LOCAL WEATHER

30, నవంబర్ 2012, శుక్రవారం

ఎలికల కోసం ఏనుగులని తెచ్చుకొంటామా...? [FDI....PART-2]


ఏదైనా దేశం తనకు చాతనైనంత వరకూ ఇతర దేశాల మీద ఆధరపడకుండా ఉండాలనే చూస్తుంది.  కారణం...అమూల్యమైన దేశ ప్రజల సొమ్ము బయటకు పోకూడదనే.....  అందువల్లనే, తప్పనిసరైన పరిస్థితులలో, తమ దేశంలో తయారు కానివి, దొరకనివి, కుదరనివీ మాత్రమే బయట దేశాల నుండి తెప్పించుకొంటుంది. అవి వస్తువులు కానీ, సేవలు కానీ;  దీని వలన, దేశ ఎకానమీ బలంగా ఉంటుంది....  దేశానికి ఇలాంటి బలమైన ఆర్ధిక వ్యవస్థను,  మంచి ఆర్ధిక విధానంతో పరిపాలన చెయ్య వలసిన బాధ్యత అంత పరిపాలకులదే...    

అయితే, ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థలు  బయటి దేశల ప్రజల కొనుగోలు మీద ఆధారపడి ఉన్నందున వారు "గ్లోబలైజేషన్" అన్న పదాన్ని పైకి తెచ్చారు.......గ్లోబలైజేషన్ పేరుతో బయట దేశాల అన్ని వస్తువులూ దేశంలోనికి వరదలా రావటం మొదలైంది....దేశంలో దొరికే వస్తువులు కూడా బయట దేశాల నుండి రావటం ...  పైగా, దేశంలోని వస్తువులకి పోటిని ఇవ్వటానికి, బయట దేశం వస్తువులు అతితక్కువ ధరలకే దొరికేట్లు చేస్తున్నారు. దీని  వలన దేశంలో దొరికే వస్తువులకి డిమాండు తగ్గింది. దీనితో దేశీయ వస్తువులు తయారీ దారుల పనికి తీవ్రమైన విఘాతం కలుగుతోంది.  వీటికి తోడు చిల్లర వర్తకాలకి సంబంధించి "విదేశీయులు డైరెక్టుగా పెట్టుబడులు పెట్టచ్చు" అనే చట్టం వలన పనీ పాటా చేసుకొనే ప్రజల పరిస్థితి  "మూలిగే నక్కపై తాటి పండు  పడినట్లవుతోంది". 

ఈ గ్లోబలైజేషన్ అన్న పదాన్ని ఒకప్పుడు వలసలని నిర్వహించిన వారి నిర్వాకమే....వారు ఎంత మంచి వాళ్ళంటే.....  వారు మన దేశానికి   పాలకులుగా  ఉన్నప్పుడు..."ఏ సంస్థానంలో అయినా వారసులు లేక పోతే అది తమదే"  అన్న చట్టం చేసిన ఘనులు......అలా అవసరం కొద్దీ నీతీ నియమాలను తప్పే జాతి వారికి,  మళ్ళీ ప్రపంచ దేశాల పైన వ్యాపార ఆధిపత్యం  చెయ్యాలిసిన అవసరం పడింది.  కారణం...వలసలుగా ఉన్న దేశాలు అభివృద్ధి చెందటం మొదలవటం;  దానితో  వీరి దేశంలో వారికి పని తగ్గింది...  అందుకని, ఇదివరలో తాము చేసిన  వారసత్వపు చట్టం లాంటిదే గ్లోబలైజేషన్ అనేదాన్ని పైకి తెచ్చారు. ఇప్పుడు "చట్టాలు చేసే స్థితిలో"  లేవు కనుక...."చట్టాలని చేయించే" పనిలో పడ్డారు.....అవును మరి, వారి  దేశాల  కోసం వారు చేసుకొంటున్నారు. 

అయితే, అసలు  విచారకరమైన విషయం ఏమంటే, ఒకప్పుడు మన    దేశానికి    చెందిన    రాజులూ,  సుల్తానులూ వలసదార్లకి సహకరించినట్లు, ఇప్పుడు రకరకాలైన రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులూ సహకరిచటమే....  ఈ వలసదార్ల దేశాలు రాజకీయ నాయకులను ఎలా లొంగదీసుకొన్నారో మనం వేరే చెప్పుకోవఖర్లేదు...ఎందుకంటే, చరిత్రలో రాజులూ, సుల్తానులూ తమ ఆధిపత్యాల కోసం కాని, విలాసాలకి కోసం  కానీ, దురాక్రమణల కోసమైతే కానీ  ఈ వలసదార్లతో ఎలా  సహకరించారో, అలాగే, అలాంటి బలహీనతలున్న,  ప్రస్తుత రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులూ మళ్ళీ వారితోనే జత కట్టి తమ  శత్రువులను{???} సాధించటానికి పూనుకొన్నారు... దీనితో, వలస దారుల పని "మళ్ళీ" చాలా తెలికైంది.  మన దేశంలోని పాలక ప్రతిపక్షాలు ఒకరికొకరు శత్రువులులాగా ప్రవర్తిస్తున్నారే కానీ, ఇద్దరి పనీ ప్రజలకి సేవలందించటం అన్న సంగతి మర్చేపోయ్యారు. పాలక ప్రతిపక్షాల పరిస్తితి ఎలా ఉన్నదంటే;  ప్రతిపక్షం వద్దంది కాబట్టి, ఇది చెసి తీరాలి అన్న పట్టుదలతో ఒకప్పుడు తాము ప్రతిపక్ష హోదాలో FDI లను  వద్దన్నామన్న సంగతి కానీ,  ఇందులో ప్రజాప్రయొజనాలున్నా, లేకపోయినా దీర్ఘ కాలంలో  మన ప్రజలకి కీడు చేస్తుందన్న స్ప్రుహ కానీ పాలక పక్షానికి లేదు.... ఒకప్పుడు పాలక పక్ష హోదాలో ఈ పాడు పని తామే మొదలు పెట్టామన్న సంగతి ప్రక్కన పెట్టిన ప్రతిపక్షం......ఈ సందర్భాన్ని తమ రాజకీయ ప్రయొజనాలకి వాడుకొంటున్నదే కానీ,  ప్రజలకోసం కాదు...   

స్వాతంత్రం వచ్చి రెండు మూడు దశాబ్దాల వరకూ బాగానే ఉన్న ప్రజలు, తరవాతి కాలంలో అనేక ప్రలోభాలకి గురవుతో వస్తున్నారు....దానితో  ప్రజలు, స్వయం సిద్దంగా బ్రతకాలిసిన వారు, ఉద్యోగాలకోసం ఎగబడ్టం, కొట్టుకోవటం చేస్తున్నారు....ఈ ఉద్యోగాల పేరుతో కులాలుగా, మతాలుగా విడిపోయి ఒకరికొకరు శత్రువులుగా భావించుకొంటున్నారు, ఎవరి దారి వారిదే అన్న చందాన తయారైనారు.  ప్రజావసరాలకి సంబంధించిన వ్యాపారస్తులు చూస్తే, అధిక లాభాల కోసం తమ వ్యాపారాలని నీతీ నియమాలు లేకుండా చేస్తున్నారు....దీంతో మంచి క్వాలిటీ వస్తువు అన్న విషయమే మరచి చాలా రోజులైంది....ఎవరన్న బాధ పడతారని కానీ, ఇబ్బంది పడతారని కానీ, ఎమైన అంటారని కానీ లేకుండా.....సిగ్గు సిరం లేని వ్యాపారాలు చేస్తున్నరు.....కొనుగోలు చేసేటప్పుడు గుంపుగా ఏర్పడి వస్తువు తయారీదారులని, ముఖ్యంగా వ్యవసాయ దారులనూ మోసం చేస్తూ తక్కువ ధరలకి కొని, అదే  పద్ధతిలో ప్రజలకి ఎక్కువ ధరలకి అమ్ముతో నీతిలేని వ్యాపారాలు చేస్తున్నారు......వీరికి ప్రస్తుతం ఉన్న అవినీతి పరిపాలనా వ్యవస్థ కూడా సహకరిస్తుంటం జరుగుతోంది. 
     
మామూలు ప్రజావసరాలకి సంబంధించిన వ్యాపారాలలో విపరీత లాభాలు  రావటంతో,   దేశంలో ఉన్న  పెద్ద పెద్ద వస్తూత్పత్తి చేసే డబ్బున్న వారి కన్ను ఈ వ్యాపారాల మీద పడింది. వారు మాల్స్ మార్టులు అంటూ మొదలు పెట్ట సాగారు........ డబ్బున్న మాములు వ్యాపారస్థులు నలుగురు కలిస్తేనే  సప్లై చేసే వారికీ, కొనుగోలు దారులకీ అన్యాయం జరుగుతుంటే, ఒకే పేద్ద మొత్తంలో కొనగలిన వ్యాపారస్తులు వస్తే ఇంకెంత అన్యాయం జరుగుతుంది....ఎందుకంటే నలుగురుగా ఉన్న వ్యాపారస్తుల మధ్య   ఉన్న విభేదాల వల్లన  కొద్ధిగానైనా  ధరలు  కంట్రోలు అవుతాయి...అదే ఒకరే పెద్దమొత్తంలో కొనుగోలు  చేసినట్లైతే ఇక వారు చెప్పిందే  వేదం అవుతుంది....లక్షలు పెట్టుబడి పెట్టే వాడు మార్కెట్టులో కొంత  భాగాన్నే ప్రభవితం చెయ్యకలడు, కోట్లు పెట్టుబడి పెట్టేవాడు మార్కెట్టులో చాలా  భాగాన్నే నియంత్రించకలడు..........ఇక వేల కోట్లు పెట్టుబడులు పెట్టే వారు వస్తే.............???  మన దేశంలో ఉన్న "దేశీయ మాల్స్ వారి వల్లనే వస్తువుల ధరలు నియంతృత్వానికి గురవుతుంటే....ఇక విదేశీయులు పెద్ద ఎత్తున డాలరుతో కొడితే"  మనం తట్టుకోగలమా....? మన మార్కెట్టులు పూర్తిగా వారి ఆధీనంలోనికి వెళ్ళిపోవా....???  "డాలరు వలన రూపాయి బలహీనపడుతుంటే, అదే  డాలరుని తెచ్చి రూపాయి నెత్తిన పెడతారా"........? ఇదెలా ఉన్నదంటే, ఇబ్బందిగా ఉన్న శత్రువుని తెచ్చి మనకి మనంగా నెత్తిన పెట్టుకున్నట్లుగా   ఉన్నది. 

"వారు వస్తే కనుక అందరికీ, ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధరలు ఒస్తాయి" అని అన్న "ప్రధాన ఆర్ధిక వేత్తకు", తమ దేశంలో కూడా పరిపాలన వ్యవస్థ అనేది ఒకటున్నదని తెలుసా.......తెలియదా......?  ఆ వ్యవస్థ ద్వారానే దేశాన్ని పరిపాలిస్తున్నది మన పరిపాలకులే కదా...?  అంటే, ఈ వ్యవస్థలోలోపాలున్నాయని, వాటిని పరిపాలించే వారే చెపుతున్నారా...??  ఆ వ్యవస్థ ద్వారా స్వంత దేశం వాళ్ళే మాట వినకపోతే ఏమీ చెయ్యలేని వాళ్ళు,  విదేశీయులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఏమి చెయ్యగలరు....??  ఈ వ్యవస్థల ద్వారా పరిపాలిస్తున్న వారే, వాటిలోని లోపాలను చూపి, ఇతర దేశాలవారైతే ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పటం ఎంతవరకూ సమంజసం.......వ్యవస్థలోని లోపాలని తెలుసుకొన్నప్పుడు, ఆ లోపాలని వీరే సరి చెయ్యచ్చును కదా...!!! అలా చెయ్యకుండా, మన దేశంలోని కొందరు ప్రజలు, మరికొందరిని మోసం చేస్తున్నారనే సాకుతో, వేరొక దేశం వారిని ప్రవేశపెట్టడం సరైనదేనా...???  "ఇంటిలో  ఎలుక దూరిందని  ఇల్లు తగలబెట్టాడు"  అన్న వెనుకటి సామెతెలాగా ఉన్నది........ మన పరిపాలకుల పద్దతి...!!!

ఈ వ్యవస్థలో అంతా అవినీతి పెరుకుపోయిందని, బయట దేశం వాళ్ళని పిలిచే వారు, రేపు పరిపాలనలో కూడా విదేశీయుల సహకారం తీసుకొంటే అప్పటి పరిస్థితి ఏమిటీ...? అయితే మన పరిపాలకులు "ఇది దేశ మరియూ  ప్రభుత్వ సారభౌమత్వానికి సంబంధించిన విషయం"  అనీ, తమదాకా రానియ్యరనే అనిపిస్తోంది ఇప్పటికి........!!!  అలాగే ప్రజా సామ్య దేశంలో  ప్రజలకి సంబంధించిన వాటిల్లో  విదేశీ జోక్యం ఉంటే  "ప్రజా సారభౌమత్వం"  దెబ్బతిన్నట్లు కాదా........!!!  కాబట్టి, మన నాయకులకి చిత్త శుద్ధి ఉంటే... ఎలికలకోసం ఇల్లు తగలబెట్టకుండా.... వారు వస్తే....వీరు వస్తే... అనే బలహీనం మాటలు మాట్లాడకుండా, దేశంలో ఉన్న పరిపాలనా వ్యవస్థను  చక్కగా ఉపయోగించుకొని, దేశంలోని ఎలికల కోసం మరిన్ని కఠినమైన చట్టాలని తెచ్చి, ఆ చట్టాలని స్వార్ధం కోసం నిర్వీర్యం చెయ్యకుండా,   సమర్ధ పరిపాలనతో దేశ ప్రజలందరికీ  న్యాయం చేయ్యచ్చును.......  అంతే కానీ, 
దేశీయ ఎలికల కోసం, విదేశీ ఏనుగులని తెచ్చి ప్రజల నెత్తి మిద పెట్ట కూడదు.  అలా చేసినట్లయితే FDI అంటే FOREIGN DIRECT INVESTMENT అని కాకుండా,   "FOOLS DIRECT INDIANS" అని అర్ధంవచ్చేటట్లు,  మన ఘనత వహించిన రాజకీయ నాయకులే చేసిన వారవుతారు.......!!!


****************

****************


ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివి.....



 

28, నవంబర్ 2012, బుధవారం

శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారా.......???[FDI--PART..I]


యుద్ధాల కోసం,  పురాణ కాలంలో  అయితే,  పెద్ద ఎత్తున సైన్యం... గుర్రాలూ, ఏనుగులూ, బాణాలూ, అస్త్రాలు, శస్థ్రాలు;  తరవాత కాలంలో  ఫిరంగులు....ఆ తరవాత కాలంలో ట్యాంకులూ, విమానాలు, బాంబులూ; మరి ఇప్పుడు ... అణుబాంబులు, ఖండాంతర క్షిపణులూ, ఒక చోట కూర్చొని ప్రపంచాన్నే నాశనం చెయ్యగల టెక్నాలజీ......... పాత కాలం నుండీ ఇప్పటి వరకూ సైన్యం అనేది కామన్‌గా ఉండి,  మిగిలినవి పెరుగుతూ వచ్చినాయి...ఎందుకు.....??? ఇన్ని తెలివి తేటలని ఆయుధ సామాగ్రి ఆధునీకరణకు ఎందుకు వాడుతున్నారు.....? కొట్టుకు చావటానికేనా...ఈ యుద్ధాలన్నీ........??? లేక లాభం ఆశించా...??  ఏమిటి లాభం....?   




    

పురాణ కాలం నుండీ ఇప్పటి వరకూ జరిగిన ఏ యుద్ధాలైనా ఒకటే లక్ష్యం....ఇతర దేశాలను ఆక్రమించటం......దాని ద్వారా తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవటం...... పాత కాలాలలో "కప్పం" అని కట్టించుకొని,  ఆయా దేశాల ప్రజల సొమ్మును డైరెక్టుగానే దొంగంతనం చేసేవారు..... తరవాత కాలంలో యుద్ధ మర్యాదలు నశించి.....ఊళ్ళ మీద పడి.... నగలు, డబ్బులతోబాటూ  పండిన పంట కూడా అందిన వరకూ దోచుకోవటం జరిగింది...... ఆ తరవాత,  యూరప్పు వారి ప్రపంచ పరిపాలన దగ్గరికి వచ్చేసరకి,  దేశాలకి దేశాలను ఆక్రమించి, వాటిని పరిపాలిస్తున్నట్లుగా నటించి, ఆక్రమిత దేశాల నుండీ సంపదను తమ దేశాలకు తరలించటం........స్వంత వ్యాపారాలు చేసి ఆక్రమించుకొన్న దేశాలలో  అమ్మి విపరీత లాభాలు పొందటం  జరిగింది... ఈ విధమైన పద్ధతులలోనే...ఒకప్పుడు తండాలుగా....ఏ విధమైన పద్ధతులు లేని యూరప్పు జాతి వారు ప్రపంచ ఆక్రమిత దేశాల సొమ్ముతో దొరలైనారు. 

ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమిస్తే అదీ కూడా దేశంలోని అంతర్భాగం అవుతుంది కదా......? ఆక్రమిత దేశాల వారిని కూడా స్వంత ప్రజల లాగే చూడాలి కదా.....?? కానీ, ఎప్పటికీ అలా జరగలేదు....ఇంగ్లీషు, ఫ్రాన్సు, డచ్చి మొదలైన దేశాల వారు తాము ఆక్రమించుకొన్న దేశాల నుండీ శతాబ్దాల తరబడి దోపిడీలు చేసి.....ఆయా దేశలను పిప్పి చేసి వదిలించుకొన్నారు. రష్యా కూడా 70 ఏళ్ళ పాటూ తాను ఆక్రమించుకొన్న దేశాలను అలాగే వాడుకోవటం వలన, ఆ దేశాలు  కూడా అవకాశం రాగానే  "USSR"  కి దూరం అయినాయి. చైనా కూడా టిబెట్టుని ఆక్రమించుకొని, అక్కడి ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించుకొని, సరైన డబ్బులు ఇవ్వకుండా, అలా తయారైన వస్తువులను అతి చవుకగా ప్రపంచ దేశాలలో అమ్ముతోంది.....

సరే, విషయంలోనికి వస్తే........ ఇప్పుడు, ప్రపంచం చిన్నదైపోయింది......అనే కంటే చిన్నదిగా చేసేశారు యూరప్పు తెలివిగల వారు.....ఎవరైనా ఇంకొకరి మీద దాడి చేస్తే  వారు ఊరుకొనే స్థితి లేదు.....ఎందుకంటే ఆ హక్కు వారిదే మరి......వారికి తెలియకుండా ఏదీ జరగ కూడదు....పైగా వారి వ్యాపారాలన్నీ అలాగే ఉండాలి కదా......అందుకు అన్ని యూరప్పు దేశాల వారూ అప్పటిదాకా ఉన్న దోపిడీ దొంగల వేషాలని తోలగించి పెద్దమనుషుల వేషాలని తగిలించుకొన్నారు.  ఇంతవరకూ బాగానే ఉన్నది...యూరప్పు వారికి. బాగాలేనిది ఆక్రమణలకి గురైన దేశాలకి......బాగున్న వారు,  శతాబ్దాల తరబడి దోచుకొన్న సొమ్ముతో జల్సాలు చేస్తుంటే......., ఆక్రమణలకి గురైన ఆసియా, ఆఫ్రికా దేశాలు వళ్ళు దగ్గర పెట్టుకొని అభివృద్ధి చెందటం మొదలు పెట్టినాయి...ఇలా కొన్ని దశాబ్దాలు గడచినాయి.......    

క్రమంగా  పరిస్తితులు మారినాయి.....దిగువున ఉన్న దేశాలలో అభివృద్ధి చెందటం మొదలైంది...... ఒకప్పుడు ఆక్రమణలకి గురైన దేశాల వారు  స్వయం సమృద్ధి..... అంటే,  తమకి కావాలిసిన అన్ని వస్తువులని  తామే సమకూర్చుకోవటం, వ్యవసాయపరంగా, విద్యాపరంగా, సాంకేతికపరంగా ఎవరి కాళ్ళ మీద వారు నిలబడటం మొదలు పెట్టారు.  దీనితో, ప్రపంచ మార్కెట్టులో యూరప్పు  జనాల వస్తువులకీ, తెలివితేటలకీ వ్యాపారపరమైన డిమాండు తగ్గిపోనారంభించింది.......ఒకప్పుడు వెలిగిపోయిన దేశాలలో అశాంతి  మొదలైంది.....ఇలా ఉంటే యూరప్పువారికి ఎందుకు నచ్చుతుందీ....??  తాము ఆక్రమించుకొన్న దేశాలను భౌతికంగా వదిలివేసినా.......వ్యాపర పరంగా వాటి గుప్పిటలోనే పెట్టుకొని ఉన్నాయి కదా.......వారు ఏమీ తెలివి తక్కువ వారు కాదు కదా.....ప్రపంచంలోని అన్ని దేశాల సంపదతో పాటూ... తెలివిని కూడా స్వంతం చేసుకొన్న వారు కదా....!! 

అందుకనే, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలుసు......ఇంతకు ముందర నుండీ వాడుతున్న "చిన్న ప్రపంచం" నినాదానికి బాగా పదునుపెట్టారు......వారి మార్కెట్టులని డైరెక్టుగా ఒకప్పుడు  ఆక్రమణలకి గురైన దేశాలలో నెలకొల్పటం మొదలెట్టారు....వారి దేశాలలోనూ....ఆక్రమణ గురైన దేశాల వారికి అవకాశం  ఇచ్చారు.....!!!!! కానీ,  ఎవరు మార్కెట్టింగు చేసినా వస్తువులు  మటుకూ యూరప్పువారి వస్తువులే మరి....  90 శాతం యురోపియన్లవే లేక ఆక్రమణ దారుల దేశాలలో తయారైన వస్తువులే........ఈ విధంగా చెయ్యటం వలన ఆక్రమణలకి గురైన దేశాలలోని ప్రజలు పనీ పాటలు లేకుండా పోతారు......కొనుగోలు శక్తి నశిస్తుంది...... 



ఎందుకంటే,  మాల్‌లో   కొన్న వస్తువులు మన దేశంలో తయారైనవి అయితే పరవాలేదు........ మనం చెల్లించిన సొమ్ము,   వస్తువు  తయారు చేసిన మన దేశం వ్యక్తులకి,  జీతం రూపంలో వెళుతుంది.... ఆ జీతంతో ఆ వ్యక్తులు మన ఎకానమిలోనే[దేశంలోనే] ఖర్చు చేసి మన దేశం వారికే  ఆదాయాన్ని ఇస్తారు.  కానీ, మాల్‌లో కొనే వస్తువులు విదేశాలలో వ్యక్తులు తయారు చెయ్యటం వలన, మనం ఖర్చు చేసే డబ్బు మొత్తం విదేశాలకి వెళ్ళి వేరొకరికి ఆదాయంగా మారుతుంది.......... ఈ డబ్బుతో వారి దేశంలో వస్తువులు కొని వారి దేశం వారికి ఆదాయాన్ని ఇస్తారు.........మన దేశం వారికి పనికి రాదు.......క్రమంగా దేశం బలహీనపడిపోతుంది.  ఆ... ఇది వ్యాపారస్తులకీ,  ఇతరులకీ కదా అనుకునే ఉద్యోగస్తులకి  కూడా పనీ పాటా ఉండదు......పని లేకుండా జీతాలివ్వటం కుదరదు కదా....అవసరం తగ్గి ఉద్యోగులనూ తగ్గిస్తారు. ఈ విధంగా అందరి కొనుగోలు శక్తీ తగ్గి,  క్రమంగా తిరిగి దేశం బలహీన పడి మళ్ళీ యురప్పు వారి మీదే అధారపడవలసి వస్తుంది.


అయితే, ఈ క్రమంలో, ఏసీ షో రూములో అందమైన వస్తువులూ, ఆకర్షణీయమైన ధరలకి దొరకటం వలన అన్ని వర్గాల ప్రజలూ ప్రలోభానికి గురైపోతారు......దేశాన్ని గురించి ఆలోచించాలిసిన మంత్రులే ప్రలోభాలకి  లోబడినప్పుడు,  సామాన్య ప్రజలది లెక్కలోనికి రాదు. ఎవరికి వారు, ఆ ఇది మనకి ఏమీ నష్టం కాదులే అనీ ఉద్యోగస్తులూ, వ్యాపారస్తులూ, వ్యవసాయం చేసే వారూ.....చివరకి రాజకీయ వేత్తలూ... ఐక్యత లోపించి వర్గాలుగా విడిపోయారు.....శతాబ్దాల క్రింద రాజులూ కొట్టుకుచచ్చి అనైక్యంగా ఉండటం వలన ఆక్రమమణకి గురైన మన దేశం,  మరల అదే విధమైన వాతావరణానికి అవకాశం ఇస్తోంది!!!  "మనని మనం  నమ్ముకొనే కన్నా, మనని శతాబ్దాల తరబడి మోసం చేసిన వారినే నమ్ముతున్నాం".........అదే యురోపియన్ల తెలివితేటలు!!  

  
వీటన్నిటికీ కారణం...దేశంలో బాగా పెరిగిపోయిన "ఎర్ర తెగులు"  కానీయండీ,  "తెల్లమచ్చ తెగులు" కానీయండీ...... ఈ తెగుళ్ళు తగ్గటానికి కావాలిసిన  "దేశభక్తి మందును"  50 శాతం చదువుల్లో,  మిగిలిన 50 శాతం రాజకీయ వ్యవస్థలో  కలిపి  పిచికారీ చెయ్యవలసి ఉంటుంది.  సామాన్యంగా  వ్యవసాయ భూమిలో రైతు తన పొలానికి పట్టిన తెగులును సకాలంలో మందులు వాడీ చక్కబరచుకొంటాడు.....కానీ, అలాంటి రైతులు తగ్గిపోయి, ఇప్పుడు దిగుబడే ధ్యేయంగా పనిచేసే కమ్మర్షియల్ రైతులు పెరిగి పోయారు......వీరికి కావాలిసినది డబ్బు..........అంతే ......! 

మళ్లీ అసలు విషయంలోకి వస్తే,  ఒక దేశం మరొక దేశాన్న్ని  యుద్దంలో ఓడించి ఆక్రమించుకొన్న తరవాత ఏమి చేస్తారో,  దానినే మన వాళ్ళే దగ్గరుండి మరీ చేయిస్తున్నారు. అంటే ఇంత సైన్యం ఉండీ, రక్షణ కోసం వేలకోట్ల రూపాయలను వెచ్చిస్తో ఉండి కూడా,  దేశ ప్రజలు మరే దేశం మీద ఆధారపడకుండా......మరే దేశం క్రింద పనిచేయకుండా  రక్షించాల్సిన   మన రాజకీయ వ్యవస్తే  శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తు ఉంటే ....యుద్ధం చెయ్యకుండానే  ఓటమిని అంగీకరించినట్లా.....     ఎఫ్ డి ఐ అంటే "FOREIGN DIRECT INVESTMENT  అని కాదు....... FOREIGNERS DEFEAT INDIANS "  అని అర్ధమని మన పాలకులకి ఎవరు చెపితే వింటారు.........!!!     
యుద్ధం జరిగితే ఏమవుతుందీ...? జరిగి ఓడిపోతే దేశంలో  ఏమి జరుగుతుంది...??   అది   మనవాళ్ళే చేసి చూపించబోతున్నారు..........
  



*******************


శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ  పిలుస్తున్నారా.......???[FDI--PART..I] 

ఎలికల కోసం ఏనుగులని తెచ్చుకొంటామా...? [FDI....PART-2]



ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివి.....మిక్సింగ్ కేఆర్ కే 
   

25, నవంబర్ 2012, ఆదివారం

రైళ్ళూ ప్రయాణాలూ బస్సులూ---వరంగల్...ఉత్తర తెలంగాణా

రాష్ట్రంలో ఎటు నుండి ఎటైనా తిరగాలంటే ప్రయాణ సౌకర్యాలున్న ముఖ్యంగా మూడు సెంటర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చును.  అవి,  విజయవాడ,  హైదరాబాదు,  తిరుపతి.  ఇవి కాకుండా,  జిల్లాలని దాటి కొంత పరిధి వరకూ తిరిగే ప్రయాణ సౌకర్యాలున్న సెంటర్లు షుమారుగా 6 ఉన్నాయి. అవి.... విశాఖపట్టణం, రాజమండ్రి, గుంటూరు, నెల్లురు, కర్నూలు, వరంగల్లు[హనుమకొండ].  

ముందుగా విజయవాడని తీసుకోవచ్చును.....ఎందుకంటే రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, రాయలసీమ, తూర్పు ఆంధ్రా మరియూ కోస్తా ఆంద్రాలోని అన్ని జిల్లలలోని ప్రధాన నగరాల నుండే కాకుండా, అనేక పట్టణాలకి కూడా  డైరెక్టు బస్సులు ఉన్నాయి......అలాగే విజయవాడ దగ్గర 5  వైపులా కలిసే  రైల్వే  లైన్ల ద్వారా రాష్ట్రమే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకీ డైరెక్టు రైళ్ళ సౌకర్యం కూడా ఉన్నది....అయితే అందరికీ కావలిస్నప్పుడు దొరికేనన్ని సర్వీసులు  అందుబాటులో లేవు....అసలు ఇలాంటి అవకాశాలున్న ఈ ఊరుని ట్రాన్స్‌పొర్ట్ హబ్‌గా చేసినట్లైతే అందరికీ అన్ని విధాలుగా బావుంటుంది.....  సరే, ఈ ఆలోచన ఇంకో 100 ఏళ్ళకి మన నాయకులకి వస్తుందన్నా ఆశతో అసలు విషయంలోనికి వెళదాము. విజయవాడ నుండీ విశాఖ... తూర్పు ఆంధ్రా వైపుకి ఎలా వెళితే బాగుంటుందో నాకు తెలిసినంతవరకూ ఇంతకు ముందు వివరించాను....ఈ సారి ఉత్తర తెలంగాణా వైపుకి ఎలా వెళితే బాగుంటుందో తెలియ చెయ్యటానికీ ప్రయత్నిస్తాను.

విజయవాడ నుండీ వరంగల్లు...కరీంనగర్....

 

విజయవాడ నుండీ హైదరాబాదుకి తప్ప మిగిలిన తెలంగాణా జిల్లాల వైపునకి సరైన రోడ్డు మార్గాలు ఎందుకనో అభివృద్ధి చెందలేదు....విజయవాడ నుండీ ఖమ్మం, ఓరుగల్లులకు   బస్సులో వెళ్ళాలంటే నరకమే కనిపిస్తుంది....ఇక కరీంనగర్ లాంటి ప్రదేశాలకి చెప్పనే అఖర్లేదు. విజయవాడ నుండీ ఉండటానికి డైరెక్టు బస్సులు ఉన్నాయి కానీ, వాటిని వాడకపోవటమే మంచిది...రైలులో ఖమ్మంకి కేవలం రెండుగంటల లోపలే చేరుకోవచ్చును. వరంగల్‌కి నాలుగు గంటలలోపల చేరుకోవచ్చును. బస్సులోనే వెళ్ళాలంటే విజయవాడనుండీ హైదరాబాదు మార్గంలో 3 గంటలు ప్రయాణం చేసి కోదాడకు వెళ్ళి, అక్కడి నుండీ బస్సులొ గంట ప్రయాణం చెసి ఖమ్మం చేరుకొవటం తేలిక.  

 విజయవాడ-వరంగల్  రైళ్ళ  వివరాలు  క్రింది లింకులు నొక్కండి 

భద్రాచలానికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉన్నది.....అక్కడికి వెళ్ళాలంటే విజయవాడ నుండీ కావాలిసినన్ని బస్సులు ఉన్నాయి...వాటిలో కేవలం 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి షుమారు 4 గంటలలో భద్రాచలం వెళ్ళ వచ్చును. చార్జి ఎక్కువైనా ఇదే మంచి ప్రయాణం....ఇదే కనుక రైలులో వెళ్ళాలంటే ఉదయానే 8:00 గంటలకి భద్రాచలం[కొత్తగూడెం]పాసెంజెరు ఉన్నది. దీనిలో  ఆరు గంటల పాటూ ప్రయాణం చేసి, కొత్తగూడెం చెరుకొంటాము. మళ్ళీ అక్కడ [స్టేషను ఎదురుగానే బస్సులు వస్తాయి] బస్సు ఎక్కి గంటన్నర పాటూ ప్రయాణం చేసి భద్రాచలం మధ్యాన్నం 4:00 గంటలకి చెరుకొంటాము...... ఇదే ప్రయాణం ఉదయం 8:00 గంటలకి  విజయవాడ నుండీ బస్సులో బయలు దేరితే 12:00 గంటలకల్లా చేరుకొంటాము.  విజయవాడ నుండి అరగంటకొక బస్సు భద్రాచలానికి ఉన్నది. మొదటి బస్సు తెల్లవారు ఝామున  3:30కి.
 
యదగిరిగుట్టకి విజయవాడ నుండి వెళ్ళాలంటే రైలులో షుమారు 6 గంటలు ప్రయాణం చేసి బొన్‌గిర్[భువనగిరి]దిగితె, అక్కడి నుండీ బస్సులో అరగంట లోపల యాదగిరిగుట్ట    చేరుకోవచ్చును...హైదరాబాదు నుండీ యాదగిరిగుట్ట వెళ్ళే బస్సులు చాలా వరకూ భువనగిరి మిదుగానే వెళతాయి. కాని భువనగిరిలో ఆగే రైళ్ళు చాలా తక్కువ....సూపర్ ఫాస్ట్ రైళ్ళు అసలు ఆగవు. ఇదే విధంగా ఉన్న అన్నవరం రైల్వే స్టేషనులో అన్ని రైళ్ళు ఆగుతాయి.   బాధాకరమైన విషయం ఏమంటే ఎన్నో ఉద్యమాలు చేసే వారికి,  ఇలాంటి ప్రజలకి పనికొచ్చే  విషయాల  పట్ల శ్రద్ద లేదు..

కరీంనగర్: ఇక్కడికి వెళ్ళాలంటే విజయవాడ నుండి రైలులో 4 గంటలు ప్రయాణం చేసి వరంగల్ దిగితే ఎదురుగా బస్‌స్టాండు....అక్కడ లేకపోతే,   సిటీ బస్సులో  హనుమకొండ     బస్టాండుకు చేరితే.....కేవలం  కరీంనగరే కాదు, ఉత్తర తెలంగాణాలోని అన్ని ఊళ్ళకీ బస్సులుంటాయి....పుణ్య క్షేత్రాలైన వేములవాడ...కాళేశ్వరాలకి కావాలిసినన్ని బస్సులుంటాయి. వరంగల్ నుండి సిద్దిపేట గంటన్నరలో చేరుకోవచ్చును. వరంగల్‌లో బస్సెక్కితే కేవలం గంటన్నర ప్రయాణం చేసి కరీంనగర్ చేరుకోవచ్చును. కరీంనగర్ నుండీ 45 నిమిషాలు ప్రయాణం చేసి ప్రముఖ పుణ్య క్షేత్రం వేములవాడ చేరుకోవచ్చును. 
 
కాళేశ్వర పుణ్య క్షేత్రనికి చేరుకోవాలంటే; వరంగల్ హనుమకొండ  బస్‌స్టాండు నుండీ 2:30 గంటల
ప్రయాణం.  విచిత్రమేమంటే జిల్లా కేంద్రమైన కరింనగర్ కంటే హనుమకొండ నుండే ఎక్కువ బస్సులుంటాయి.... విజయవాడ నుండీ కాళేశ్వరం వెళ్ళాలంటే ఉదయానే 6:00 గంటలకి శాతవాహనా ఎక్స్‌ప్రెస్స్ ఎక్కి ఉదయం 10:00కి వరంగల్ దిగి అక్కడ నుండీ బస్సు ఎక్కి మద్యహ్నం షుమారు  12:30 గంటలకల్లా కాళేశ్వరం చేరుకొని, దర్శనం చేసుకొని తిరిగి వెనుకకి వరంగల్ రావటం మంచిది....ఎందుకంటే కాళేశ్వరం సమస్యాత్మక గ్రామం, అక్కడ రాత్రి బస చెయ్యటానికి సౌకర్యాలు ఉండవు. కాళేశ్వరం వద్ద రెండు నదులు....గోదావరి, ప్రాణహిత... కలుస్తాయి.  దీనికి దగ్గరలోనే ఏపీ, మహారాష్ట్రా, చత్తిస్‌ఘర్ రాష్ట్రాల సరిహద్దులు కలుస్తాయి.            

నిజామాబాదు వెళ్ళాలంటే విజయవాడ నుండి హైదరాబాదు మీదగా వెళ్ళచ్చును.....కానీ దానికంటే ముందరగా వెళ్ళాలంటే రైలులో వరంగల్ వద్ద దిగి నిజమాబాదు బస్సు పట్టుకొంటే షుమారు 3:30 గంటలలో వెళ్ళ వచ్చును. అంటే రైలులో వరంగల్లు నుండీ హైదరాబాదు వెళ్ళే లోపల, అదే ప్రయాణ సమయానికి నిజామాబాదు చేరుకోవచ్చును.  నిజామాబాదు నుండి ప్రముఖ పుణ్య క్షేత్రం  బాసర  కేవలం 40 కిలొ మీటర్ల దూరంలో ఉన్నది. దీనికి బస్సులో  గంట ప్రయాణం చేసి చెరుకోవచ్చును. బాసర వెళ్ళాలంటే బస్సులో వెళ్ళటమే మంచిది....ఎందుకంటే రైల్వే స్టేషను ఆలయానికి దూరంలో ఉన్నది. నిజమబాదు నుండి బస్సులో 2:30 గంటలలో ఆదిలాబాదు చేరుకోవచ్చును. రైళ్ళు కూడా అందుబాటులో ఉంటాయి. కాని ప్రయాణ కాలం ఎక్కువ...విజయవాడ నుండి ఒకటి రెండు రైళ్ళు తప్ప ఎక్కువ లేవు.

నిర్మల్ చిత్రం   

అదిలాబాదుకి డైరెక్టు రైలులో వెళ్ళటానికి షుమారు 17 గంటల సమయం పడుతుంది.....అదే కనుక రైలులో వరంగల్ దిగి బస్సులో కరీంనగర్, జగిత్యాల మీదుగా వెళితే కేవలం 9 నుండి 10 గంటలలో విజయవాడ నుండి అదిలాబాదు చేరుకోవచ్చును. అలాగే, నిజామాబాదుకి ఉన్న ఒకటీ రెండూ రైళ్ళలోవెళ్ళాలంటే కనీసం 11 గంటల సమయం పడుతుంది.....అదే, వరంగల్ వరకూ రైలులో వెళ్ళి, అక్కడ బస్సు ఎక్కితే, విజయవాడ నుండీ కేవలం 7 గంటలలో కరీంనగర్ మీదుగా నిజమాబాదు చేరుకోవచ్చును.  రంగురంగుల చిత్రాలకి పెరేన్నికగన్న నిర్మల్ ప్రాంతం, నిజామాబాదుకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉన్నది.   ఆదిలాబాద్, నిజామాబాద్లకి  వరంగల్.  కరీంనగర్, జగిత్యాల నుండి బస్సులు మారి వెళితే తొందరగా వెళతాము.

రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్లకి విజయవాడ నుండీ  వెళ్ళాలంటే నార్త్ ఇండియా వెళ్ళే 25 రైళ్ళూ వెళతాయి.........6:00 గంటలు ప్రయాణం చేసి రామగుండానికి, మరో గంట ప్రయాణం చేసి సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకోవచ్చును. విజయవాడ నుండి పెద్దపల్లికి డైరెక్టుగా  రైలులో వెళ్ళాలంటే ఉదయాన్నే 10:00 గంటలకి మెహబూబాబాద్ పాసెంజెరు ఉంటుంది, ఇది  మహబూబాబాదు మద్యహ్నం 2:00 చెరుకోగానే ఇదే పాసెంజెర్ పెద్దపల్లి పాసెంజెరుగా పెరు మార్చుకొని పెద్దపల్లికి సాయంత్రం 6:30 గంటలకి చెరుకొంటుంది. కాబట్టి విజయవాడలోనే పెద్దపల్లికి డైరెక్టు టిక్కెట్టు తీసుకొని రైలు దిగకుండానే వెళ్ళ వచ్చును.



విజయవాడ-డోర్నకల్/భద్రాచలం రోడ్-మహబూబాబాద్ -ఖాజీపేట్ -పెద్దపల్లి-కాజిపేట్ మహబూబాబాద్-డోర్నకల్/భద్రాచలం రోడ్-విజయవాడ 
పేసెంజరు  రైళ్ళ  వివరాలు. 

57254     Vijayawada to Dornakal/Bhadrachalam              08:00
57253     Bhadrachalam/Dornakal to Vijayawada              13:45

148SC    VIJAYAWADA-MAHBUBABAD-PEDDAPALLI[146SC]    10:00
 77251    PEDDAPALLI-MAHABUBABAD-VIJAYAWADA[77253]   08:00

57238  VIJAYAWADA-KAZIPET    12:45
57237  KAZIPET-VIJAYAWADA    04:00

67272   VIJAYAWADA-DORNAKAL-KAZIPET[67270]    18:15
 67269   KAZIPET-DORNAKAL-VIJAYAWADA[67271]     06:45

**************
ఈ లింకు నొక్కితే  విజయవాడ నుండి విశాఖ మరియు శ్రీకాకుళం వైపు   ప్రయాణ వివరాలు ...........

********



********


 కర్టేసి  ఇండియా రైల్  ఇన్ ఫో ,  అప్పుడప్పుడు అలా అలా,   వనితా టివి,   సింపుల్ అండ్ స్మార్ట్, వికీపీడియా, 


 

22, నవంబర్ 2012, గురువారం

కసబ్‌ని ఉరి తిశారా....!! మాకు తెలియకుండానే....!!!

 
ఎట్టకేలకు కసబ్‌ని ఉరితీసి పారేశారు. చాలా ఏళ్ళ తరవాత  సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారనే చెప్పవచ్చును. ఆలస్యమైనప్పటికీ, బాధితులకి న్యాయం జరిగింది. ముష్కరులకి హెచ్చరికలు వెళ్ళినాయి.  "దేశం ఏ విధంగా బలహీనంగా లేదు"  అని సంకేతమిచ్చారు.  

అంతా బాగానే ఉన్నది.....అయితే మాకు చెప్పకుండానే ఉరితీస్తారా, అని మన మీడియా వారు ఉద్రేకపడిపోయారు...అవును మరి, ఇంత హాట్ న్యూస్...బోలెడు ప్రకటనలని ఇచ్చేదీ, టీవీలలో కావలిసినంత అల్లరి చేసుకొనేది,  సుప్రీం కోర్టు...రాష్ట్రపతిలకన్నా పైన ఉన్నామనుకొనే ర్రకర్రకాలైన పెద్దమనుషులు కూర్చొని, "ఎవరూ అడక్కుండానే పెదరాయుడు తీర్పులిచే అవకాశాన్ని" ప్రభుత్వం అనవసరంగా చేజార్చింది!!!  ఎంతో సెన్సేషనల్ విషయాన్ని చాలా చప్పగా తీసిపారేసింది......ఇదీ మన మీడియా వారి పరిధి--బాధ--బాధ్యత.....ఇది మంచి పని అనీ, దేశాన్ని మెచ్చుకొనేందుకు వారికి అహం అడ్దం వచ్చింది. "ముష్కర పనులు చేసే వారికి ఇది ఒక హెచ్చరిక" అని సందేశాన్ని ఇచ్చేకన్నా......మాకు తెలియకుండా చేస్తారా... అనే  ఆక్రోశాన్నే  ప్రదర్శించారు మన బాధ్యత గల మీడియా వారు.   


సరే, యధావిధిగా "మానవత్వం పెచ్చరిల్లింది".......అయ్యో అలా ఉరితీసిపారేస్తారా..?  మానవత్వం ఉండద్దా...??  మనం కూడా టెర్రరిస్టులమా...??? ఒక మనిషి ప్రాణం తియ్యమనే హక్కు మనకెక్కడిదీ....??? ఇలా పరిపరి విధాల  నలుగురి దృష్టిలో పడాలనే బ్లూ క్రాసూ వాళ్ళూ....గ్రీన్ క్రాసూ వాళ్ళూ..... మానవతా వాదులు.....అరిచి, ఒగచి....తిరిగి  పోయ్యేటప్పుడు.....ఒక కిలో కోడి మాసం.....ఒక గొర్రె కాలూ....బొద్దెంకలని చంపటానికి బేగాన్ స్ప్రే........దోమలని చంపటానికి చైనావారి దోమల బేటూ తీసుకొని మరీ ఇంటికి వెళ్ళారు.....అవును మరీ, తమ దాకా వచ్చేటప్పటికి దోమల్నీ, చీమల్నీ కూడా వదిలిపెట్టరు...!!! ఇంటి ఆరోగ్యం లాగానే దేశ, సమాజ ఆరోగ్యానికి కూడా కొన్ని మందులు వాడక తప్పదని వీరికి తెలియదా...??  తెలియదనుకోవాలా......???  

ఇక అధికార పార్టీవారు, తాము చేసిన ఈ గొప్ప పనిని చెప్పుకోవటానికి ఎందుకో అంత ఉత్సాహం చూపించలేదు...తమకి  ఉన్న ఓటు బ్యాంకులు  దెబ్బతింటాయన్న భయమేమో....లేక అతిగా అరచి అనవసరంగా  టెర్రరిస్టుల దృష్టిలో పడటం ఎందుకనుకొన్నారో.......కేవలం వీరే కాదు, ఎర్ర పార్టీల వారు, ఎల్లో  పార్టీల  వారు, నీలం పార్టీల వారు, రెండాకులు, మూడాకులు, ఎనుగులు పార్టీ వారు కూడా అధికార పార్టీ వారి మనోభావాలకే గౌరవం ఇచ్చారు. 

ఇక, హిందూ పార్టీగా చెప్పుకొంటున్న వారు, ఎక్కడ లేనీ ఓవరాక్షన్ చెసేశారు. ఇదంతా వారి గొప్పతనమేననీ.........., జిన్నాని తమ పార్టీ అధినేత మెచ్చుకొన్నప్పుడు నోరు మూసుకొన్న వారంతా, ఎక్కడలేనీ దేశ భక్తినీ ప్రదర్శించేశారు.....ఇదొక ఓటు బ్యాంకు రాజకీయమే కాదనీ, దేశభక్తి అనీ నమ్మగలమా......?   

కారణాలు, రాజకీయాలు లాంటి పనికిమాలిన విశ్లేషణలు ఎలాగున్నా.....ప్రజలకి రాజ్యాంగం మీద నమ్మకాన్ని కల్పించారు. దేశానికి వ్యతిరేకంగా తప్పు చేస్తే తీవ్రమైన శిక్షలు తప్పవన్న సందేశాన్ని ఇచ్చారు.  "ప్రజల అబద్రతా భావం కన్నా.....చట్టాన్ని తామే చేతులోకి తీసుకోవలన్న భావాన్ని" తగ్గించారు.


జై హింద్ 


బొమ్మలు గూగుల్వి.....మిక్సింగు కేఆర్కే  
 

20, నవంబర్ 2012, మంగళవారం

హాంద్రీ....నీవా.........నేనా....!!!!!



దేశంలోకెల్లా ఎత్తైన ఎత్తిపోతల ప్రాజెక్టుని ప్రారంభించారు......చాలా ఏళ్ళ తరవాత ఒక పనికొచ్చే పనిచెశారు....బాగున్నది.  దీని వలన లక్షల మందికి ఉపయోగం ఉన్నది.....దీనిని పార్టీలకి అతీతంగా అందరూ మెచ్చుకో తగినదే.....కానీ, ఎవరికి వారు, ఇది మా ప్రాజెక్టు, ఇది మా మనిషి శంకుస్థాపన చేశాడు,  మా మనిషి మొదలు పెట్టాడు,  ఇది మేము  పూర్తి చేశాము   అని  గొడవ మొదలు పెట్టారు....


ఎవరికి వారు, ఈ గొప్పతనం మాదంటే మాదని కొట్టుకొన్నారు......కానీ, అసలు ఇది ప్రజల సొమ్ముతో కట్టారన్న సంగతి మర్చేపోయారు.....ఎవరికి వారు తమ జేబులో సొమ్ముతో కట్టినంత ఫోజులు కొడుతున్నారు.  రాజకీయ నాయకుల  ఈ విధమైన ప్రవర్తన వలన ప్రజాసామ్యంలో ప్రజల పాత్రను ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నది.... నిజంగా తమకి  ఇందులో ప్రమేయం ఏమీ లేదా...?  ఇది ఎవరి దయా దాక్షణ్యాల వల్లనో వచ్చిందా...?? అన్న సందేహాలు సామాన్యుడిని చుట్టుముడుతున్నాయి.  దీని వలన ప్రజాసామ్య దేశమైన మన దేశంలో,  రాజరిక బానిసత్వపు లక్షణాలు ప్రబలుతున్నాయి...... 



ఎవరో ఒక మనిషి ఉంటేనే ఇదంతా జరుగుతుంది...! ఎదో ఒక రాజకీయ పార్టీ వల్లనే జరుగుంది....!! ఎవరో అదిష్టానం అనే వారి వల్లనే జరుగుతుంది.....!!! అన్న ఆలోచనలు సామాన్యుడికి కలిగి,   "అయ్యో వారు లేకపోతే ఎలా...?"  అని ఒక అమాయక అభధ్రతా భావం పెరిగిపోతున్నది.   ప్రజాసామ్యంలో ప్రతీ సామాన్యుడికీ కూడా తమ వల్లనే దేశం నడుస్తోంది అన్న ఆత్మ స్థైర్యం పెంపొందించి, తాము కష్టపడితే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచన కలిగించాలిసిన మన నాయకులు..........ఎవరికి వారు తమకి ప్రజల ద్వారా దక్కిన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల సొమ్ముతో రాజరికం వెలగబెడుతూ.... తాము ప్రజల కోసమే త్యాగాలు చేస్తున్నట్లుగా తెగ నటించేస్తున్నారు. తాము అధికారంలో లేకపోతే సామాన్య ప్రజలకి ఎదో జరిగిపోతుందనే భయాన్ని కలిగిస్తున్నారు......"దేవుడు తమతోనే ఉంటాడనీ, తాము చెప్పినట్లు వినకపోతే నరకంలో పడిపోతారని, అమాయక ప్రజలని భయభాంతులను చేసి ప్రజలని తమ గుప్పిటలో పెట్టుకొన్న"  మధ్య యుగాల్లోని యూరప్పు మత పెద్దలు లాగా ప్రవర్తిస్తున్నారు.  
 
ఇలాంటి పనికిరాని పోటీ ప్రచారం వలన, భవిష్యత్తులో  "వారు కూడా" దీర్ఘ కాలానికి సంబంధించిన అభివృద్ధి పనులు చెయ్యటానికి వెనుకాడతారు.....ఎందుకంటే ఇవి పూర్తి అయ్యేటప్పటికి వారుంటారో లేదో అన్న అనుమానంతో,  ఎక్కువ ఖర్చుతో కూడి,  దీర్ఘ కాలం సాగి....... ప్రజలకి అసలైన ప్రయోజనం కలిగించే కరెంటూ, నీటిపారుదల లాంటి మొదలైన ప్రాజెక్టులు మరుగున పడిపోతాయి. ఎప్పటికప్పుడు "ఫాస్ట్ ఫుడ్" లాంటి దిక్కుమాలిన ప్రజా పథకాలనే పెట్టి,  ప్రజలను ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేసి,  దిర్ఘకాలంలో ప్రజలకి తీరని ద్రోహం చేసిన వారవుతారు.  

కాబట్టి, ప్రజలకి సంబంధిన పనులు జరిగినప్పుడు.....ఏ ప్రాజెక్టు ప్రారంభోస్థవానికైనా ... అన్ని రాజకీయ పార్టీల వారినీ పిలిచి....వారికి కూడా సముచిత స్థానం గౌరవం కలిపించి......వారిని కూడా మట్లాడనిస్థే  ఇందులో ఏ గొడవా ఉండదు కదా........ఇదేమీ వారి జేబులో సొమ్ముతో కట్టినవి కావు, వారి పార్టీ మీటింగులు కాదు కదా!! అధికార ప్రతిపక్షాలు నువ్వేంచేశావు....నువ్వేంచేశావు అనుకొని, వారిని గెలిపించిన ప్రజలని అవమానించ కుండా,  ప్రజానాయకులందరూ  ఒకరినొకరు గౌరవించుకొంటూ ఉంటే .... ప్రజాసామ్యనికి గౌరవం ఉంటుంది.  ప్రజల ఆత్మస్థైర్యం పెరుగుతుంది.........లేకపొతే ప్రజానాయకులే ప్రజాసామ్య   ద్రోహులుగా  మిగిలిపోతారు. 


************ 

బొమ్మలు  నెట్ పేపర్లోనివి 
  
  

18, నవంబర్ 2012, ఆదివారం

రైళ్ళూ ప్రయాణాలూ బస్సులూ---విశాఖ...తూర్పు ఆంధ్రా

శలవలు వస్తే చాలు జనం ఒకటే పరుగులు...సొంత ఊరికి వెళ్ళే వారూ, భక్తితో యాత్రలు చేసే వారూ....సరదాగా ఊళ్ళు తిరిగే వారు. ఇలా, ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రయాణాల మీద ప్రయాణాలు చేసేస్తున్నారు. అయితే, చాలా మందికి తాము వెళ్ళబోయే ఊరు ఎంత దూరంలో ఉన్నది, ఎలా వెళ్ళాలి, ఏ ఊరికి దగ్గరలో ఉన్నది, అసలు ఎటువైపు వెళితే వస్తుందీ, ఎంతసేపు పడుతుందో తెలియదు.

అందుకని,   మొత్తం ప్రపంచ జ్ఞానం కాకపోయినా, కనీసం  మన  రాష్ట్రంలోని    తిరగాలిసిన ప్రదేశాల పట్ల కొంత తెలిసి ఉంటే బాగుంటుంది......దీని కోసమే ఇక్కడ కొన్ని సూచనలూ, ఏ ఊరు ఎలా వెళితే బాగుంటుందో తెలియ చెయ్యటమే నా ప్రయత్నం.... 

మన రాష్ట్రం వరకూ తీసుకొంటే, [అంటే పొలిటికల్ మేప్ ప్రకారం కాదు] చెన్నై నుండి రాయగడ-బరంపురం-కటక్కు వరకూ, బెంగుళూరు నుండి ఆదిలాబాదు-షిరిడీ వరకూ, బళ్ళారి నుండి తిరుపతి వరకూ  మన జనాభా బాగా తిరుగుతుంటారు. 

మొదలుగా, మా ఊరు 
విజయవాడని తీసుకొంటున్నాను. మా ఊరు కాబట్టి  అని కాదు.........దేశంలో ఏ ప్రాంతం నుండి అయినా ఇక్కడికి రావచ్చును. అలాగే,   ఇక్కడి నుండి రైళ్ళలో దేశంలోని అన్ని ప్రాంతాలకీ, బస్సులలో రాష్ట్రంలోని అన్ని చోట్లకీ చేరుకోవచ్చును. అయితే, దగ్గర ఊళ్ళు అయితే పరవాలేదు. ఏ శ్రీకాకుళమో, కడపో, అనంతపురమో, కరీంనగర్ వెళ్ళాలంటే డైరెక్టు బస్సు, రైలు కోసం ఆగితే  టైము వృధా అవుతుంది......అందుకని ఇలా వెళితే బాగుంటుంది.........ముందుగా ..........

విజయవాడ నుండి విశాఖ-శ్రీకాకుళం, ఇచ్చాపురం, బరంపురం.........



ఇచ్చాపురం, బరంపురం, కుర్దా/పూరి, భువనేశ్వర్/కట్టక్ లాంటి ప్రదేశాలకి  విజయవాడ నుండి డైరెక్టుగా రైళ్ళలో వెళ్ళటమే మంచిది....... వీటికి  డైరెక్ట్  రైళ్ళు చాలా ఉన్నాయి.  పగలు పూట వెళ్ళాలంటే... విజయవాడలో ఉదయానే 6:00 గంటలకి రత్నాచల్  ఎక్స్‌ప్రెస్  రైలు ఎక్కి విశాఖలో మధ్యాహ్నం  12:20 గంటలకి దిగితే, విశాఖ నుండి భువనేశ్వర్  ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్  3:20కి దొరుకుతుంది.......విజయవాడ నుండే కావాలిసిన ప్రదేశానికి డైరెక్టు టికెట్టు తీసుకోని, హాయిగా కూర్చొని  వెళ్ళవచ్చును. అలాగే  బొబ్బిలి, పార్వతీపురం,  రాయగడలకి.......విజయవాడలో  రాత్రి  9:00 గంటలకి పాసింజరు  ఉన్నది......... దీనిలో  మరునాడు  మధ్యాహ్నం  లోపల అక్కడికి చేరుకోవచ్చును.




శ్రీకాకుళం: దీనికి బస్సులో కాకుండా రైలులో[బోలెడు రైళ్ళు] ఆరు లేక  ఆరున్నర గంటలు ప్రయాణం చేసి ఉత్తరాంధ్ర ద్వారం....విశాఖపట్నం వెళ్ళి,  అక్కడి నుండీ నాన్ స్టాప్ బస్సులో 2 గంటలు ప్రయాణం చేసి చేరుకోవచ్చును. శ్రీకాకుళం రోడ్[ఆముదాలవలస]రైల్వే స్టేషను, శ్రీకాకుళం పట్టణానికి కనీసం 10 కిలో మీటర్ల  దూరంలో ఉన్నది.  శ్రీకాకుళం చేరిన తరవాత అక్కడి నుండీ పలాసా, సోంపేట, ఇచ్చాపురం వెళ్ళటం చాలా తేలిక. [ఇచ్చాపురం నుండి ముప్పావు గంటలో బరంపురం వెళ్ళవచ్చును] శ్రీకాకుళం నుండీ ఒరిస్సాలోని పర్లాకిమిడికి[పాతపట్నం[ఆం.ప్ర]కేవలం 2 గంటలలో చేరిపోవచ్చును. పాతపట్నం నుండీ బోలెడు ఆటోలు పర్లాకిమిడికి ఉంటాయి.  శ్రీకాకుళం చుట్టు ప్రక్కలే అరసవిల్లి,  శ్రీముఖలింగం,  శ్రీకూర్మం లాంటి  చక్కటి పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.  


 సింహాచలం 

విజయనగరం; విశాఖ నుండి చేరుకోవటానికి  గంటంపావు ఎక్స్ ప్రెస్ బస్సులో ప్రయాణం చేసి చేరుకోవచ్చును, మూడు గంటలు ప్రయాణం చేసి సాలూరు, బొబ్బిలీ,  బొబ్బిలి నుండీ మరో అరగంట ప్రయాణం చేసి పార్వతీపురం చేరుకోవచ్చును.  విశాఖ  నుండీ పుణ్య క్షేత్రమైన సింహాచలం వెళ్ళాలంటే సిటీ బస్సెక్కితే అరగంటా, నలభై నిమిషాలలో చేరుస్తారు. ఈ బస్సులు విశాