అర్ధం కాలేదు... 

ఏది ఏమైనా ఇదేమీ ప్రభుత్వ వ్యవహారం మాత్రమే అని ప్రజలు ఉదాసీనంగా ఉండకూడదు.... 

ఇలాంటి వాటిలో పాల్గొని తమ తమ అభిప్రాయాలని తెలిపి.... 

తమ ఇబ్బందులని అధికారుల దృష్టిలోనికి తీసుకుని వస్తే 

తరవాత రోజుల్లో అనవసర ఇబ్బందులు ఉండవు.... విమర్శలు ఉండవు... వ్యంగాలు ఉండవు.... 

ఈ వ్యంగాలు ఫేస్ బుక్కు-వాట్స్ ఆప్ లలో  లైకులకి షేర్లకి  పనికొస్తాయేమోగానీ, ప్రజోపయోగానికి పనికిరావు. 


కొస చీకటి ఏమంటే... యధావిధిగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు లాగానే... 

రాజకీయ ప్రముఖులు తమ తమ వ్యాపారాల్లో ముణిగి ఉన్నారే గానీ 

సీరియస్సుగా తీసుకుని...

తమ కార్యకర్తల ద్వారా ప్రజాభిప్రాయాన్ని 

ప్రభుత్వానికి తెలియచేయ్యలనే తపన కనపడటం లేదు...


జై హింద్ 


బొమ్మలు కర్టెసి గూగుల్

MAPS EDITED BY 

K.RADHAKRISHNA


ఇంతకు ముందు వేసినవి....క్రింది లింకులు నొక్కండి...




19, డిసెంబర్ 2021, ఆదివారం

రాయలసినిమా...కొండపోలం....


చాలా కాలంగా రాయలసీమ సినిమాలు అంటే... కొట్టుకోవడం... అందులో కడప కర్నూలు అంటే మరీ లోకువ... "అక్కడి జనాలు తమ పోరుషం కోసం ఏమైనా చేస్తారు...కేవలం బాంబులతోనే మాట్లాడుకొంటారు" అన్నట్లుగా హైడరా'బ్యాడ్ సినిమా వాళ్ళు చిత్రీకరించి...మిగిలిన ప్రాంతాల ప్రజలకి, రాయలసీమ అంటే లోకువ భావం కలిగించారు... ఇది చాలదన్నట్లు ప్రాస డైలాగు రైటర్లు కోస్త-తీస్తా- అంటూ ప్రాస కోసం ప్రాకులాడి, రాయలసీమ ప్రజల మాట తీరుని ఘోరంగా అవమానించేట్లు డైలాగుల్ని లాగించారు.... రాయలసీమ జనాల్ని కూడా అదేదో పౌరుషం...పౌరుషం... అనే పేరుతొ జోకోడుతో ఊర్కోబెడుతున్నారు...వీరి ఉద్దేశ్యం అవమానించటం కాకపోవచ్చును.... అయితే, అంతకన్నా ఎక్కువే... డబ్బు యావ_డబ్బు కోసం ఎలా ఏది అయినా తీసే రకంగా హైడరాబ్యాడ్  సినిమావాళ్ళు   తయ్యారైనారు.... 


పాత తెలుగు రాజధాని మదరాసులో సినిమా- భాష నాశనం అవలేదు.

అంతకు ముందు మదరాసులో ఉన్నప్పుడు ఇంతటి దిగజారుడు తనం లేదు...కళ-కాలేక్షేపం కోసం తీసే వారు... ఆయా సినిమాల్లో కధాంశం గానీ... భాష గానీ చక్కగా ఉండేది... మదరాసులో ఉన్నాం కదా అని.."ప్రతీ సినిమాలో ఓ అరవ క్యారెక్టర్ని చెయ్యాలనే బానిసత్వం వాళ్లకి ఉండేది కాదు"... బహుశా అక్కడి ప్రాంతం నుండి కూడా వారికి ఒత్తిడి ఉండేది కాదేమో... 

ఏది ఏమైనా... హైదరాబాదు వచ్చిన కొత్తల్లో మదరాసు విధానంలో పనిచేసినప్పటికీ... రాను రానూ డబ్బే పరమావధిగా, అనేక సినిమాలు రావటం మొదలెట్టినాయి... వాటికి ఓ పద్దతి పాడు లేకుండా... ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాలు కాకుండా... ఫ్యామిలీ మొత్తం మందు కొడుతున్న సినిమాలని చెయ్యటమే ధ్యేయంగా కొనసాగుతుండగా మధ్య మధ్యల్లో మంచి సినిమాలు కూడా అక్కడక్కడా వస్తూ ఉన్నాయి...అలా వచ్చిన సినిమానే "కొండపోలం"...ఇదే ఎందుకంటే...ఇందులో ఫెక్షనిజం లేకుండా.... పూర్తిగా రాయలసీమ చక్కటి కధాంశం-మాండలికంతొ నడుస్తుంది...



