LOCAL WEATHER

28, ఫిబ్రవరి 2015, శనివారం

మోడీ గారి బడ్జెట్టుతో జీవితాలే మారిపోతాయా...???

హమ్మయ్య రైల్వే బడ్జెట్టు తతంగం పూర్తి అయ్యింది...
సంచీలకి సంచీల బడ్జెట్ కాపిలని  పార్లమెంటు లోనికి తరలించటం....
ఆ తరవాత చెసిందేమిటిరా అంటే...
రోజువారి ఆఫీసు కార్యక్రమాల పట్టికని పార్లమెంటులో చదవటం...
ఆ చదవటాన్ని బడ్జెట్టు అంటారేమో...
ఆ సంగతి మోడీ గారికి, రైల్వే మంత్రి గారికే తెలియాలి... 
చదివిన దానిలో ఆదాయ-వ్యయ వివరాలూ
సంవత్సర కాలంలో ఏమీ చేయ్యబోతున్నారో ఒక్క వివరం లేదు... 
మరి ఇంకెందుకు ఆ సంచీలకి సంచీల ప్రతులను పార్లమెంటులోనికి చేరేయ్యటం...???
ఈ మాత్రానికి బడ్జెట్ ప్రకటన ఎందుకు...
"పాత ప్రాజెక్టులే పూర్తి చేస్తాం" 
అనే సింగల్ లైను ఉన్న కాగితం ఒక్కటి చదివితే సరిపొయ్యేది కదా...!!!
ఇంతకన్నా ఎక్కువ వ్రాస్తే...
ఇది రైల్వే బడ్జెట్ ఏమో అని అనుమానం వెయ్యచ్చు...!!!
ఇంతకన్నా ఎక్కువ వ్రాయాలిసిన గౌరవమూ ఈ బడ్జెట్టు అనబడే దానికి లేదు...

టివి దుకాణాలలో ప్రొద్దున్నే కూర్చొనే పెద్ద మనుషుల రైల్వే బడ్జెట్టు పై వాదనలు వింటుంటే 
ఈ పాత పాట గుర్తొచ్చింది....

ఈ పాట పూర్తిగా మన రాజకీయ నాయకుల వారి చెంచాల మనస్థత్వం పై 
వ్రాసినదే...పూర్తి పాట కోసం పై లింకు నొక్కండి...
బొమ్మలు సహజంగా గూగుల్ లోనివే
మిక్సింగ్ కే ఆర్ కే 

----


అదలా ఉంటే....ఈసారి జనరల్ బడ్జెట్ మీద ప్రతివారూ పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే, మోదిగారు వచ్చిన తరవాత మొట్ట మొదటి పూర్తి బడ్జెట్ ఇది... నిజమే వారు చేసిన ప్రచారానికి ప్రజలు ఇన్ని ఆశలు పెట్టుకోవటంలో వింతేమీ లేదు. అయితే, ప్రజల ఆశలకి అనుగుణంగా, సామాజికవేత్తల ఆశయాలకి తగ్గట్టుగా రాబోయే బడ్జెట్టు ఉంటుందా...???

"ఉండదు" అని ఖచ్చితంగా బడ్జెట్టు రాకముందే చెప్పెయ్యచ్చు..ఇదేమిటి మీరు వేరే పార్టీవారా...? లేక మోడీ అంటే గిట్టదా.. లాంటి అనేక సందేహాలుండచ్చు... కానీ, చెప్పొచ్చేదేమిటంటే, ఇక్కడ మోదిగారో-జట్లిగారో, లేక ఏ సామాన్యుల పార్టీ ఆప్ వారో అయినా బడ్జెట్టు అనేది ఒకలాగానే ఉంటుంది... ఇది రాజకీయ నాయకుల బట్టో, పార్టీల బట్టో లేక విప్లవ నాయకుల బట్టో మారదు...కారణం అక్కడ దీనికి సంభందించిన ఒక వ్యవస్థ ఉన్నది, కట్టుబాట్లు ఉన్నవి...పరిమితులు ఉన్నాయి...వాటికి లోబడి మాత్రమే బడ్జెట్టు రూపకల్పన చెయ్యబడుతుంది .... అంతేగానీ, ఏ వ్యక్తిని బట్టో ఇట్టే మారిపోదు.

అక్కడ ఒక తెడ్డేసే పడవ ఉంటే...దానిని ఏ విమానం పైలెట్టో పోనిస్తే పైకెగరదు కదా...కనీసం వేగంగా కూడా పోదు...దాని తెడ్లు వేసే విధానం బట్టి అది ముణగకుండా ఎంత వేగంగా వెళ్ళగలదో అంతే వేగంగా వెళుతుంది...మన ఆర్ధిక వ్యవస్థ కూడా పూర్తిగా లాంటిదే.. పైగా ఈ తెడ్డేసే వాళ్ళు అవసరానికి మించి ఉన్నారు... వాళ్ళ బరువు వల్లనే పడవ మునిగేట్టుంది... పడవలో ఎక్కే వాళ్ళ కన్నా...తెడ్డేసే వాళ్ళ సంక్షేమమే ఎక్కువగా చూడాలిసిన పరిస్థితి దాపురించింది... 

కాబట్టి, ముందర మార్చవలసినది తెడ్డేసే పడవని అదే...ఆర్ధిక వ్యవస్థ-విధానాన్ని...ఆ తర్వాతే దానిని పోనిచ్చే వ్యక్తి గురించి ఆలోచించాలి...అంటే ఈ రోజున ఓ గొప్ప వ్యక్తీ వచ్చి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నా పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు... ఆ వ్యక్తీ ముందరగా మార్చవలసింది అక్కడ పరిపాలిస్తున్న వ్యవస్థని...ఆ తరవాతే ఎవరైనా ఏమైనా చెయ్యగలిగేది...అలా మార్చాలంటే, అది ఒక్కరోజులో కాదు కదా కొన్ని సంత్సరాలకి కూడా కుదిరేది కాదు... అయితే, ముందర ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా అని అనిపిస్తుంది.... కానీ, అలా మొదలు పెట్టటానికి కూడా ఇవాళ ఉన్న వ్యవస్థలో ఊరుకునే పరిస్థితులు లేవు...

ఉదాహరణకి, పడవని తీసేసి అక్కడ స్టీమరు పెడదాము అని అనగానే..."మరి తెడ్డేసే వాళ్ళ సంగతి ఏమిటి" అని ఆ సంఘం వారు నిలదీస్తారు...ఆ బ్యురోక్రసి సంఘానికి రాజకీయ నాయకులు కూడా బానిసలే...ఆ బానిసత్వం నుండి బయటపడి, ఆ దిశగా మోదిగారు ఆలోచించి, "ప్రభుత్వ వ్యవస్థ అంటే ప్రజల నుండి పన్నులు వసులు చేసేదే మాత్రమే" అన్న అపోహ పోగొట్టే విధంగా మార్చిన తరవాత...అప్పుడు వచ్చే బడ్జెట్టులో ప్రజలకి పనికొచ్చే మంచి ప్రయోజనకరమైన విషయాలని మనం ఆశించ వచ్చును...

డ్జెట్టు ఆదర్శవంతంగా ఉండాలంటే...

1] ముందర బడ్జెట్టు తయారు చెయ్యటానికి అయ్యే ఖర్చుని తగ్గించాలి...అంటే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి... వచ్చే దానిలో అరవై శాతం ప్రజాసంక్షేమ కార్యక్రమాలు "తయారు చెయ్యటానికే" ఖర్చు చేస్తే...ఇక ఆ కార్యక్రమాలని అమలు చెయ్యటానికి డబ్బేది....ఉదాహరణకి రైల్వేలో వచ్చిన ఆదాయంలో అరవై శాతం ఉద్యోగుల జీతాలకి, పెన్షన్లకే సరిపోతోంది...అలాగే మునిసిపాలిటీలలో అయితే వచ్చిన ఆదాయం కనీసం వారి ఉద్యోగుల జీతాలకి కూడా సరిపోవటం లేదు... ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంస్థలో అయినా ఇదే తంతు...అందుకనే పాతకాలపు ఆర్ధిక వేత్త ఒకరు...ప్రభుత్వ ఆదాయంలో దాని వ్యయానికి 25 శాతం మించకుండా ఉంటేనే ఆ ప్రభుత్వం ప్రజలకేమైనా చెయ్యగలుగుతుంది అని అన్నాడు... అలా కాకుండా 100 కోట్ల ప్రజల దగ్గర పన్నులు వసులు చేసి కేవలం ఒక కోటి మంది సంక్షేమం కోసం ఖర్చు చేస్తే అది ఆదర్శ బడ్జెట్టు ఎప్పటికి కాదు... 

2] తరవాత, ప్రభుత్వం అంటే ప్రజలు బ్రతికే దారి చూపాలే కానీ, బ్రతికించే పని చెయ్యకూడదు...అంటే, ప్రజలు తమ పనులు తాము చేసుకుని బ్రతికేట్టు చెయ్యాలి... కానీ తమ రాజకీయ స్వార్ధం కోసం అనేక పధకాలంటూ ప్రవేశ పెట్టి వాటి ద్వారా పనులు చేసుకుందాం అనుకునే ప్రజలని కూడా చెడగొడుతున్నారు....అయితే, ఈ పధకాల ఖర్చుతో ఏ కొద్ది మందిని తప్ప సమాజాన్ని మొత్తాన్ని మార్చటం కుదరదు...ఇలా డైరెక్టుగా సమాజంలోని ప్రజలకి ఉపాధి పేరుతొ నిధులని దుర్వినియోగం చేసే కన్నా...ఆ ఉపాధి కల్పించే వారికి ప్రోత్సాహం ఇస్తే...అది ఏ కొందరికో కాక సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది...అంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకి పన్ను రాయతీలు ఇస్తే, వారి వలన ఉద్యోగ కల్పన జరుగుతుంది... అలాకాకుండా, ఉద్యోగాల ఇచ్చే పేరుతో ప్రభుత్వం తామే "కల్పిత ఉద్యోగాలని" సృష్టించ కూడదు...దీని వల్ల అనవసర ఖర్చు తప్ప ఉపయోగం ఉండదు...ఆ ఖర్చు కోసం తిరిగి సామన్య ప్రజల మీదే భారం వెయ్యాలిసి వస్తుంది. ఈ సంగతి ప్రభుత్వాలని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలకన్నా...ఏనాడు పరిపాలన చెయ్యకుండా, కేవలం సిద్దాంతాలు అంటూ రాధాంతం చేసే వారే ముందర తెలుసుకోవలసి ఉన్నది.

3] అలాగే, ప్రభుత్వ జోక్యం సామాన్యుల జీవితాల్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది...ఎవడైనా గాలికి తిరుగుతుంటే వాడి గురించి ప్రభుత్వానికి పట్టదు...కానీ, వాడేదో స్వంతంగా బ్రతకాలని చూడగానే... లైసెన్సులు, ఫీజులు, పర్మిషన్లు, పన్నులు అంటూ వాడిని బాధించి... స్వంతంగా బ్రతికేకన్నా, హాయిగా ఏ ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవటమే మేలు అని అనిపించేట్లు చెయ్యకూడదు...ఎవరో విదేశీయులకి ఫ్రీ జోన్లు అంటూ కల్పిచటం కాదు అదేదో దేశీయ ప్రజలకి అవకాశం ఇస్తే, ఆ విదేశీయుల కన్నా 100 శాతం అభివృద్ధిని చూపిస్తారు.... 

4] చేతిలో అధికారం ఉన్నది కదా అని ఉద్యోగులు కూడా... ఆయా బడ్జెట్టు రూపకల్పనలో తమ స్వార్ధం తాము చూసుకుంటున్నారు... ఉదాహరణకి పెన్షన్ మీద ఇంకం టాక్సు లేకుండా ఉండాలని వీరి వాదన... అవతల, సామాన్యులకి...నెలకి 15000/- వస్తే పన్నులు...దానిలో ఎంత రాయతి...ఆదిస్తే ప్రభుత్వానికి నష్టం అంటూ విపరీత వాదనలు ఈ ఉద్యోగులే చేస్తున్నారు... ఇక రాజకీయ నాయకుల సంగతి సరే సరి... తమ ఖర్చులు పెంచుకునే బిల్లుని తమ పార్టీల సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలసి, ఏకగ్రీవ నిర్ణయంతో పెంచేసుకుంటారు....అదే ప్రజలకి సంబంధించిన వ్యవహారంలో అయితే ...అది ఇంత-అంత నష్టం అంటూ లెక్కలు చెపుతారు...పైగా ప్రజలని త్యాగాలని చెయ్యమని... తమ ఏసీ రుముల్లోంచే సందేశాలని ప్రజలకి ఇస్తుంటారు...మరోప్రక్క తమ మూఢ నమ్మకాల కోసం అనవసర ఖర్చులు చేస్తూ. ఇంతకీ ఆ డబ్బు వసులు చేసేది రాజకీయ నాయకుల నుండి కాదు, ఉద్యోగుల నుండి కాదు... ప్రజల నుండే. ప్రజల నుండి వసులు చేసిన డబ్బుని ప్రజల కోసం ఖర్చు చెయ్యటం నష్టమని[లింకు నొక్కండి] మన దిక్కుమాలిన రాజకీయ ఆర్ధిక వేత్తలు అనుకున్నంత కాలం ప్రజలకి మేలు చేసే బడ్జెట్టు రాదు....

అప్పటిదాకా ప్రభుత్వం అంటే అది మన పనులకి అడ్డం రాకపోవటమే అది చేసే పెద్ద మేలు అని అనుకోండి......అందు వలన ఓ ప్రజలారా మీరు మీమీ పనుల మీదే దృష్టి పెట్టండి...రైల్వే బడ్జెట్టులాగానే ఇది కూడా దేవతా వస్త్రం లాగానే ఉండచ్చు... కాబట్టి, ఇలాంటి బడ్జెట్టుల మీద అనవసర ఆశలు పెంచుకోకండి..అవి అడియాశలై ఇప్పటిదాకా మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీద కోపం పెరిగే అవకాశం కూడా ఉన్నది...


రాజకీయ మీడియా పులుల భాగోతం..
=========================================================

ఇది ఇలా ఉంటే, ఈ రైల్వే బడ్జెట్టులో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ వస్తుందని అందరూ ఆశించారు...అయితే, అది రాకుండా ఉండటానికి ఎవరో కాకుండా,  మనవారే అడ్డు పడటం అసలు విశేషం. ఎలా అంటే, రైల్వే వారు దక్షిణ మధ్య జోన్ నుండి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను వేరుచేసి  జోన్ చేద్దామని, దానిని గుంటూరు లేక విజయవాడలో పెడదామని అనుకున్నారట...దానికి పేరుతొ సహా కావాలిసిన అనేకం జరిగిన తరవాత...దానిలో రాజకీయ జోక్యం ఎక్కువై..దీనిని విశాఖలో పెట్టాలని మొదలైయ్యింది...అలా పెట్టాలంటే ఒరిస్సా వారిని ఒప్పించాలిసిన పని పడింది... ఎక్కువ ఆదాయం వచ్చే విశాఖ డివిజన్‌ను వదులుకోవటానికి వారు ససేమిరా అంటున్నారు... ఈ గోలలోపడి, పెడితే అక్కడే పెట్టాలనీ, లేకపోతే అసలు పెట్టకూడదు అనేదాకా వెళ్ళింది...

వీళ్ళు మూర్ఖ్లులు కాకపొతే...ముందర జోన్ అంటూ చేసిన తరవాత, మిగిలినవి ఆలోచించ వచ్చును కదా... అభ్యంతరం లేని...విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ముందర జోన్ ఏర్పాటు చేస్తే, తరవాతి రోజుల్లో విశాఖ డివిజన్‌ను కూడా దానిలో కలపవచ్చునుకదా...అన్నీ ఇప్పుడే కావాలంటే అసలుకే మోసం వస్తోంది....ఇప్పుడు తెలుగుదేశం మరియూ బిజేపి వారితో కలసి కేంద్రంలో బలం ఉండి కూడా... ఒక లోకల్ పార్టీ నాయకుడు ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ గారిని ఎదిరించలేకపోతే...రేపు వచ్చే రోజులలో అక్కడ ఉన్న బలం కూడా పోయిన తరవాత ఇంకేమి చెయ్యగలరు....??? దీనిబట్టి అర్ధం అయిందేమిటంటే...తెలుగుదేశం బాబుగారి కన్నా, బిజేపి నాయుడు గారికన్నా...కేంద్ర ప్రభుత్వంతో సత్ సంబంధాలు లేని పట్నాయక్ గారి పార్టీనే బలంగా ఉన్నదనుకోవాలి...వారు వారి రాష్టంలోనే కాకుండా ఆంధ్రాలో కూడా చక్రం తిప్పగలుతున్నారు...మనవారు మీడియా పులుల గానే మిగిలి పనులు చేయించుకోవటంలో పిల్లులకన్నా హీనంగా ఉన్నారు... డివిజన్‌కు...జోన్‌కు తేడా తెలియని మన మీడియావారి గోల సరేసరి....  మన అనైక్యతే వారి బలంగా ఉన్నది....కాబట్టి, మన తెలుగు నాయకులు అనవసర వాచాలతని కట్టి పెట్టి, మీడియాలో పవర్ కాకుండా రియల్ పవర్ చూపించి మన రాష్ట్రానికి రావాలిసినవి సాధిస్తే వారికే మంచిది...



@@@@@@@@@@@@@@
బొమ్మ కర్టేసి గూగుల్...మిక్సింగ్ కేఆర్క్ 
@@@@@@@@@@@@@@

ఇంతకు ముందు వ్రాసిన కొన్ని వ్యాసాలు...
[క్రింది లింకులు నొక్కండి]



జారిపడ్డ రూపాయి ......."ఇసయం" తెలియని భీమన్న.......!!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి