LOCAL WEATHER

20, డిసెంబర్ 2012, గురువారం

"మయాన్ కేలండరా.... మతిలేని కేలండరా".......[హైదరాబాదు బీచ్....!!!]


అతిగా పెరిగిన మీడియా వ్యాధి వలన ఎక్కడెక్కడివో మూల ఉన్న మూఢ నమ్మకాల్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా రుద్దేస్తున్నారు..... ఒక చెంప సైన్సూ టెక్నాలజీ పెరిగింది అంటూ దేశంలో ఉన్న వారిని నమ్మిస్తూ, మన దేశంలో పాత కాలంలో ఉన్నవీ, పాత వారు చెప్పేవీ అన్నీ మూఢ నమ్మకాలే అని ప్రచారం చేస్తున్నవి మన మీఢియాలు;  మరొక చెంప, ఎక్కడో వేరే దేశపు మీడియాలో వచ్చే పనికి మాలిన చెత్తను మనకి   "సిక్రెట్టులూ", "ఎక్స్ జోనులూ", "వై జోనులూ" అని పేరు పెట్టి,  అదేదో నిజమైనట్లుగా చూపిస్తున్నారు.  పైగా, ఈ కార్యక్రమాలలో వచ్చే ఏంఖర్ల వాయస్సులు.......ఎదో సమాధిలో ఉన్న ప్రేతాత్మలు మాట్లాడినట్లుగా మాట్లాడి ప్రజలని భయపెడుతున్నారు.

ఈ విధంగా వచ్చి పడిందే దిక్కుమాలిన "మయాన్" కేలండరు........ దీనికేవో లెక్కలు ఉన్నాయిట..... వాటి ప్రకారం  "21-12-12న ప్రపంచం అంతం అయిపొద్దిట".......!!!  ఎక్కడ చూసినా ఈ పనికి మాలిన గోలే... స్కూలు పిల్లలు కూడా చెప్పుకునే విధంగా మన మీఢియాలు ప్రచారం చేసిపారేసినాయి. రేపు ఈ పేరుతో ఎవరైనా ఏదన్నా అఘాయిత్యానికి ఒడిగడితే, దానికి పూర్తి బాధ్యత మన మీడియా ఏమిటి....ప్రపంచ మీడియానే పూర్తి బాధ్యత వహించ వలసి ఉంటుంది. 

ఇక విషయానికి వస్తే, కేలండరుల లెక్కలకి ఒక ప్రాతిపాదిక ఎక్కడైనా ఉన్నదా......ప్రపంచంలో అనేక కేలండర్లు ఉన్నాయి..... ఎవడి అంకెలు వాడివి. అంతెందుకు, మన దేశంలోనే శాలివాహన శకం, కలియాది, అని రాష్ట్రానికో కేలండరు ఉన్నది...  ఇవ్వళ తారీకు యురప్ కెలండరు ప్రకారం 20-12-12 శాలివాహన ప్రకారం 8-8-1934, కలియాది ప్రకారం ఇది 5113 వ సంవత్సరం, మరొక హిజ్ర ప్రకారం ఇది 1434వ సంవత్సరం......ఇలా వందల కొద్దీ మన దేశంలోనే ఉన్నాయి. వేల కొద్దీ ప్రపంచంలో ఉన్నాయి..... ఏ లెక్క ప్రకరం సృష్టి అంతమో మన విజ్ఞానం కల మీడియా పౌరులు చెప్పగలరా....... 21-12-12  అనే ఫెన్సి డేట్ ..... అసలు అప్పటికి లేని క్రిస్టియన్ కేలండరు ప్రకారం,  మయాన్లు.....వాళ్ళ దినాన్ని[వాళ్ళు ఆ దినాన్ని] ఎలా నిర్ణయించారు. .!!!  అలాంటి వారిని మన అధిక విజ్ఞానం కల మీడియా వారు ఎలా నమ్మారు....??? ఏ నమ్మకాన్ని ఆధారం చేసుకొని తెగ ప్రచారం చేస్తున్నారు........???
  