ఇక "కొండపోలం" అనే సినిమా విషయానికి వస్తే... ఇది శ్రీ సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి గారు వ్రాసిన నవల.... ఆయన రచనలు కొన్ని..."చినుకుల సందడి"-"కాడి"-"ఒంటరి" ...వాటిలో ఒకటి.... "కొండపోలం"... దీని కధాంశం: రాయలసీమ నల్లమల అడవులకి సంబంధించిన మేకలు కాచుకునే వ్యక్తి సివిల్స్  ఇంటర్‌వ్యు కి వెళతాడు... అందులో వింతేమున్నదీ.... కానీ, అతడిని IAS-IPS కావాలా అంటే.... తనకి IFS [INDIAN FOREST SERVICE] కావాలని అడుగుతాడు...అదేమిటి అని ఇంటర్‌వ్యు చేసే వాళ్ళు ఆశ్చర్యంతో అడిగితే...తన కధ చెపుతాడు... ఇది మొదలు... సినిమా చూడాలనుకుంటే... నెట్‌లో  అమెజాన్ లాంటి వాటిల్లో దొరుకుతోంది చూడచ్చును...



ఈ సినిమా డైరెక్టరు క్రిష్ చాలా కష్టపడ్డాడనే చెప్పవచ్చును...ఎందుకంటే...ఈ సినిమాకి కమర్షల్ హంగులు కన్నా.. అవుట్ డోర్‌లో తియ్యటం....నటుల చేత పూర్తి ప్రాంతీయ రాయల సీమభాషలో  మాట్లాడించటం చెశారు. ఈ సినిమాకి భాషే ముఖ్యం.... మిగిలిన రాయలసీమ ఫేక్షన్ సినిమాల్లో లాగా మిగిలిన వారు సీమా భాషలో మాట్లాడుతుంటే... హిరో-హిరో ఇన్నులు మాత్రం కోస్తా భాషలో మాట్లాడినట్లుగా కాకుండా... అందరీ చేత తమ స్వరంతోనే (డబ్బింగ్ లేదనే అనుకుంటున్నాను) చక్కటి కడప ప్రాంతపు భాషని పలికించారు... అనవసర భేషజాలు లేకుండా నవలని సినిమా క్రింద మార్చారు...నటీ నటులందరూ బాగా నటించారు ...ఇలాంటి సినిమాలని ఆదరించాలి....

లేకపోతే, సినిమా వారు.... తమ వారి లేని పోని గొప్పలకోసం, ప్రాంతాలని, ప్రజలని, భాషని...అక్కడి సంస్కృతిని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ...  సినిమా హిట్టు కోసం మాత్రమే చేస్తూ ఉంటారు.... అయితే, ఎవరు ఏ అవమాన పడినా పరవాలేదు అనుకుంటూ తీసే సినిమాలు కమర్షియల్‌గా హిట్ కావచ్చునేమో గానీ...గౌరవాన్ని మాత్రం తగ్గిస్తాయి....

వెనుకటికి ఒకాయన... వచ్చింది నాటకాల నుండి.... హాస్యం కోసం నాటకాల ప్రారంభ గీతాన్ని అపహాస్యం చేస్తూ...చేసినది హాస్యం అనుకుని...అనుకోకుండా నాటకాలని అవమానించాడు.... ఇక మరొకతను కాలితో తన్నడమే హాస్యమని... చివరికి మొఖాన ఉమ్మేయటమే హాస్యం అనే స్థాయికి దిగజార్చాడు సినీ గౌరవాన్ని.  అలా చేసే క్రమంలోనే... ఫేక్షన్ సినిమాలూ వచ్చినాయి... 

ఇన్ని  జిల్లాల్లో  ఏ జిల్లాకి ఆ జిల్లా మంచి పద్దతులు ఉంటే..... వాటిని వ్యంగ్యం చేసిన వీరు... ఏ పద్దతి లేని... కలగూరకంప....గొడవలు టెర్రరిజం...ప్రాంతీయ విభేదాలు ఇలా అనేక లోపాలున్న తమ[ఎప్పటి నుండి???]ఊరుని మాత్రం ఏదో అంతరిక్షం నుండి వచ్చిన తీరున...అనేక గౌరవాలని ఆపాదించి సినిమాల్లో చూపిస్తున్నారు... కర్నూలు అనగానే కత్తులు.... కడప అనగానే బాంబులు చూపించే వీరు... ఎందుకనో "హైడరా బ్యాడ్ అంటే డర్రు'తారు"... తమ సినిమాల్లో దాని భౌతిక అందం చూపిస్తారు... లోనికి పోరు...ప్రాంతీయ అభిమానం...!!!  అది అన్ని ప్రాంతాల వారికి ఉంటుందన్న జ్ఞానం ఉండాలి.

ఇక విషయానికొస్తే... రాయల సినిమా అంటే బాంబులు కత్తులు కాదు అని కొందరు సానిమా వాళ్ళు  తెలుసుకోవాలి.... అలాగే సినిమా వాళ్ళు  కేవలం డబ్బు సంపాదన కోసం  ప్రాంతాన్ని... భాషని....సంస్కృతిని అవమానించ కుండా చక్కటి సినిమాలు తీస్తే... ఇటు తెలుగువాళ్ళ పట్ల ఇతర ప్రాంతాల వారికి  మంచి భావం కలగటంతో పాటూ ... సినిమా వాళ్ళ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది...

@@@@@@@@@@@@@@@
జై హింద్ 

@@@@@@@@@@@@@@@



ఇంతకు ముందు వేసినవి....క్రింది లింకులు నొక్కండి...






23, మే 2021, ఆదివారం

ఆధునీకతా ఏంది నీ కత...

ఏమిటి వేడి చేసే తినాలా 

హాయిగా పచ్చివి తింటే పోలా...

ఏమిటి ఇలా రుద్ధంగానే వెలుగుతోంది...

హాయిగా రెండు రాళ్ళు కొడితే మంట వస్తుంటే....

ఏమిటి ఇళ్ళు కూడా కట్టుకోవాలా...

హాయిగా గుహల్లో ఉండచ్చును కదా....

ఇలానే మనం అనాగరికులు అని అనుకునే వారు ఆలోచించి ఉంటే

ఇప్పటి ఆధునీకత వచ్చేదా....

"ఏదైనా మనకు తెలిస్తేనే శాస్త్రం.... అర్ధం అయితేనే సైన్సు" 

అని అప్పటి వారు అనుకుని ఉంటే ఇప్పుడు ఇలా ఉండేదా....

ఏదైనా కొత్తది వచ్చినప్పుడు ఎక్కువ మంది 

అయిష్టంగా అయినా ఆమోదించారేగానీ నిర్మొహమాటంగా తిరస్కరించలేదు....

అలా చెయ్యలేదు కాబట్టే 

"సైన్సు అనబడే మానవ జీవితం" ఆధునీకత సంతరించుకుంటూ వచ్చింది....


అంతా బానే ఉన్నది అని అనిపిస్తోంది కదా..... 

కానీ లేదు....

కర్టేసి ఫేస్ బుక్ 

వస్తువుల్లో ఆధునికత పెరిగిన కొద్ది మనిషి బుద్ధిలో మాత్రం... ఆనాటి అనాగరీకుడికి లేని నికృష్టపు ఆలోచనలు పెరిగినాయి...ఈ ఆధునికత పెరగక ముందు.... ఎవరైనా ఏది అయినా కొత్తది కనిపెడితే... దానిని అందరితో పంచుకునే వారు... అందుకనే ఆనాడు ఆర్కిమిడిస్ కొత్త సిద్దాంతం తోచగానే.... వంటి మీద బట్టలు ఉన్నాయో లేవో చూసుకోకుండానే "యురేకా" అంటూ జనాల మధ్యకి పరిగెత్తుకుని వచ్చాడు....

కానీ, ఇప్పుడు... ఈ కంప్యుటర్ యుగం అనబడే దానిలో ...అదే తెలివైన మానవడు ఏదైనా కనిపెట్టగానే [మూడు దశాబ్దాలుగా కనిపెట్టింది కూడా ఏది లేదు...ఉన్నదాన్ని అప్ డేట్ చెయ్యటం తప్ప]....కార్పోరేట్ కాళ్ళ దగ్గరకు పరిగెడుతున్నాడు...పేటెంటు...స్వంతం అనుకుంటూ సాటి మానవ సమాజానికి పనికి రాకుండా డబ్బే పరమావధిగా బ్రతుకుతున్నారు.... కేవలం డబ్బే కాదు...అధికారం....పార్టీల ఉన్మాదంతో సమాజ హితానికి దూరంగా పోతున్నారు....విచిత్రం ఏమంటే.... ఇలా మారిన మనిషికి సపోర్టుగా  మేధావులనబడే రాజకీయ పార్టీ బానిసలు వంతపాడటం... 

అది కాదని ఎవరైనా జనం దగ్గరకు వెళ్ళాడో అతని పని అయిపోయినట్లే... అతనిని మానసికంగా హింసించి... నీకు ఆ పరిజ్ఞానానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నదా...చదువుకోకుండా[?] ఎలా చేశావు... ఇది శాస్త్రీయం కాదు అంటూ అతనికి... ఎందుకు కనిపెట్టానురా దేవుడా అని అనిపిచేట్లు చేస్తున్నారు.... పోనీ ఈ అడిగే వారు టివీలలో చర్చలు చేసే మేధావులకి ఏమన్నా ఆ డిగ్రి సర్టిఫికెట్లు ఉన్నాయా అంటే... 90 శాతం మందికి  కనీస జ్ఞానం కూడా ఉండదు... 


నిజానికి సర్టిఫికెట్ల గురించే అడిగేట్లుంటే... ఈ రోజున మనవాళ్ళు  "ఎగిరిపడే ఆధునీకతకి పునాది.... కరెంటు....వెలుగు.....కమ్యునికేషన్ లాంటివి కనిపెట్టిన ధామస్ ఎడిసన్ కి  గ్రాహం బెల్ కి  ఇప్పుడున్నా ఏ దరిద్రపు ఇంజనీరింగ్ కాలేజీ సర్టిఫికెట్లు లేవు"... ఆయనెవరో చెప్పినట్లు, పోతన గారు తెలుగు BA చదవలేదు... BA చదవాలిసిన వారే ఆయన వ్రాసినవి చదువుతున్నారు.....


అలాగే, బిల్దింగ్ ప్లాన్ వేసే పేద్ద ఇంజనీరు కాగితం మీద గీతలలో మాత్రమే బిల్దింగ్ చూపించగలడు...బయట నాలుగు ఇటికలు కూడా సమానంగా కట్టలేడు... ఆ కట్టే వారికి ఈ చదువు అనబడే చదువుండదు...కానీ వారు అన్ని కోణాలు సమంగా కట్టుకొని వస్తారు...ఇలా ఒకటేమిటి... స్కూటర్ మెకానిక్కు దగ్గర నుండి బుల్డోజర్ మెకానిక్కుల దాకా ఎవరికీ సర్టిఫికెట్లు ఉండవు... 
.వీరి ఉద్దేశ్యంలో వారికి చదువు లేదని...సర్టిఫికేట్ లేదని.....విజ్ఞానానికి సర్టిఫికెట్లకి ఏ మాత్రం సంబంధం లేదన్న కనీస  జ్ఞానం ఇప్పటి కంప్యూర్ యుగపు మేధావులకి ఎందుకు లేదో తెలియటం లేదు... 

ఇంతకీ వీళ్ళ ఇంటెన్షన్ ప్రజల బాగు కోరా.... 

కాదని మొహమాటం లేకుండా చెప్పోచ్చును... 

ఎంతో దుర్మార్గంగా దోచుకునే వారిని 

వీరు అసలు ప్రశ్నించరు....హింసించరు.  

ఇలాంటి వారిని అనాగారికులతో పోల్చటానికి లేదు.....

వారికున్న అభ్యుదయ భావాలు...

సమాజాన్ని రక్షించుకుందాం అనే పట్టుదల 

ఇవేమీ లేని వీరిని 

"నీతిలేని మానవులు" 

అనే చిన్న మాట మాత్రమే వాడవలసి రావటం విచారకరం...


మనిషికి సౌకర్యాలు పెరిగిన కొద్ది మంచిగా పనిచెయ్యాలి...

మంచిగా ఆలోచించాలి....కానీ, 

దానికి విరుద్ధంగా ఏదో చేద్దాం అనే తపనలో 

కొత్త కొత్త సౌకర్యాలని కనిపెట్టే బదులు 

రోగాలని కనిపెడుతూ వాటి నుండి ఎలా బయటపడాలో తెలిసి కూడా 

బయట పడలేక  చస్తూ  నీచంగా బ్రతుకుతూ.... 

ఇదే ఆధునీకత  అని మభ్యపెట్టుకుంటూ 

జీవనం గడిపేస్తున్నారు...

ఏ చేద్దాం.... చేసేదేమీ లేదు....

తెలియని వారికి చెప్పొచ్చుగానీ... తెలిసి చేసే వారికి చెప్పేదేమున్నదండి.....


@@@@@@@@@@@@@@

జై   హింద్ 

@@@@@@@@@@@@@@

ఇందులోని బొమ్మల కర్టేసి గూగుల్ 

ఇంతకు ముందు వేసినది...

క్రింది లింకు నొక్కండి 

హైదరాబాదు చిన్న చేప మందా..?? కార్పోరేట్ పెద్ద చేప మందా......???


దీనికి ముందు పోష్టులు....

ఈ క్రింది లింక్ నొక్కండి

"అబ్బో మన దేశంలో కూడా బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారు"...

విషయం: టాప్ టెన్ ధనవంతులైన భారతీయుల వలన  ఏదన్నా ప్రజలకి ఉపయోగం ఉన్నదా ...???

ఈ క్రింది లింక్ నొక్కండి

విషయం: తమ పేరుకోసం ప్రజలని అవమానిస్తున్న నాయకులు...








21, మార్చి 2021, ఆదివారం

కీర్తి కాంక్షా ఉన్మాదం... సొమ్ము ప్రజలది....సోకు నాయకులది..


దేశంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే... రాజకీయ నాయకులకి డబ్బు పిచ్చతోబాటూ కీర్తి కాంక్ష పిచ్చి బాగా ఎక్కినట్లు కనపడుతోంది...ఇది డబ్బు పిచ్చకన్నా ముదిరి... ప్రజలకి పరిమినెంటుగా పనికొచ్చే వాటి కన్నా తమకి పేరొచ్చే పనులకే ప్రాధ్యాన్యతని ఇస్తున్నారా నాయకులు...దీని వల్లనే ఇంత పెద్ద ప్రజాసామ్య దేశమైన భారత దేశ ప్రజలకీ రావాలిసినంత మంచి పేరు రావటం లేదు...


ఇది ఇప్పుడంటే ఇప్పుడే పట్టిన పిచ్చి కాదు...ఒకప్పుడు... కృష్ణా బ్యారేజీ గేట్లు ఎత్తి నీరు వదలాలంటే లేదా ఏ సాగారో, శ్రీశైలం గేట్లు అవసరార్ధం ఎత్తాలంటే... దానికి సంబంధించిన ఇంజనీరు...పనివాళ్ళు వచ్చి ఆ పని గుట్టు చప్పుడు కాకుండా చేసుకుని పొయ్యేవారు...."అదొక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ఓ విధిలా" నిర్వర్తించే వారు....అలా చాలా కాలం సాగింది... తరవాత కాలంలో కీర్తి పిచ్చ పట్టిన నాయకులు వచ్చిన తరవాత... ఓ కాలువ లాకులు ఎత్తటానికి కూడా ముఖ్యమంత్రి లెవెల్లో వచ్చి.... కొబ్బరికాయలు కొట్టి పూలు జల్లి...కార్యకర్తలచే నానా హడావిడి చేయించి... అక్కడికేదో "ఆ నీళ్ళు తమ వల్లనే వస్తున్నాయన్నట్లు" గొప్పగా ఫొటోలకి ఫోజులు ఇచ్చి.... తమ డబ్బా మీడియాలో ప్రచారం చేయించటం మొదలెట్టారు... 


ఇది ఎంత ముదిరింది అంటే.. నాయకులకి తీరిక లేకపోతే...లాకులేత్తే కార్యక్రమాన్నే వాయిదా వేసేంతగా... ఈ పిచ్చ వల్లనే ఒకానొకనాడు... సకాలంలో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తకపోవటం వలన కర్నూలు ముణిగింది...


సరే, ఓ పట్టణం ముణిగితే పోయ్యేదేమున్నది అనే పార్టీ ఉన్మాదులున్నారు... అయితే, అక్కడితో ఆగటం లేదు... ఈ రోజున ప్రజల డబ్బుతో రకరకాలైన పధకాలు పెట్టి... వాటికి తమ పేరు లేక తమ వారి పేరు పెట్టుకోటం కోసం పోటీలు పడుతున్నారు.... డబ్బు ప్రజలది...పధకాల పేర్లు నాయకుల-సంబంధీకులవి... ఏ గొప్ప నాయకుడు అనుకున్న వాడైనా "ప్రజల పేరుతో పధకాలు పెట్టారా"...?? పెట్టరు. డబ్బు జనాలది... సోకు నాయకులది... దానికోసం కొట్టుకునే చెంచాలైన పార్టీ కార్యకర్తలది...ఇక శంకుస్థాపన రాళ్ళ మీద ఇది వరకు ఓ నాయకుడి పేరుతొ సరిపెట్టే వారు... మిగిలినవి ఆ ప్రాజెక్టు చేసిన కంపెనీ వివరాలు ఉండేవి... ఇప్పుడు పనికిమాలిన కార్యకర్తల పేర్లతో సహా అన్నీ ఉంటున్నాయేగానీ...కట్టిన వారి పేరుండటం లేదు...!!!


ఇలా ఒకటేమిటి...రాజకీయ నాయకులు లేకపోతే ప్రజలే లేరన్న అహంకారానికి ఎదిగి పొయ్యారు.... నిజానికి ప్రజాసామ్యంలో ప్రజలకి ఇవ్వాలిసినంత గౌరవం ఇస్తున్నారా.... "తాము... తమ తల్లిదండ్రలు లాంటి వాళ్ళు లేకపోతే ప్రజలు అడుక్కు తినాలి" అనే విధంగా ప్రజల మనస్సుల్ని నాశనం చేశారు...చేస్తున్నారు...నిజానికి ప్రజల డబ్బు లేకపోతే రాజకీయ నాయకులకి గానీ అధికారులకి గానీ హంగూ ఆర్భాటం ఎక్కడి నుండి వస్తాయి...? అడుకున్నేది ప్రజల దగ్గర నుండి.... అదిలించేది ప్రజలని....త్యాగాలన్నీ ప్రజలే చెయ్యాలి... నాయకులు-అధికారులు  మాత్రం AC కార్లు, AC ఆఫీసులు వదిలి రారు...


పోనీ నిజంగా ప్రజల మీద ప్రేమున్నదా అంటే..ప్రభుత్వాలు ఎంత సంకుచితంగా తయ్యారైనాయంటే... సంవత్సరానికి గరిష్టంగా 12 గ్యాస్ సిలిండర్లు ఓ కుటుంబం వాడితే, వాటికి అయిదారు వేలు సబ్సిడీ ఇవ్వాలంటే, ఏదో దేశానికి నష్టం వచ్చేస్తున్నట్లు మాట్లాడేస్తున్నారు... నిజానికి ఒక్కో కుటుంబం మీద సంవత్సరానికి కొన్ని వేల నుండి లక్షలు రుపాయలు పన్నులు ద్వారా వసూలు చేస్తున్నారు.... తాము ప్రజల నుండి కొట్టేసిన వేల-లక్షల పన్నుల నుండి కొంత సబ్సిడీ ఇవ్వాలంటే "పెట్టుబడే పెట్టని ప్రభుత్వాలకి నష్టం వస్తుందిష"...... ఇలా ఉంటాయి నిజమైన పెజా సేవలు....వీటిని సమర్ధించే పనికిమాలిన మేధావులు... డబ్బు ఎక్కడి నుండి వస్తోంది...ఎవరికీ ఖర్చు పెడుతున్నారో  తెలిసి కూడా గొప్పగా మొఖాలు పెట్టి "ఇది పధ్ధతి కాదు" అని అనేస్తారు... వేలకి వేలు లక్షలు పెన్షన్లు పొందుతూ...   


ఈ పరిస్థితికి ఓ పార్టీని... ఓ నాయకుడిని అనవలసిన పని లేదు... అందరిదీ ఒకటే దారి...వాళ్ళు లేకపోతే దేశం-రాష్ట్రాలు నాశనం అయిపోతాయి అన్నంతగా ప్రజలని మోసం చేస్తున్నారు...పోనీ ఆయా పనులకి కష్ట పడిన వారి పేర్లు పెడుతున్నారా అంటే అదీ లేదు....దీనికి ఒకటి రెండు ఉదాహరణలు సాగర్ డ్యాం కోసం నానా కష్టాలు పడిన ఓ జమిందారు పేరు ఎవరికీ తెలియదు గానీ...[SRI Raja Vasireddy Ramagopala Krishna Maheswara Prasad, popularly known as late Muktyala Raja, was instrumental in the construction of the Nagarjuna Sagar Dam through active political lobbying and the donation of one hundred million British pounds and fifty-five thousand acres of land. It was the tallest masonry dam in the world at that time, built entirely with local know-how under the engineering leadership of  SRI Kanuri Lakshmana Rao.(KL RAO)] ...దానికి శంకుస్థాపన మాత్రమే చేసిన నాయకుడు మాత్రం అందరికి తెలిసి పొయ్యాడు....

లింక్: https://en.wikipedia.org/wiki/Nagarjuna_Sagar_Dam


అలాగే అనేక నగరాలలో రోడ్లు వెడల్పు చేసి తిట్లు తినేది కమీషనర్లు.... పేర్లు మాత్రం MGMలు, JNలు... ఇంకా లోకల్ గా ఆ రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు అడ్డు పడే నాయకుడి తాలూకు పేర్లు.... ఇలాంటిదే, విజయవాడలో కష్టపడి వెడల్పు చేసిన ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు పెట్టకుండా... ఓ దానికి నెహ్రు పేరు.... మరో దానికి GS రాజు పేరు పెట్టారు... వాళ్ళకి ఈ రోడ్డుకు సంబంధమే లేదు....అయితే, విజయవాడ ఓ విధంగా పని చేసిన కమిషనర్ల ఋణం తిర్చుకుం కుంటో౦ది...ఇక్కడ అనేక పేటల పేర్లు రాజకీయ నాయకులవి కాకుండా కమిషనర్ల పేర్లతో ఉన్నాయి....[అజిత్‌సింగ్ నగర్, రాజివ్ నగర్, వించి పేట, బకింహం గవర్నర్ పేట లాంటివి...]


సరే....ఇదో కీర్తి కాంక్ష ఉన్మాదం... మరి ఈ పిచ్చ వదలాలంటే ఒకటే మార్గం... నాయకులకి పేర్లు ఉండటం వల్లనే కదా ఈ గోల...అందుకని: 


1] ఎలక్షన్లో గెలవంగానే వారి పేర్లని తీసేసి... వారు గెలిచిన నియోజక వర్గం పేరుతోనే పిలవాలి....ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ MLA లేక గుంటూరు MP అనే పేర్లతో మాత్రమే వ్యవహరించాలి...


2] మంత్రుల్ని వారి శాఖ పేరుతొ మాత్రమే పిలవాలి....ఉదాహరణకి రైల్వే మంత్రి, ఆర్ధిక మంత్రి...


3] ముఖ్యమంత్రుల్ని-ప్రధాన మంత్రుల్ని వారి సంఖ్య బట్టి పిలవాలి...ఉదాహరణకి దేశం స్వాతం స్వాతంత్రం వచ్చాక ఎన్నోవ ప్రధాన మంత్రి....ప్రధాన మంత్రి 4,5,6....అలాగే, రాష్ట్రం పుట్టాక ఎన్నోవ ముఖ్య మంత్రి.... ముఖ్యమంత్రి 1,2,3...


4] శంకుస్థాపనలు-ప్రారంభోత్సవాలు పూర్తిగా నిషేధించాలి....ఆయా రాళ్ళ మీద ప్రాజెక్టు వివరాలు... అంటే: ఎప్పుడు మొదలెట్టారు...ఎప్పుడు ప్రజా  వినియోగానికి వచ్చింది... ఖర్చు ఎంత అయ్యింది...దానిని కట్టిన/బాధ్యత వహించాలిసిన కంపెనీ పూర్తి వివరాలు మాత్రమే ఉండాలి....


5] అసలైన పిచ్చి ప్రచారం టివిల వలన కాబట్టి, ఆగష్టు 15, జనవరి 26కి తప్ప మరెప్పుడు రాజకీయ నాయకులెవ్వరు టివీలలో కనపడ కూడదు...[బహుశా వార్తా చానళ్ళు మొత్తం మూత బడే అవకాశం ఉన్నది...] 


6] జిల్లాల పేర్ల లాంటివి అక్కడ ఉన్న నదులు కొండలు ప్రాంతాల పేర్లతోనే వ్యవహరించాలి....


7] పధకాల పేర్లు...ఆయా పధకం ఉద్దేశ్యం తెలిసే పేరే పెట్టాలి...


8] రాజకీయ నాయకుడి పేరుతొ వచ్చే పేర్లు వాడ కూడదు....[ఉదాహరణకి మెక్ డొవేల్స్ గ్లాసులు...చార్మినార్ పెన్నులు లాగా...]


9] ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ రాజకీయ నాయకుడి ఫోటోలు పెట్టకూడదు...


ఇవన్నీ జరిగేనా.. అని అనుకోవద్దు... ఇలా చేసే ప్రజాసామ్యం మీద ప్రజల మీద గౌరవం ఉన్న నిజమైన నాయకుడు వస్తే ఇదేమంత కష్టమయిన పని కాదు... అదే జరిగిన నాడు...తమ కీర్తి కోసం దేశ ప్రజలకి చెడ్డ పేరు తెచ్చే నాయకుల నుండి రక్షించబడి... రాజకీయ పోల్యుషన్ పొయి అనేకం దీనితో సంబంధం ఉన్న రుగ్మతలు కూడా పోయి...రాజకీయ నాయకుల కీర్తి కాంక్ష ఉన్మాద రహిత భారత ప్రజాసామ్య దేశంగా...."స్వచ్చ ప్రజాసామ్య  భారతదేశంగా" భారత దేశ ప్రజలు ప్రపంచంలో గౌరవ మన్ననల్ని పొందుతారు....


__________________________

జై   హింద్ 

__________________________


దీనికి ముందు పోష్టులు....
ఈ క్రింది లింక్ నొక్కండి

"అబ్బో మన దేశంలో కూడా బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారు"...

విషయం: టాప్ టెన్ ధనవంతులైన భారతీయుల వలన  ఏదన్నా ప్రజలకి ఉపయోగం ఉన్నదా ...???



ఈ క్రింది లింక్ నొక్కండి

 TV 9 రజని గారు అడగని ప్రశ్నలు...

విషయం: విశాఖా స్టీల్ ప్లాంట్ 






14, మార్చి 2021, ఆదివారం

"అబ్బో మన దేశంలో కూడా బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారు"...

ఈ మధ్య కాలంలో భారత్‌లో కల్లా వీళ్ళు ధనవంతులు... వాళ్ళు ధనవంతులు.... 

ప్రపంచంలోనే ర్యాంకులు అంటూ చర్చ సాగుతోంది....

ఇవన్నీ చూస్తుంటే.... సినిమా యాక్టర్ల  ఫ్యాన్స్  

"మా హిరో మొదటి వారం కలెక్షన్ ఇంత...అంత" అని 

చెప్పుకునే ఉత్సాహంలా  కనపడుతూ ఉన్నది.... 

ఎలా అంటే.... ఈ ఫ్యాన్సుకి లాజిక్... ప్రయోజనం... ఇతర విషయాలతో పనిలేదు... 

కేవలం వారి వారి హీరోల హిరో ఇన్నుల గొప్పతనం తప్ప 

మిగిలిన లౌకిక విషయాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ... 

వారికున్న అభిమానం సముద్రంలో అవి ముణిగి కొట్టుకు పోతాయే తప్ప... 

నిజాలు నిజాయితీగా మాట్లాడుకుందాం అనే ధ్యాసే ఉండదు... 

ఎందుకంటే ఏం మాట్లాడితే...తమ అభిమాన వ్యక్తుల గ్రేడ్ ఎక్కడ తగ్గుతుందో అన్న భయం..!!

ఓ పాత సినిమా వివరాలు....


సరే... వాళ్ళంటే  కుర్రకారు...ఆ సినిమా యాక్టర్ల వలన వారికి మంచి ఎంటర్ టైన్ మెంట్ [వినోదం] ఉంటుంది కాబట్టి ఆవిధంగా వారిని వెనకేసుకేస్తుంటారు.... కానీ,  ఈ మధ్య కొన్ని కార్పోరేట్ కంపెనీలని వెనకేసుకొస్తున్నారు... పోనీ కనీసం వారు అందులో పనిచేస్తున్నారా...ఆ షేర్లు కొన్నారా...ఆ వస్తువులు కొంటున్నారా అంటే అది కారణం కాదు.... మరి ఎందుకు వెనకేసుకోస్తున్నారో అర్ధం కాలేదు... 

ఆసియాలో బాగా డబ్బున్నోళ్ళు

ఇక విషయానికొస్తే...

ఈ మధ్యన బాగా వార్తల్లోకి వచ్చిన కంపెనీ రిలయన్స్ అంబానీ గ్రూప్.. వీరు ఆసియాలోనే నంబర్ 1 ధనవంతులు... ప్రపంచంలోనే ధనవంతుల లిస్టులో ఉన్నారని చెప్పుకొస్తున్నారు... అది ఒక సారి అయితే పరవాలేదు... పదే పదే చెపుతుండటంతో...."అబ్బో మన దేశంలో కూడా డబ్బున్నోళ్ళున్నారు అని అనుకోటానికా" లేక నిజంగా ఈ టాప్ టెన్ ధనవంతులైన భారతీయుల వలన  ఏదన్నా ప్రజలకి ఉపయోగం ఉన్నదా ...ఇలా ధనవంతులైన భారతీయుల వలన భారతీయ ప్రజలకి బాగా లాభం ఉన్నదేమో... అందుకే ఇలా చెప్పుకుంటున్నారు అని అనిపించింది ...!!!

అయితే, ఎవరి వలన డైరెక్టుగా ఎక్కువ లాభం భారతీయ ప్రజలకి కలుగుతోందో చూద్దాం అని అనిపించింది....

ఇంకేమున్నది....గూగులమ్మ ఉండనే ఉన్నది..... అందులో ఫ్యాన్సుకి కాకుండా.... ప్రజలకి ఉపయోగం దృష్టితో సెర్చ్ చేస్తే ఈ వివరాలు వచ్చాయి....


మొదటగా అదాని... డబ్బున్న ర్యాంకులో 2 ...

వారి దగ్గరున్న ఉద్యోగులు 17,000 మంది



బజాజ్...ర్యాంకు లేదు...ఉద్యోగులు 60,000 మంది 


బిర్ల గ్రూప్...ర్యాంక్ 8...ఉద్యోగులు  1,20,000


D మార్ట్...ర్యాంక్ 4...ఉద్యోగులు పరిమినెంట్  9,400
తాత్కాలికం....38,952


HCL...ర్యాంక్ 3...ఉద్యోగులు 1,59,000


HINDUJA...ర్యాంక్ ...ఉద్యోగులు 1,50,000


JSW ర్యాంక్.... ఉద్యోగులు....55,000


KOTAK...ర్యాంక్ 6...ఉద్యోగులు....33,000


L&T ర్యాంక్.....ఉద్యోగులు APROX  44,000


MITTAL ర్యాంకర్...ఉద్యోగులు షుమారు 3,20,000[2006]


RELIANCE GROUP ర్యాంక్...1....ఉద్యోగులు...1,95,618


TATA GROUP.....ఉద్యోగులు 7,50,000


పైవి కొన్ని ఉదాహరణలు.... వీటి బట్టి చూస్తే ర్యాంకర్ల కన్నా... ఏ ర్యాంకు లేని కంపనీల వల్లనే ప్రజలకి డైరెక్టుగా ఎక్కువ లాభం ఉన్నట్లు కనపడుతుంది... సరే బాగా డబ్బున్న కంపనీల వలన ప్రభుత్వానికి పన్నులు కొద్దిగా ఎక్కువ రావచ్చును...
"మన దేశంలో కూడా కోట్లు ఉన్నోడు ఉన్నాడు" అని 
అనుకోవటానికి తప్ప పెద్దగా ప్రయోజనం అయితే లేదు.... 
అభిమానుల అభిమానాన్ని ప్రక్కన పెడితే...
ఎవరికి ఎంత డబ్బు ఉంటే ఎవరికి లాభం.... 
వారి వలన ఎంత మంది  బ్రతుకుతున్నారనేదే సామాన్య ప్రజలకి ముఖ్యం...


---------------------------------
జై   హింద్ 
---------------------------------


దీనికి ముందు పోష్టు....

 27, ఫిబ్రవరి 2021, శనివారం


ఈ క్రింది లింక్ నొక్కండి

 TV 9 రజని గారు అడగని ప్రశ్నలు...

విషయం: విశాఖా స్టీల్ ప్లాంట్