LOCAL WEATHER

28, జులై 2013, ఆదివారం

భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!

ఇప్పటి దాకా భారతదేశ  అన్నీ విచ్చిన్నాలకి కారణం కాంగ్రెస్సే అని చెప్పవచ్చును. ఎక్కడ కాంగ్రెస్సు అధికారం లేదో అక్కడే వేర్పాటు వాదాలు వస్తాయి. కుదిరినంతవరకు విడగొట్టి అధికారం చేజిక్కించుకోటానికే అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తుంది. కుదరకపోతే లోకల్ గా ఉన్న ఉద్యమాలను రెచ్చగొట్టి చలి కాచుకుంటుంది. అలా కాకుండా ఈ లోగానే అక్కడ అధికారం వస్తే ఆ ఉద్యమాలని విభజనలని మర్చిపోయినట్లుగా ఉంటుంది. వీలయితే ఆ ఉద్యమాల మీద కడివెడు నీళ్ళు పోస్తుంది. మరల అధికారం పోగానే పోగాలం దాపరిస్తుంది. ఇదేదో ఆ పార్టి మిద కోపంతో వ్రాసినది కాదు. స్వాతంత్రం వచ్చిన తరవాత భారతదేశ రాష్ట్రాల విభజన జరిగిన విధానం చూస్తే మనకే  తెలుస్తుంది.

1]ముందరగా దక్షిణ దేశ విభజన......అవిచ్చిన్న మదరాసు రాష్ట్రంలో ఎప్పుడైతే ద్రవిడుల ఉద్యమాలు పుట్టబోతున్నాయో  అప్పుడే ఆ రాష్ట్రం విచ్చిన్నం అయిపోయింది. ఒక్క రాష్ట్రం నాలుగు ముక్కలు అయిన తరవాత కేవలం ఒక్క రాష్ట్రంలోనే ద్రవిడులు పాగా వెయ్యగలిగారు.  ద్రవిడులు పాతుకున్నచోట కనీసం వేలుకూడా పెట్టలేని స్థితి ఇప్పుడు ఉన్నది. ఈ స్థితిని ముందరే ఊహించిన కాంగ్రెస్సును అభినందించలేకుండా ఉండలేము.

పనిలో పనిగా ఆ కాలంలోనే అనేక రాష్ట్రాలు ఏర్పడినాయి. ఆ విభజనల ద్వారా కాంగ్రెస్సు పటిష్టమైన పునాది ఏర్పాటుచేసుకున్నది. పాపం చాలామంది అవి "భాషాయుక్త రాష్ట్రాలని" భావించారు. కానీ, అవి "కాంగ్రెస్సు[కుట్ర]యుక్త" రాష్ట్రాలని తెలిసుకోలేకపోయ్యారు. అలా వీరు మేనేజ్ చెయ్యగలిగారు. అప్పట్లో ఇప్పటి అంత విచ్చల విడిగా ఉండే మీడియా లేదు కదా....చీల్చి చెండాలటానికి........

పైన జరిగిన దానికి ఋజువులు ఏవున్నాయి.....  ఆ విభజన జరిగిన తరవాత అక్కడ కాంగ్రెస్సు బలంగా పాతుకుపోవటమే..... అదే కాకుండా......ఇప్పటి కాంగ్రెస్సు నీతిని కూడా కలిపి చూస్తె ఇట్టే  తేట తెల్లం అవుతుంది.

2]ఇక ఉత్తరదేశంలో చూస్తే, కాంగ్రెస్సుకు బలమైన కోట ఉత్తరప్రదేశ్ లో ఇతర పార్టీలు అయిన బిజెపి, బిఎస్పి, ఎస్పీలు పాతుకుపోవటం, కాంగ్రెస్సుకి దిక్కే లేకపోవటం జరిగింది. అందులో నుండి ఉత్తరాఖండ్ పుట్టింది...ఈ ఖండులో కాంగ్రెస్సు బిజెపికి మంచి పోటిని ఇవ్వటమే కాకుండా అధికారాన్ని కూడా చేజిక్కించుకునే పరిస్తితిలోనే ఉన్నది.  చేజిక్కించుకున్నది కూడా........

3] ఇక బీహారులో సంగతి తెలిసిందే.....అక్కడ కాంగ్రెస్సుకి   ఎంత బలమైన వేళ్ళున్నప్పటికి..వాటిని తెగ్గోట్టుకొని బిజెపి, ఆర్జెడిలు వచ్చినాయి. అంతే, దక్షిణ బీహారు...ఝార్ఖండ్ తెగిపడింది.  కానీ, అంత మంచి ఫలితాలని ఇప్పటికైతే కాంగ్రెస్సు సాధించలేదు కానీ, భవిష్యత్తులో కాంగ్రెస్సుకే  లాభం. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్సు ప్రతి పక్షాలు ఒకటికి రెండు, మూడు  పార్టీలుగా చీలిపోయ్యాయి. ఇవ్వాళా కాకపొతే రేపు. భవిష్యత్తు అధికారం మిద నమ్మకం ఉన్న పార్టి కదా....

4]మధ్యప్రదేశ్...ఇక్కడ కూడా బిజేపినే కాంగ్రెస్సు కి  శత్రువు అయ్యింది.....దానితో  చత్తీశ్ ఘర్ పుట్టింది.

ఇక్కడో మాట చెప్పుకోవాలి. సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడే తాము గెలిచామన్న సంగతి మరచిన తెలివి తక్కువ బిజేపినే ఈ పైన ౩ రాష్ట్రాలనీ  విభజించింది. ఆయా రాష్ట్రాల విభజన తరవాత బిజెపికి కష్టాలు మొదలైనాయి...... అలా తెలివిగా పావులు కదిపినది మరి ఇంకెవరు....కాంగ్రెస్సే....

5] మహారాష్ట్రా........ఇది త్రుటిలో విభజనను తప్పించుకొన్న రాష్ట్రం .......ఇక్కడ కాంగ్రెస్సుకి దీటుగా శివసేన మరియు బిజెపిలే కాకుండా ఎన్సిపిలు వచ్చిపడ్డాయి. ఎప్పుడో మరిచిపోయిన విదర్భ రాష్ట్రం పైకి వచ్చింది...బ్రిటిషు కాలంలో సెంట్రల్ ప్రావెన్సుకి రాజధానిగా ఉన్న నాగపూరే దీనికి కేంద్రం. అయితే, ఈలోగా శివసేనా బిజెపిల మధ్య సరిగా సయోధ్యలేకపోవటం......ఎన్సిపి  కాంగ్రెస్సుకి మిత్రుడిగా వ్యవహరించటంతో మహారాష్ట్ర  పీఠం కాంగ్రెస్సు ఆధీనం అయ్యింది. లేకపోతే ఈ పాటికి విదర్భ రాష్ట్రాన్ని కూడా అమాయక బిజేపినే ఏర్పాటు చెయ్యవలసిన పరిస్తితి వచ్చేది. 

6] దరిదాపులు ఇలాంటిదే రాజస్థాన్...ఇక్కడ కూడా కాంగ్రెస్సుకి బిజెపి వల్లనే ఎదురు దెబ్బ తగిలింది. అధికారాన్ని కోల్పోయింది. దానితో ఇక్కడ వేరే వేర్పాటు వాదులు లేకపోవటంతో...కులాల గొడవలు మొదలైనాయి. దానితో బిజెపి అధికారాన్ని కోల్పోయింది. మరల కాంగ్రెస్సు అధికారంలోనికి వచ్చింది. ఆ కులం వారికి చేసింది ఏమి లేదు కానీ. అక్కడ గొడవలు పెద్దగా కనపడటం లేదు.

7] అస్సాములో అక్కడి విద్యార్ధి పరిషద్ అధికారం లోనికి రాగానే అక్కడి బోడో లెండు ఉద్యమం పైకి లేచింది. దానితో కొత్త పార్టి మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు అక్కడ అధికారం కాంగ్రెస్సుదే....  మరీ....బోడోలేఁడు ఉద్యమం...., ప్రస్తుతానికి దానితో పనిలేదు.........

8]కమ్యునిస్టుల కోట బెంగాలులో ప్రయత్నం విరమిచుకుంది. ఎందుకంటే ఆ గూర్ఖా లేఁడు అని అడగబడేది భారత బోర్డర్ లో ఉన్నది. అయితే ఈ మధ్య మమత గెలవటంతో అది తిరిగి రాజుకో చూస్తోంది.

9]ఇలా బోలెడు ఉదాహరణలు చెప్పుకోవచ్చును......అంతదాకా ఎందుకు మనమే ఉన్నాము కదా.......తెలుగుదేశం అదే పనిగా గెలవటంతో....పాపం కాంగ్రెస్సు మంచిగా చెప్పా చూసింది......... అంటే తెలుగు దేశం పార్టిని ముక్కలు చేసి తద్వారా అధికారాన్ని పొందాలని.........కానీ, అక్కడ ఉన్నది కాంగ్రెస్సు తెలివే కదా!!!  కుదర లేదు...... దానితో ఎప్పుడో  1969లో మరచిపోయిన తెలంగాణా ఉద్యమం మరల టి.ఆర్.ఎస్స్  నీడగా మొదలైయ్యింది. కానీ, రాజశేఖర రెడ్డి పుణ్యమా అని కాంగ్రెస్సు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.  రెడ్డిగారి పాలనలో కాంగ్రెస్సు పద్ధతిలో క్రమంగా ఆ ఉద్యమం నీటగలవటానికి కావాలిసిన అన్నీ రెడ్డిగారే చూసుకొన్నారు.  కానీ,  దురదృష్టవశాత్తూ రాజశేఖర రెడ్డిగారు మరణించటం జరిగింది.

పూర్తిగా నీటగలవని ఉద్యమం తిరిగి ఊపందుకుంది. దానితో ఈ ఉద్యమం కాంగ్రెస్సుకే భస్మాసుర హస్తంగా మారింది. ఇక్కడ ఓ ముచ్చట చెప్పుకోవాలి. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇలా కాంగ్రెస్సు కి ఝలక్ ఇచ్చింది మన తెలంగాణా తమ్ముళ్ళే. ఈ విధంగా తెలుగుదేశం పార్టిని నాశనం చెయ్యటానికి వేసిన అస్త్రం తిరిగి కాంగ్రెస్సునే గురిపెట్టింది. దానితో దిక్కుతోచక మూడు నాలుగు సంవత్సరాలుగా ముల్లోకాలు పరుగులు తీసి, తమని రక్షించే వారే లేరు కదా అని తలచి.....తిరిగి రాష్ట్ర విభాజనవైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా నటించసాగింది. ఎందుకంటే........ "విభజనాంధ్ర కంటే విశాలాంధ్ర " అధికారం వల్లనే లాభాలు ఎక్కువ అని కాంగ్రెస్సుకి తెలుసు.  కానీ, ఇంతలో....... కాంగ్రెస్సుకి  కత్తిగా ఉపయోగపడి,  దేశాన్ని ముక్కలుగోట్టటంలో ఆరితేరిన బిజెపి, తెలంగాణా మేము 2014కల్లా మేమిస్తాం అనటంతో.......కాంగ్రెస్సుకి తెలంగాణా భారం నుండి తప్పించుకోవటం కష్టమని తెలిసిపోయింది. అయితే ఏం, "కాంగ్రెస్సు మాత్రమే అధికారంలోనికి వచ్చేట్టుంటే మాకు అభ్యంతరం లేదని" చాలా ఓపెన్ గా పైకే చెప్పేసింది. దానికి కావాలిసిన రాష్ట్రంలోని ఏ ముక్కలు కలిపితే లాభమో చూసే పనిలో పడింది.  

అయినా ఇష్టంలేని పని చేస్తున్నట్లుగానే రేపు ఏమైనా అవకాశం వస్తుందేమో అన్నట్లుగా దిక్కులు చూస్తూ బడికి వెళ్ళటం ఇష్టంలేని కుర్రాడిలా తెలంగాణా వైపు అడుగుగులు వేస్తోంది. అయితే ఇది జరిగే వరకు నమ్మలేము. అన్నం[ఉద్యమం]వండటం వచ్చిన వీరిని.....అన్న ముద్ద పెట్టి మింగి, కడుపులోనికి వెళ్ళేదాకా నమ్మలేము. TOM & JERRY  కార్టూనులోలాగా కడుపులో చేయ్యపెట్టి అయినా తినే ముద్దని తీసే తెలివితేటలూ కాంగ్రెస్సుకి ఉన్నాయి. రాయలసీమని విభజిస్తే వారు ఊరుకోరు, 10 జిల్లాల తెలంగాణా ఇవ్వకపోతే వీరు ఊరుకోరు, రాష్ట్రాన్ని విభజిస్తే డబ్బులనీ/పిల్లల ఉద్యోగ అవకాశాలని హైదరాబాదులో మాత్రమే తెలివి తక్కువగా ఇరకబెట్టుకొన్న కోస్తా ఆంధ్రా వారు ఒప్పుకోరు. మరి దీని పరిష్కారం ఎలాగో కాంగ్రెస్సు వెండి తెర మీద మాత్రమే చూడగలము.

ఇదేదో గొప్ప విశ్లేషణ కాదు,  ఆ రెండు పత్రికలూ ఈనాడు-ఆంధ్రజ్యోతి.......ఆ మరిచాను మరో మూడోవ పత్రిక కలిసింది కదా సాక్షి....  దినపత్రిక వాళ్ళు వ్రాసినది కాదు...... మరే ప్రతి పక్షం వారు ఆరోపించినదీ కాదు.   స్వాతంత్రం వచ్చిన తరవాత కాంగ్రెస్సు తంత్రాని గమనిస్తే అందరికి తెలిసే విషయమే...గొప్ప రహస్యం ఏమి కాదు.... 

దీనిబట్టి మనకి తప్పనిసరిగా అర్ధం అవ్వ వలసినది ఏమంటే.......కాంగ్రెస్సు ఒక్కటే దేశ సమైక్యతని కాపాడే పార్టి.  కాకపోతే దీనికి కోపం తెప్పించ కూడదు....... అలా కోపం తెప్పించిన ప్రతిపక్షాలే దేశ............ సారి.......... రాష్ట్ర విచ్చిన్నాలకి కారణం.........!!!! నమ్మాలి మరి.......




@@@@@



రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???







26, జులై 2013, శుక్రవారం

స్పెయిన్ రైలు ప్రమాదం వీడియో



స్పెయిన్ లో జరిగిన రైలు ప్రమాదం.
నాలుగు దశాబ్దాలలో ఇదే పెద్ద ప్రమాదంట.


@@@@@@@@@@@@@@
కర్టేసి యు ట్యూబ్ 
@@@@@@@@@@@@@@



16, జులై 2013, మంగళవారం

పదవి అంటే లక్కు కిక్కా..........!!! అదిపోతే త్యాగమా......???

ఎన్నికలు అంటూ ఏవో ఒకటి వస్తే చాలు మన మీడియా వారికి పండగే పండగ....ఎక్కడలేని విపరీత కవరేజి ఇటు పేపర్లలోనూ, అటు టివీలలోను ఊదరగొటేస్తారు. ప్రజాసామ్యానికి మంచిదే కానీ, వీరు ప్రజల కోసం ప్రజాసామ్య రక్షణకే వ్రాస్తున్నారా...........చూపిస్తున్నారా........చర్చిస్తున్నారా.....

ఎంతో భాద్యతాయుతమైన వీరు వాడే భాష చూస్తే అసలు ఎన్నికల గురించా లేక ఏదైనా సినిమా గురించా అని అనిపించక మానదు... "రసకందయంలొ పడింది", "రసవత్తర పోరు",  "ఒంటరి పోరు", "ఓటు బ్యాంకు","కుల సమీకరణాలు/వర్గీకరణాలు", "ఎన్నికల సందడి" , పదవీత్యాగం.....త్యాగం అంటే ఏమిటో.....!!!! ఇలా మరోటీ...మరోటీ...... 
దీనికి పెట్టాలిసిన హేడ్డింగేనా...??? వీరి భాషలో లక్కంటే.....
పదవి అంటే డబ్బులు కురిపించేది అని  దీని అర్ధంమా.....!!!
ఎన్నికల ముందరే ఇలా అనేస్తే ఇక వారు కొద్ది పనైనా ఎలా చేస్తారు....???
ఇవి మచ్చుకకు మాత్రమే.....ఒక పేపరు అని కాదు అన్నీ ఒకటే........

ఎన్నికలకి సంబంధించి... ఆ నుంచునే అభ్యర్దుల గుణగణాలు, తరవాత వారు చెయ్యబోయే అభివృద్ధి పనులూ, అసలు చెయ్యగలిగే శక్తి ఉన్నదా లేదా, వారు ఇంతకు ముందు ఏ ఏ ప్రజా కార్యక్రమాలలో పాల్గోన్నారూ...ఇలాంటి అనేక విషయాలని అసలు ప్రస్తావించరు. 

ఆ వ్యక్తి కులమేమిటీ, ఆ నియోజక వర్గంలో అతడి తాలూకూ దండెంత ఉన్నది... అందరినీ "కూడగట్టగలడా"...అతడి మతస్తులు అక్కడ ఉన్నారా.....ఉంటే వీరి మాట చెల్లు బాటు అవుతుందా.....ఇలాంటి పనికి మాలిన విషయాల పట్ల ఉన్న శ్రద్ధ, ఆ వ్యక్తి యొక్క శక్తి... అభివృద్ధికి పనికొస్తుందా రాదా అనే విషయం మీదా ఉండదు. పైగా వీరు[మీడియా వారు] కులాలకీ, మతాలకీ, ప్రాంతీయ తత్వానికీ వ్యతిరేకంగా పొరాడుతున్నామనే పేద్ద బిల్డప్పూ.....

ఒకప్పుడు ఈ ఎన్నికల్లో పాల్గొనే వారు చేసే పాడు పనులని రహస్యంగా, ఎంతో కొంత సిగ్గుపడుతూ చేసే వారు....ఎప్పుడైతే గుట్టు విప్ప తీసి చూపించే మీడియా వచ్చిందో....అప్పటి నుండి మరీ బరితెగించి పాడు పనులు చేస్తున్నారు. దీనికి కారణం మీడియా "పెద్ద మనిషి" లక్షణమే.... అంటే, ఆ గుట్టు అనేదానిని అమర్యాదగా కాకుండా చాలా మర్యాదగా ప్రోజెక్టు చెయ్యటం......

కనీసం 10 నుండీ 20 సంవత్సరాలలో మీడియాలొ వచ్చిన ఏ పేపరు కటింగునైనా.....టీవీలలో వచ్చిన ఏ వార్తనైనా పుచ్చుకొని.... అవి  అసలు రాజ్యాంగ పరిధిలొ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయా అని చూసి కనుక, చర్యలు చేపడితే.....కనీసం 99 శాతం పైన మీడియా సంస్తలు వేల కోట్లు జరిమానాలు కట్టడమో లేక మూత వెయ్యాలిసిన పరిస్థితి రావటమో జరుగుతుంది. 

మీడియా అంటే ప్రజలకీ...ప్రజలకీ,  ప్రజలకీ...పాలకులకీ మధ్య ఉండే ఆరోగ్యకరమైన వారధిగా ఉండాలే కానీ, రాజకీయ నాయకులు ఇప్పటిదాకా చెయ్యనీ పనులని పైకెత్తి చూపాలే కానీ... సంఘలో ఉన్న వికారాలని విశ్లేషించి వాటిని రెచ్చగోట్టేట్లు ఉండకూడదు. పాడు పనులు చేసి సిగ్గుపడే వారిని సిగ్గు పడేట్లు చేసేట్లు భాష ఉండాలే కానీ...ప్రోత్సాహించేటట్లు ఉండకూడదు. అశ్లీల భాష అంటే బూతులు అనే కాదు....పాడు పనులు చేసేవారిని ప్రోత్సహించే భాషని కూడా అనవచ్చును. కానీ, దొంగలని, నేరగాళ్ళను, ఉగ్రవాదులని....."వారు వీరు" అని సంభోదించి, స్వామిజిలని.......మతాలకి సంబందించీనవారిని "అతని ఇతను" అని అనే వీళ్ళకి ఉన్న భాషా జ్ఞానం ఏమిటో తెలుస్తోనే ఉంటుంది అనుకోండి.....

లేని బుద్ధిని రప్పించ వచ్చును....కానీ, పొగట్టుకున్న/మరచిపోయిన దానిని తెప్పించటం చాలా కష్టమైన పని అయినప్పటికీ...మీడియా వారు ఆ దారిలో నడచి.. పోగొట్టుకున్నవారి మానాన్ని తిరిగి పొంది, వృత్తికి న్యాయం చెయ్యాలి. డబ్బు కోసమో, ప్రజాదరణ అనుకున్న దాని కోసమో అయితే, వాటికోసం అనేకమైనటువంటి వృత్తులున్నాయి....కానీ పవిత్రంగా ఉండాలిసిన ఈ వృత్తిని భంగాన్ని చెయ్యకూడదు.!!!! డబ్బు కోసం పేపరు మొదటి పేజి  నిండా ప్రకటన వేసే వీరికి చెప్పటం కష్టమే అనుకోండి.......!!!








15, జులై 2013, సోమవారం

అనుకోకుండా ఓ విడియో........!!!

అది విజయవాడ బందరు రోడ్డు ఠాగూర్ గ్రంధాలయం ఎదురుగా....నేను గ్రంధాలయాన్ని విడియో తీస్తున్నాను... నా చిన్నప్పటి నుండీ అనేక పుస్తకాలని చదింది ఇందులోనే.....

వీడియో తీస్తుండగానే అనుకొని దృశ్యం [అవుటాఫ్ ఫోకస్ లో]  ఐ పొడ్ కెమేరా బంధించింది ....అదే ఈ క్రింది వీడియో.....[పెద్ద విడియోలో కట్ వలన క్లారిటి తగ్గింది]

యాక్సిడెంటు.... స్లో మోషన్ లో.....కూడా...

ఎవరికీ కూడా గాయాలు అవకపోవటంవల్ల యాక్సిడెంటు చిన్నదిగానే కనపడినా....వేన్ డ్రైవర్ దయాదాక్షణ్యాల మీదే ముగ్గురూ బ్రతికారు. విచిత్రమేమంటే...వేన్ ముందర నుండీ దూసుకొచ్చిన అతడే ఎదురు పోట్లాడటం....!!! 

తొందరపాటుగా వెళ్ళటానికీ, 
చూసుకొని ప్రశాంతంగా వెళ్ళటానికీ, 
కేవలం కొద్ది సెకండ్లే తేడా ఉంటుంది.....
కానీ, 
మూర్ఖులకి ఎవరు చెప్పగలరు....???
 నిమిషం ఆలస్యంగా చేరుకోవటం వల్ల ఏమి కొంపలు ముంచుకుపోతాయి....? 
6 నెలలు బెడ్‌మీద ఉండేకన్నా నయమే కదా...!!!
 ఇలాగే, 
రైలులో కొన్ని వందల కిలో మీటర్లు ప్రయాణించి...
తీరా స్టేషను వచ్చేసరికి..ఎంట్రన్సు దగ్గర రన్నింగులో దిగేసి 
హీరోలమని అనుకునేవారెందరో.....
రైలు ఆగిన తరవాత కొద్దిగా వెనక్కి నడిచి బయటకి వెళ్ళటం తేలికో....?
లేక, 
సూటిగా పైకి వెళ్ళటం మంచిదో....? 
వారికే తెలియాలి....!!! 


@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@




11, జులై 2013, గురువారం

ఏది నాగరిక భాష....??? వావి వరుసలకి పేరే పెట్టుకోలేనిదా....!!!!!!

మాది నాగరిక భాష, మాది నాగరిక భాష అని రకరకాల భాషల వాళ్ళు గప్పాలు కొట్టుకుంటున్నారు..... మరి మానవ భాషలొ ఆ "నాగరికం" అంటే ఏమిటో తెలియదు......కానీ, మానవుల మధ్య  ఒకరి భావాన్ని మరొకరికి తెలియచేసే ముఖ్యమైన మాధ్యమం అయిన "భాషలో", మానవుల మధ్య వావి వరుసలు తెలియచేసే మానవ సంబంధాల్ని నిర్ధారించుకోలేక, వాటికి పేరే పెట్టలేని భాషలు అనేకం "నాగరిక భాషలుగా" చలామణి అవుతున్నాయి.

అయితే, ప్రపంచ నాగరీకులేకాదు, కొంతమంది తెలుగువారి గుర్తింపు లేని.......మన భాషలో.... అంటే తెలుగులో.......దరిదాపుల ప్రతీ మానవ సంబంధానికీ ఓ గుర్తింపు పదం ఉన్నది....... ఏదో కొద్ది సంబందాలకి ఒకే పేరు పెట్టినప్పటికీ.........పిలుపులలో గౌరవం ద్వనించేట్లుగా చేసి విభజన చూపింది. తెలుగులొ ఆడవారికే ఎక్కువ గుర్తింపునిచ్చారు....ఉదాహరణకి... "అత్తగారింటికి వెళ్ళాను" అని చెపుతారే కానీ, మామగారి పేరెత్తరు ఆయనెంతటి ఆఫీసరైనా సరే...అలాగే బంధుత్వాల పేర్లలో మొగ వారికన్నా...ఆడవారి గుర్తింపే ఒకింత మొగ్గటం కనపడుతుంది......ఒక్క బాబాయ్.....మామయ్యలు తప్ప...........

తరవాత, అన్నదమ్ముల పిల్లలు ఒకరికొకరు తమ బంధం  చెప్పుకున్నప్పుడు  "వేలువిడిచిన" అని వాడుకలో ఉండేది.....కానీ, ఇప్పుడు దానినే కజిన్ అని వాడుతున్నారు.  అయితే ఈ "వేలువిడిచిన" అనేదానికి కాస్త విస్తృతమైన అర్ధమే ఉన్నట్లు కనపడుతుంది. కేవలం అన్నదమ్ముల పిల్లల మధ్య ఉన్న బంధాన్నే కాకుండా, దూరపు వరుస అయిన చుట్టరికాన్ని కూడా చెప్పుకునేప్పుడు దీనిని వాడతారు. ఉదాహరణకి వేలు విడిచిన మామ అని అంటారు. అంటే అతడు బీరకాయపీచు చుట్టరికం ద్వారా మామయ్యా అన్నమాట. 
  

మొగవారి  రూపాలు......

1]ముత్తాత, తాత, తండ్రి/నాన్న, పెదనాన్న, బాబాయి, 
2]మొగుడు/భర్త, 
3]మేనమామ[అమ్మ సోదరుదు], మామయ్య[మేనత్త మొగుడు], 
4]మామగారు[భార్యకి/భర్తకి  తండ్రి], వియ్యంకుడు[కొడుకు/కూతురుకి పిల్లా/పిల్లాడినిచ్చినాయన],
5]అల్లుడు,  మరిది[మొగుడి తమ్ముడు], బావగారు[సోదరి భర్త], మరిదిగారు[చెల్లెలు మొగుడు...అక్కకి ]  
6]బావ[అత్త/మామ కొడుకు], , బావ మరిది[భార్య సోదరుడు], అన్నయ్య గారు[భర్త సోదరి మొగుడు],
7]అన్నయ్య,  తమ్ముడు, తోడల్లుడు[అక్క చెళ్ళెళ్ళ భర్తలు],
8]పెళ్ళి కొడుకు,
9]కొడుకు, మేనల్లుడు[సోదరి కొడుకు], 
10]మనవడు, ముని మనవడు,   

ఆడవారి  స్వరూపాలు...

1]ముత్తవ్వ, బామ్మ/నాన్నమ్మ, అమ్మమ్మ, తల్లి/అమ్మ, అమ్మక్కయ్య/పెద్దమ్మ, పిన్ని/చిన్నమ్మ,   
2]పెళ్ళాం/భార్య, సవితి[బహు భార్యలలో ఒకరికొకరు], సవితి తల్లి[తండ్రి యొక్క మరో భార్య], 
3]మేనత్త[నాన్న సోదరి], అత్తయ్య[మేనమామ భార్య],
4]అత్తగారు[భార్యకి/భర్తకి తల్లి], వియ్యపురాలు[కూతురుకి/కొడుకుకి పిల్లాడు/పిల్లని ఇచ్చినావిడ] 
5]కూతురు, వదినగారు[భార్య అక్కయ్య], 
6] అక్కయ్య, చెల్లెలు, తోడి కోడళ్ళు[అన్నదమ్ముల భార్యలు],  ఆడ బిడ్డ[భర్త సోదరి], 
7] వదిన[అన్నయ్య భార్య],  మరదలు[భార్య చెల్లెలు/మామ కూతురు/తమ్ముడి భార్య], 
8]పెళ్ళి కూతురు, 
9]కోడలు,  మేన కోడలు[సోదరి కూతురు],  
10]మనవరాలు, ముని మనవరాలు.   

పైన ఉన్న సంబంధాల పేర్లే కాకుండా.....అవ్వ, మామ్మ, దొడ్డమ్మ, కక్కి, పెత్తండ్రి, పినతండ్రి, పెత్తల్లి, పినతల్లి, షడ్డకుడు[తోడల్లుడు] లాంటివి...... ప్రాంతాల బట్టీ వాడుకలో ఉన్న పదాలు కూడా తెలుగులో అనేకం....... 

తెలుగు ఈ సంబంధాల మధ్య కొన్ని విచిత్రమైన విభజనలు చేసింది....కొన్నిటికి రెండక్షరాలు మార్చటం వల్లా, మరికొన్నిటికి "గౌరవం" చేర్చటం ద్వారా ఒకేలాగా కనపడే బంధుత్వాన్ని దూరం మరియూ దగ్గర అనుబంధంగా సూచించబడింది....ఉదాహరణకి అత్తయ్య అంటే అమ్మ సోదరుడి భార్య, మేనత్త అంటే మా ఆత్తమ్మ అని అనిపించేట్లుగా....తండ్రి సోదరిని పిలవటం; అత్తగారు అని గౌరవం ఇచ్చి పిల్లా/పిల్లాడిని ఇచ్చిన ఆవిడకి గౌరవం ఇస్తున్నట్లే కనపడినా...ఆ బంధాన్ని కొద్దిగా దూరం ఉండటం మంచిదేమో అని సూచించటం....మన తెలుగులోనే ఉన్నది. 

అలాగే,  మేనమామ...అంటే తల్లి సోదరుడిగా అతిదగ్గరున్న అనుబంధాన్నిచ్చి, మామయ్య అని మేనత్త మొగుడిని కొంచం దూరంలో పెట్టింది మన తెలుగు. ఇక పిల్లా/పిల్లాడిని ఇచ్చిన ఆయనను మామగారు అని గౌరవం అనే సంకెళ్ళు వేసి, పెద్దమనిషిగా చేసేసింది తెలుగు భాష. అదేవిధంగా, అత్త కొడుకైన బావని చనువిచ్చి..... దగ్గరివాడిగానూ, అక్క మొగుడైన వానిని బావగారుగా చేసి......అంత చనువు పనికిరాదనే హెచ్చరికని తెలియ చేసింది. వరుసకి అన్నయ్య అయినవారికి కూడా "గారు" అనే గౌరవం ఇచ్చి కట్టడి చేసింది తెలుగులోనే......మరిది గారు కూడా అలాంటిదే.........  "విచిత్రమేమంటే  గారు అని గౌరవం ఇచ్చిన వారందరూ, కుటుంబం లోనికి బయట నుండీ వచ్చినవారే,  లేక  [అతి చనువుతో ఉండకుండా] కొద్దిగా ఎడంగా పెట్టవలసిన వారై ఉంటారు". 


ఇంగ్లీషులో అయితే నా అంకుళ్ళు ముగ్గురు.....
తెలుగులో అయితే ఇద్దరు మేనమామలు......మధ్యలో ఒక బాబాయి

ఇకపోతే, బాగా చనువునిచ్చే రెండే రెండు సంబంధాలని మనం తెలుగులో చూడవచ్చును. అమ్మ సోదరుడు మామ ఒకరైతే, రెండవ వారు నాన్న తమ్ముడైన బాబాయ్. పిల్లలకి వీరితో ఎంత చనువు ఉంటుందంటే, అమ్మా నాన్నలతో చెప్పని విషయాలని వీరికి చెప్పుకుంటారు. పిల్లలతో వీరి మధ్య చుట్టరికం కన్నా స్నేహమే కనపడుతుంది.  ఈ చనువు వల్లనే...."ఒరే మామా ఏమిటిరా సంగతులు..." అనీ,   "ఎంట్రా బాబై ఎక్కడికి వెళ్ళొస్తున్నావు....." అనీ స్నేహితుల మధ్య సంభాషణలలో వస్తుంటాయి. 

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక బంధుత్వాలకీ, వాటితో ఉండవలసిన సంబంధాలకీ చాలా చక్కటి వివరణలే తెలుగులో కనపడతాయి. తెలుగులో మానవ సంబంధాలకి ఇచ్చినంత గౌరవం మరే భాషలోనూ కనపడదు. ఆ మాటకొస్తే భారతీయ భాషలలో కూడా ఇన్ని సంబంధాల పేర్లు లేవేమో అనిపిస్తుంది.... ఈ విధంగా ప్రతీ మానవసంబంధానికీ ఓ గుర్తింపునిచ్చిన తెలుగు ఎంత నాగరిక భాషో, ఆ నాగరిక భాషగా అనుకున్న........ అ'నాగరిక బాష వారికి  తెలియచేప్పాలిసి ఉన్నది......... 



దయచేసి పైన ఉదాహరరించబడని బంధుత్వాల పేర్లు లేక ప్రాంతీయంగా పిలిచే ఇతర పేర్లు తెలుపగలరు. 


   
  


6, జులై 2013, శనివారం

జారిపడ్డ రూపాయి ......."ఇసయం" తెలియని భీమన్న.......!!!!

-------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------
భీమయ్య ......................... రామయ్య 
 -------------------------------------------------------------------------------------------

అదేట్రా రామయ్యా..... రుపాయ  పడిపోతోంది పడిపోతోంది అని ఒకటే కాకిగోల చేస్తుండారూ.... ఇటు చూస్తే మనకి ఆ పడిపోయిన ఒక్క రూపాయీ దొరకదేమిట్ర్రా....????

ఓరోరి ఎర్రిమొఖం భీమయ్యా రూపాయ పడిపోవటం అంటే ఆ పడిపోవటం కాదెశె.... దాని ఇలువ తగ్గిపోతున్నదని అర్ధంరా పిచ్చి సన్నాసీ....

ఆ.. ఆ మాత్రం మాకూ తెలుసులేరా... మనకేమో పనులు లేక ఒక్క రూపాయైనా దొరకక ఏడుస్తుంటే, రుపాయ ఇలువ పడిపోతున్నదని ఆ సన్నాసులు అంటారేమిటి.... అనిరా నేననేదీ.......

ఏమోరా భీమయ్యా.... బాగా సదువుకున్నోళ్ళు అంతా చేరి దేశాన్ని, మన రూపాయనీ ఎక్కడికో తీసికెళుతున్నారుట్రా...

ఆహా! అద్గది సంగతి అలా తీసుకెళుతుండగా వారి చేతుల్లోంచి జారిపడిపోయినట్లున్నదనుకుంటా; ...ఓరోరి రామయ్యా...సదువుకోని మనలాంటోళ్ళే మన దగ్గరున్న కాసిని రూపాయలని ఒడిసిపట్టుకొని పంచలో కట్టుకుంటుంటే...అంతంత పేద్దగా సదువుకున్నోళ్ళు అలా రూపాయని కిందకెట్టా పారేశారెహె.....

భీమయ్య తెలివి తక్కువతనంగా అనలేదని... ఈ సారి రామయ్యకి అర్ధం అయ్యింది...!!! 

అది సరే కానీ రామయ్యా...... మన గ్రామ పెద్ద గారూ ఎవడినో ఓ బూజు గడ్దం వాణ్ణి తెచ్చి గ్రామ లెక్కలని చూడటానికి పెట్టారంట కదా... 

ఒరేయ్.... ఆయనని ఆడు ఈడు అనకు... అయనేదో పేద్ద ఉజ్జొగం చేసొచ్చిన మనూరి వాడేనట.....మన గ్రామ పెద్ద మనూరోడు కాదుకదా..... అందుకనీ....  కాలీగా ఉంటే, మనూరి సంగతులు ఆయనకి తెలిసుంటాయి కదాని, ఈయనగారిని పెట్టాడు మన గ్రామ పెద్ద......

ఆడేదో పేద్ద ఉజ్జోగం వెలగబెట్టాడని నువ్వంటున్నావు,  ఆయన గారు వచ్చిన కాడ నుండీ మనూళ్ళో వాళ్ళకి పనీ పాటలు తగ్గాయంట, పైగా బయటూరి వాళ్ళు తెగ వచ్చిబడుతున్నారుట....ఆళ్ళ వొస్తువులు అమ్ముకోటానికి.......

ఒరెయ్ నాయనా ఆ లెక్కల పేద్దాయనని ఏమి అనకు... ఆయనంటే మనూళ్ళోని  పెద్ద తలకాయలందరికీ గట్టి నమ్మకం. కాబట్టి ఆణ్ణి పట్టుకొని...ఛి..ఛి... ఆయనను పట్టుకొని ఏమీ అనకు... పేద్ద తెలివిగలవాడంట....!!!   

.......నువ్వెన్నైనా సెప్పు, నాకు మడుకూ నమ్మకం కలగటం లేదురా రామయ్యా......  

ఎందుకురా భీమయ్యా ఆ పెద్దాయనని ఊరికే ఆడిపోసుకుంటున్నావు......
ఆయన నీలాగా అత్తెసరి సదువులు కాదు, పేద్ద సదువులే సదివినాడంట.....
అంతెందుకురా....  
ఆయనగారు వచ్చిన తరవాతే కదరా,  మనూళ్ళో కుర్ర కారు సెల్లు ఫొనులు దగ్గర నుండీ మోటారు బైకులు దాకా ఎగరేసుకొని తిరుగుతుండారూ..... 
ఆయనొచ్చిన తరవాతే కదరా,  ప్రక్కన ఊళ్ళో దొరికే వన్నీ మనూళ్ళో కూడా దొరుకుతుండాయీ... 
మన గ్రామ పెద్ద గారు కూడా సెప్పారుట..... 
ఇక మనూళ్ళో వాళ్ళు పనేమీ సెయ్యఖర్లేదంట.... 
అన్ని వస్తువులూ పక్కూళ్ళో వాళ్ళే తయారు చేసి తెస్తారుట..... 
మనం వాటిని చూసి, మనకి నచ్చినవి కొనుక్కువటమే తరువాయి...
అంత చక్కగా చౌకగా మనూళ్ళో వాళ్ళు కూడా తయారు చెయ్యలేరంట.... 
అంతెందుకు,  
మొన్నటికి మొన్న మనూళ్ళో సంబరాలకి కావాలిసిన రంగులూ, తపాసులూ, ఇగ్రహాలూ, రంగుకాయితాలూ, ఇలా ఒకటేమిటి...మన సంబరానికి కావాలిసినవన్నీ ఆ పక్కూళ్ళో వాళ్ళే తక్కువ ఖర్చుకే ఇచ్చారంట.......
మనూళ్ళో పిల్ల మేకా అందరూ వాటినే కొనుక్కుని సంబరాలు చేసుకున్నారంటా.... దీనికేమంటావు....  
అందుకనే పూర్తిగా ఇషయం తెలుసుకొని గానీ మాట్లాడకు... 
-------------------------------------------------------------------------------------------
   పాత పిచికారిలు[గూగుల్లో ఇదే దొరికింది...!!!].............             చైనా ప్లాస్టిక్ పిచికారిలు 
-------------------------------------------------------------------------------------------

మొన్నటి సంబరానికి నేనూళ్ళో లేనులే .... ఆ... అదన్న మాట సంగతి....ఎప్పుడూ మనూళ్ళో సంబరాలకి ఏర్పాట్లు చేసే ఈరన్నా, పైడేసూ, యెంకన్నా గాళ్ళు మొఖాలు ఏలాడేసుకొని కనపడ్డారు....... ఈ సంబరాల్లో ఆళ్ళకి పని దొరకలేదన్నమాట....!!!! సంబరాలు మనవి...సంపాదనేమో పక్కూరివాళ్ళకా.....????  అరే రామయ్యా మరి ఈళ్ళకి పని దొరకకపోతే ఈ ఈరన్న గాళ్ళకి డబ్బులెలా వస్తాయీ...? తిండెట్లా తింటారూ...??  ఈళ్ళు తిండిగింజలు కొనుక్కోలేకపోతే,ఆళ్ళ ఈధిలో ఉన్న సుబ్బయ్యగాడు ఎవడికి అమ్ముతాడు...??? .....ఆడి దగ్గరున్న సరుకునీ.... కొంపతీసి ఊరికేగానీ ఇచ్చెయ్యడు కదా.....!!!

ఆగరా భీమయ్యా నీ ఎకసెక్కాలూ....నువ్వూనూ.... ఇంతకీ పక్కూళ్ళ వాళ్ళ వలన మనూరోళ్ళకి పనిలేకుండా పోతున్నదంటావు.... మరి, మనూరి వాళ్ళు పక్కూళ్ళకి పోతుండారు కదరా.... దీనికేమంటావు....

నేననేది  ఏమిటిరా పిచ్చి యెదవా..... మనూళ్ళో వాళ్ళు పక్కూరికి పనికెందుకు వెళతారురా... మనూళ్ళో పని లేక పోబట్టే కదా.... నేను సెప్పేది కూడా అదే కదరా సన్నాసి రామయ్య..... 

దానితో పక్కూరి మైకం కమ్మిన రామయ్యకి కళ్ళు తెరుచుకోవటం మొదలైంది....అయినా, అనుమానం చావక....   ఒరెయ్ భీమయ్యా,  మన పక్కుళ్ళ వాళ్ళు మనకన్నా బాగా చేస్తుంటే వారిని వద్దంటావా.... ఆళ్ళు తెస్తున్నారు మనూరివాళ్ళు యెగబడి కొంటున్నారు.... ఇందులో తప్పేమిటంట్రా...... 

అరే సదువుకున్నోళ్ళలాగానే నీక్కూడా ఓట్టి పుత్తక గేనమే గానీ 
కళ్ళకి కట్టినట్లుగా కనపడే దానిని చూసి సెప్పలేవట్రా...రామయ్య,
పోనీ నువ్వు సెప్పిందే కరెట్టు అనుకుందాము.... 
మన పక్కూరి వాళ్ళు తెస్తారు, మనూరి వాళ్ళు కొంటారు....బాగానే ఉన్నది....
ఎటూ మనోళ్ళు పని పాటా చేయ్యఖర్లేదని గ్రామ పెద్దే సేప్పినాడన్నావు..... 
ఒకవేళ సేద్దామన్నా పనీ ఉండదనుకో..... 
అప్పుడు కొత్తగా డబ్బులేడ నుండి వస్తాయి..... 
ఇలా ఎన్నాళ్ళు...
మనూరోళ్ళ దగ్గరున్న డబ్బంతా పక్కూళ్ళవాళ్ళ దగ్గరికి చేరిపొయ్యే దాకా.....
మరి ఆ తరవాత ఏమి చెస్తార్రా... 
అడుక్కుంటారా.....??
అలా అడుక్కున్న యెయ్యటానికి మనూరోళ్ళ దగ్గర ఓ చిల్లి కానీ కూడా ఉండదు... 
ఆ అడుక్కోవటం కూడా పక్కూళ్ళో వాళ్ళ దగ్గరే అడుక్కోవాలిరా సన్నాసీ...
ఇప్పుడు అమ్ముకోటానికి వొచ్చినోళ్ళే,
 మనోల్ల ఆస్తులు తనఖా పెట్టించి అప్పులిచ్చి ఉన్న ఆ కాస్త గోచి కూడా లాగిపారేస్తారు...
ఏవుండాది,  మళ్ళా పాత సేరిత్రే...........   
కాబట్టి ........
 మంచో చెడో మనూళ్ళో వాళ్ళ చేతే పని చేయించి 
ఆళ్ళకి నాలుగు డబ్బులు ఇత్తే.....
ఆళ్ళే తిరిగి ఆళ్ళకి కావాలిసిన వస్తువులు మన దగ్గరే కొంటారు...
ఆ డబ్బేదో మనూళ్ళ వాళ్ళ చేతులే మారి కొంచమైనా గౌరవం కలిగుంటాది... 
అదే కనుక పక్కూరి వోడికెళ్ళిన డబ్బుని..... 
ఆడి ఊళ్ళో ఖర్చు పెడతాడు కానీ మనూళ్ళో కాదు కదా.....
మనూరి వాడికి అదేమీ సంపాదన అవుదుగా.....

మరి మనూళ్ళో దొరకనివి ఎలాగరా భిమన్నా......

-------------------------------------------------------------------------------------------
ఇలా తెలివితక్కువగా ఉన్నందుకు అమెరికాకి అయినా ఈ గతి పట్టక తప్పలేదు--
 ఇండియాకి అదే గతి పడుతూ ఉన్నది...  
-------------------------------------------------------------------------------------------

ఏమున్నదిరా....ఆ వస్తువులు తీసుకొని.... ఆళ్ళకి దొరకని మనూళ్ళో వస్తువులని ఇవ్వటమో లేకపోతే ఇందాక నువ్వన్నావే....... మనూరోళ్ళు ఆడ పనిచేస్తున్నారని.....అలా పని చేసో బదులు తీర్చుకోవాలి.....

అయితే ఇదంతా సదువుకున్నోళ్ళు పాతకాలం పద్దతిలో ఉన్నట్లుగా ఉన్నదంటారు కదరా..... ఆళ్ళ సంగతి సరే...ఇంతకీ ఇంతంత పేద్ద పేద్ద పుత్తకాల్లో ఉన్న సదువుల మాటేమిట్రా...ఆటికేమీ ఇలువా లేదా......

ఆ..... ఆటికి మన బ్రతుకులు కన్నా ఎక్కువ ఇలువ ఇవ్వబట్టే ఇట్టాంటి గోల ఇలా వచ్చిపడింది.... ఆ సదువుల్లో ఎక్కువ భాగం మన దేశంవి కూడా కాదురా సన్నాసి.....ఆ సదువులలో ఉన్న పద్దతులూ, ఇవరాలు... ఏవీ ఇక్కడివి కాదు...అవన్నీ దొరల సదువులు......ఆ దొరల సదువులు సదవబట్టే అయ్యి సదివినోళ్ళు కూడా ఆళ్ళ మాటలే సెప్పి ఆళ్ళకే మన డబ్బుని మూటల్లో కట్టి మరీ పంపిస్తున్నారు....ఇందాక నువ్వన్నవే రూపాయ ఇలువ తగ్గిపోతోందని.....అదే ఇదిరా...

అందుకేనా మనూరివాడైనా ఆ సదువుకున్న పెద్దాయన పక్కూరోళ్ళకి సాయం చేస్తున్నాడు.... మరి గ్రామ పెద్ద సంగతేమిటీ....

ఆ చదువుకున్నాడని అన్నావే.... ఆడు సదువుని బట్టీయేసినాడనే అనిపిస్తోంది కానీ....సదువుని ఒంటికి బట్టించుకొన్నవాడిలాగా కనపడటంలేదు. ఇక మన గ్రామ పెద్దా......ఆడు పక్కురి వాడేగా...ఆడికేంపట్టింది...మనూరోళ్ళు ఎటు సస్తే...ఎట్టా సస్తే ఏం.............

వోకటి అడుగుతా కోపం తెచ్చుకోకు భీమయ్యా .....మరి నువ్వు సేప్పినట్లుగా పాత గూడేల పద్దతిలో బయటూరొన్ని రానియ్యకుండా ఉంటే మనం పెపంచాకాన్ని చూసేదెలా, మన పిల్లలు మనలాగా కాకుండా ఎదిగేదేలా...... ???? 

బాగా అడిగినావు..... 
బయటూరి వోళ్ళని రావద్దని నేనెప్పుడు సెప్పినాను......?   
ఆళ్ళు వొస్తు వొస్తూ, ఆళ్ళ యెంట ఆ ఊళ్ళో తయారైన వస్తువులని తేకుండా....
ఆళ్ళ ఊరి డబ్బుని తెచ్చి మనూరి కుర్రగాల్ల చేత పనులు చేయించి.....
ఆ తెచ్చే వస్తువులని ఈడనే తయారు సేసుకుంటే, 
ఆ వచ్చినోడికి యాపారం సేసినట్లుంటాది, 
మన కుర్ర గాళ్ళకి సేతినిండా పని, జేబుల్లో పైసలు ఉంటాయి.......
ఆ సెసేదేదో మనూళ్ళో దొరకని వొస్తువులు సేస్తే, 
మనూళ్ళోల్లకి ఉన్న పనీ పోదు,  
పైగా పక్కూరి వాడి వలన నేర్చుకొన్నకొత్త పనితో 
మనూరి వొళ్ళు యాడకైన ఎల్లి బతకగలరు.......  
ఇలా ఎవడేని వొస్తే మనకేటి కష్టం ఉంటాది......?? 
యవడోద్దంటాడు....??? 
బయటూరి వాడు వచ్చి మన పొట్ట కొట్టకుండా 
చూసేందుకే కదా....ఉన్నది......మన గ్రామ పెద్దోళ్ళు ..... 
అల్లే యాపారం యావలో పడి, బయటూరి వాల్లని మన నెత్తిన పెడితే 
మనోళ్ళు ఏమైపోవాలంట..........!!!  
-------------------------------------------------------------------------------------------
మన పాలు ఏమి తిసిపోయ్యాయని విదేశి పాలని రప్పించబోతున్నారు...!!!? 
 -------------------------------------------------------------------------------------------

బాగా సేప్పినావురా భీమయ్యా......అవునొరే నీకేట్టా తెలిసినాయిరా ఇన్ని సంగతులు.........

తెలిసేదేమున్నదిరా......ఊరికే ఓ బండ దగ్గర కూర్చుని సేసిందే సేయ్యటమే కాదు!!!   ..........బయట జనంలో తిరిగితే నీలాంటోడికైనా తెలుస్తాయి.... కానీ ఇచారమేమంటే.....ఇది నీకైనా తెలిసింది కానీ, ఆ పుత్తక పురుగులోల్లకి తెలిసేదేట్టా........ 



ఓరి ఎర్రి భిమన్నా, ఇంతసేప్పినోడివీ... ఆ మాత్రం అర్ధమవలేదట్రా...
నీకేదో బోలెడు లోక గేనం ఉన్నదనుకున్నా...
నువ్వు సేప్పినవి నాలాంటోడికి తెలియక పోవచ్చును కానీ...
అంత సదువుకున్నోల్లకి తెలిదంటే ఎట్టా నమ్మావురా...???
ఆళ్ళకి అన్ని తెలిసే ఉంటాయి...
తెలియని నాలాంటోల్లకి సెపితే అర్ధం అవుతుంది కానీ, 
ఇషయమంతా తెలిసి కూడా... తెలియనట్లు నటించే వోళ్లకి 
ఎలా సెపితే అర్ధంఅవుతుందిరా...???
నీలాంటోళ్ళకి లోకంలోని ఇషయ గేనమె గానీ "లోక గేనం" లేదురా... 
కానీ, 
ఆళ్ళకి ఇషయ గేనంతొ పాటూ లోక ఇసయ[డబ్బు] గేనం కూడా ఉన్నది... 
ఆళ్ళేమీ పాలుతాగే పిల్లకాయలనుకున్నావా... 
బతకనేర్చినొళ్ళురా...
ఎవలేట్టాపోతే ఆల్లకేమిటట... !!!

అయితే...
ఈరోజు ఈరన్నా, పైడేసూ, యెంకన్నా గాళ్ళకి పట్టిన గతే 
రేపు మనకి పట్టబోతుదంటావు...!!!
సరే ఎటిసేస్తాం, ఎవడిగోల ఆడిది,
ఇనేవాడెవడు...
నెత్తి మీదకి వచ్చేదాకా.........!!! 


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


బొమ్మలన్నీ గుగుల్లోనివే....