భౌతికంగా కనపడిన వాటికే మనం సరిగ్గా లెక్కలు కట్టలేము. ఉదాహరణకు.. విజయవాడ నుండీ గుంటురుకు 43 కిలో మీటర్లు అని ఆర్టీసీ వారంటారు...... 32 కిలో మీటర్లు అని రైల్వే వారు అంటారు..... సరే, ఈ గొడవెందుకు..... మనమే లెక్క పెడితే; ..........కొలిచే టేపుని విజయవాడలో ఎక్కడి నుండీ పెట్టాలి...?? కనకదుర్గమ్మ గుడి దగ్గర నుండా....? బెంజి సెర్కిలు నుండా....??? లేక పాయకాపురం నుండా........???  అక్కడ,   గుంటూరులో.......బస్‌స్టాండు వరకా....? జిన్నా టవరు వరకా...? లాడ్జి సెంటరు వరకా......??? ఒక్కో చొట నుండీ ఒక్కో దూరం వస్తుంది.... ఇవ్వాళ ఇంత సాంకేతిక పరమైన విజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ.... విజయవాడ నుండీ గుటూరుకు ఉన్న దూరాన్ని సరిగ్గా పాయింట్లు కూడా సరిపోయేట్లు ఎవరైనా చెప్పగలరా....? చెప్పలేరు... ఎందుకంటే ఎవడి డైరెక్షను వాడిది..... ఎవడికి వాడు బయలుదేరి,  చేరుకొనే చొటుకే లెక్కలు వేయ్యగలడు.... కానీ అది మరొకడికి సరిపోదు..... అంతమాత్రాన విజయవాడ, గుంటూరులు ముందరకీ జరగవూ, వెనక్కీ జరగవు. ఈ విధంగా విజయవాడ, గుంటూరు పట్టణాల మధ్య దూరం కొలవటమే కష్టమైనప్పుడు..... హైదరాబాదు, బెంగుళూరు నగరాల మధ్య దూరం ఎవరైనా చెప్పగలరా...?? భూమ్మీద ఉన్న రెండు నగరాల, పట్టణాల దూరాన్నే చెప్పలేని వారు.... విశ్వంలో ఉన్నదాన్ని ఎలా చెప్పగలరు...???

ఇలా కనపడే దానినే సరైన లెక్కలు చెప్పలేకపోతే, ఏమాత్రం విజ్ఞాన పరికరాల సౌకర్యం లేని రోజులలో రాతిమీద వ్రాసుకొన్న దానిని ఆధారం చేసుకొని,  ప్రపంచ ప్రజలందరినీ అధారం లేని మూఢనమ్మకాల వైపునకి మళ్ళించటం, సరైన పద్దతేనా....??? ఏ రోజున ఎన్ని నిమిషాలకి  సుర్యోదయం అవుతుంది, ఎన్ని గంటలకి సుర్యాస్థమయం అవుతుందీ, ఫలానా సంవత్సరంలో ఎప్పుడు ఎన్ని నిమిషాలకి గ్రహణం వస్తుంది,  ఎన్ని నిమిషాలకి విడుస్తుంది అని చెప్పే జ్యోతీష్యాన్ని మూఢత్వంగా కొట్టిపారేసే మన విజ్ఞానం కల మీడియా........... మయాన్ మూర్ఖ కేలండరుకి ఎలా లొంగింది...??? ఇక్కడ జ్యోతిష్యాన్ని నమ్మమని నేను చెప్పబోవటం లేదు.  మన మీడియా వారి విశాల హృ'దయ్యం   గురించి మాత్రమే చెప్పదలుచుకొన్నా....!!! 

మీడియా హైదరాబాదు బీచ్ 

ఇకపోతే,   దీనిని శాస్త్రీయ పద్దతిలోనే  ఆలోచిద్దాము........  విశ్వ కొలతల గురించి ఎదో చెప్పి, ఆ లెక్కల ప్రకారం "బ్లాక్ హోలుకి" ఎదురుగా మనం నివశించే భూమి వస్తుందని చెప్పేరు...... ఒక వేళ అటువంటి కేంద్రమేదైనా ఉండి ఉంటే,  అది కేవలం భూమిని మాత్రమే లాగేసేంత  ఆకర్షణ శక్తి  మాత్రమే కలిగి ఉండదు.... మొత్తం సౌర కుటుంబమే దాని ఆకర్షణకి లోబడి ఉండే అవకాశం ఉన్నది....అంత శక్తివంతమైన బ్లాక్ హోల్ మన సౌర కుటుంబం దగ్గరలో లేదు......  అలా కాకుండా దాని కేంద్రం కేవలం చిన్నదిగా ఉండి భూమి కోసమే ఉంటే,  ఆ కేంద్రం నుండీ అనేక వేల  కోట్ల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న భూమిని ఇబ్బంది పెట్టేంత ఆకర్షణ  శక్తి ఆ "బ్లాక్ హోల్‌కి" ఉండదు...... [బ్లాక్ హోల్ అంటే అదేమీ "నల్లని బొక్క"  కాదు............ చనిపోయిన అంటే వెలిగే శక్తి తగ్గిపోయిన నక్షత్రం అన్నమాట. ఆ నక్షత్రం వెలుగులు తగ్గినాక దాని కేంద్రం కుంచించుకుపోయి "అత్యధికమైన ఆకర్షణ శక్తి" కలిగి ఉంటుంది. అలా అది దాని కేంద్రం వైపునకు అది కుంచించుకుపోతూ, దగ్గరలో ఉన్న ఇతర శకలాలని  దానిలోనికి లాక్కుంటుంది.  చివరకి ఆ ఒత్తిడికి  పేలిపోతుంది........దానినే "నోవా" అంటారు. ఇలా జరగటానికి కొన్ని కోట్ల సంవత్సరాల కాలం పడుతుంది.] 


హైదరాబాదు బీచ్ లాంటిది 

పైన చెప్పినట్లు రెండు ఊళ్ళ మధ్య దూరాన్ని అంచనా వెయ్యటానికే అనేక కోణాలు ఉంటే......... 0 నుండీ 9 వరకూ ఉన్న అంకెలతోనే అనేక వేల లక్షల కోట్ల అంకెలు తయారవుతుంటే....  ఇక, అనంత విశ్వంలో ఉన్న వేల కోట్ల నక్షత్రాల, గ్రహాల మధ్య ఉన్నఆకర్షణ శక్తిని మనం ఎలా లెక్కలు వెయ్యగలం......?? ఎందుకంటే విశ్వంలో ఎప్పటికప్పుడు అనేక   కొత్త నక్షత్ర  కుటుంబాలని కనిపెడుతునే ఉన్నారు....  ఆ కొత్తగా చేరిన వాటి యొక్క ఆకర్షణలని అప్పటి నుండే పరిగణలోనికి తీసుకుంటున్నారు.... ఇలాగ మనకు తెలియని విశ్వం గురించి పనికి మాలిన లెక్కలు కట్టి ప్రళయం వస్తుందని ఎలా చెప్పగలరు......??? మనకి దగ్గరలో బ్లాక్ హాలుగా మారి పోయే నక్షత్రం సూర్యుడు కాకుండా వేరేది లేదు.......... బ్లాక్ హోల్ గా మారటం అనేది రాత్రికి రాత్రి మారదు. సూర్యుడు కాకుండా, మరొక నక్షత్రం "ఆల్ఫా సెంటారై;  అది 4.2 కాంతి సంవత్సరాల [1 light-year =  5878625 trillion MILES] దూరంలో ఉన్నది.  అది ఇప్పటికి బ్రతికే ఉన్నది. ఒక వేళ ఇప్పటికే "DEAD STAR" అయినప్పటికీ, మన భూమికి  ప్రమాదం తెచ్చేంత దగ్గరలో లేదు.  కాబట్టి,  నిజంగా మన భూమికి కీడు చేసే దూరంలో ఎలాంటి బ్లాక్ హోల్ లేదు..... అందువలన,    "హైదరాబాదు బీచ్ వంటి  కాకమ్మ కదలని నమ్మొద్దని ప్రజలకి విజ్ఞప్తి.

ఇలా ఏమాత్రం ఆధారాలు లేనివీ, ప్రజలని భయభాంతులని చేసేవీ, ప్రజలని మూర్ఖులుగా మార్చేవీ, ప్రజలు స్వంతమైన ఆలోచనలను పాడుచేసేవీ ఏమైనా వార్తలు ఉంటే వాటికి ప్రాధాన్యతని ఇవ్వకుండా మన మీడియా  సంయమనంతో మెలగాలి..... చేతిలో మీడియా ఉన్నది కదాని,   "సెన్సేషనల్ మూఢ నమ్మకాలినీ, మీడీయా వారి స్వంత ఊహలనీ  ప్రజల మీద  రుద్దటం పెద్ద సామాజిక నేరంగానే పరిగణించాలి"..... ఈ విషయం తెలుసుకొని మీడీయా బాధ్యతతో మెలిగితే మంచిది......  అయితే, ఏదైనా ప్రజా సమస్య వచ్చినప్పుడు, ఒకటో రెండు రోజులో హడావిడి చేసి, మతిమరుపును నటిస్తూ, ..... మతిలేని మయాన్ కేలండరు లాంటి పనికిమాలిన విషయాలని పదే పదే ప్రచారం చేసే మీడియా నుండి బాధ్యతగల మంచి అంశాన్ని ఆశించటం  దురాశే అనుకొండీ.....!!! 



@@@@@@@@@@@@@@@@@@@     

దీని  మిద తమ అభిప్రాయాన్ని చెపుతు.........సాహిత్యాభిమాని ........
SIVARAMAPRASAD KAPPAGANTU గారు .............

ఇలాగే జల ప్రళయం గురించి 1950ల్లో ఒకసారి నానా గోల అయ్యింది. దేవుడినే
నమ్మని రచయిత చలం కూడా అప్పట్లో ఈ "ప్రళయ ప్రచారానికి" బలయ్యిపోయి, తనకు
తెలిసిన వారందరికీ ఉత్తరాలు వ్రాసి నవ్వులపాలయ్యాడు. మదరాసు నగరం
ప్రజల్లొ చాలా భాగం వేరే ఊళ్ళకి తరలి వెళ్ళిపొయ్యారు. చివరకు ఏమీ కాలేదు.

ఇలాగే 1960ల్లో అనుకుంటాను హైదరాబాదులో మూసీ నదికి వరదలు వచ్చాయి అన్న
పుకారు పడి  జనం మొత్తం మొత్తం ఎటుపోవాలో తెలియక దిక్కుతోచకుండా
భయభ్రాంతులై పరుగులు తీస్తుంటె,  ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వారు వెంటనే
లైవ్ కార్యక్రమం మొదలు పెట్టి , అనవసరంగా భయపడొద్దని, ఏమీ కాలేదని
ప్రజలను శాంతపరిచారు. ఆ ఆకాశవాణి మీడియా ఎక్కడ,  ఇప్పుడున్న వెర్రి
మొర్రి మీడియా ఎక్కడ.

కాసేపు ఈ ప్రళయం ఏదో వస్తుందనే అనుకుందాము. అలా వచ్చే ప్రళయం మనం
ఆపలేనిది అయినప్పుడు, మనం ఫలానా ప్రయత్నం చేస్తే ఆపొచ్చు అని
తెలియనప్పుడు, దాని గురించి ఇంత గోల దేనికి. అయ్యేది ఏదో అవుతుంది.
అవనీవండి. ఈలోగా ఈ పేలాలు ఏరుకు తినే బుధ్ధి దేనికి మీడియాకు.

1979 లో స్కైలాబ్ పడుతుంది అని నానా యాగీ జేసిన వార్తా పత్రిక ఇప్పటికీ
ఉన్నది.  అప్పట్లో ఆ స్కైలాబ్ కరీంనగర్ జిల్లాలో పడుతుందని ఊదర కొట్టేసిన
ఆ పత్రిక, అక్కడి ప్రజల భయానికి కారణం అయ్యింది,  అనేక మంది ఎలాగూ పొయ్యే
వాళ్ళమే కదా అని తమకున్న కొద్ది ఆస్తుల్ని అమ్మేసుకుని మజా
చేసుకున్నారుట. స్కైలాబ్ వాళ్ళ మీద పడలేదు. ఉన్న ఆస్తుల్ని అమ్ముకు
తాగేసిన తరువాత వాళ్ళ పరిస్థితి ఏమిటి? దానికి బాధ్యులు ఎవరు? మన
కామ్రేడ్ లు దీనికంతకూ అసలు కారణం కాపిటలిస్ట్ అమెరికా అని తీరతారు.
కాని, చివరకు వాయిస్ ఆఫ్ అమెరికా ప్రపంచ  వ్యాప్తంగా లైవ్ బ్రాడ్కాస్ట్
ఏర్పరిచి, స్కైలాబ్ ఎక్కడ ఎలా పడింది అనే విషయం ఎప్పటికప్పుడు నాసా నుంచి
ప్రసారం చేశారు. స్కైలాబ్  చివరకు ఆస్ట్రేలియా దగ్గర సముద్రంలో పడింది,
ఎవరికీ ఏ ఆపదా కలుగలేదు.  ఎక్కడి ఆస్ట్రేలియా? ఎక్కడి కరీంనగర్! పేపర్లు
అమ్ముకోవటానికి అనేక రకాల చిత్ర విచిత్రాలు. ఇర్వింగ్ వాలెస్ వ్రాసిన ఆల్
మైటీ నవల చదివి ఇలా జరుగుతుందా మరీ అన్యాయం అని అనుకునే వాళ్ళం, ఇప్పుడు
ప్రత్యక్షంగా చూస్తున్నాము. మీడియా మొత్తాన్ని వినోదాల చానెళ్ళుగా
ప్రకతించాలని నా డిమాండ్.


"నాన్నా తోడేలు" కథలో లాగా చివరకు నిజమైన ఆపద వస్తుంటే, మీడియాలో ఆ
విషయాలు చెపితే ఎవ్వరూ పట్టించుకోని స్థితిని, వారి ఓవర్ ఏక్షన్‌తో
కలుగుచేస్తున్నారు ప్రస్తుత మీడియా. ప్రభుత్వం  ప్రజలకు సవ్యమైన, నిజమైఅన
సమాచారాన్ని అందచేయాలంటే, ఈ మీడియా మీద ఆధారపడైతే ఆ సమాచారం ఎంతవరకూ
ఆధారపడతగ్గది అనే అనుమానం ప్రజలకు  కాలక్రమాన వచ్చి తీరుతుంది.







@@@ @@@ @@@ @@@ @@@ @@@ @@@ @@@ @@@ @@@




బొమ్మలు గూగుల్ లోనివి...మిక్సింగ్ కే ఆర్ కే 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి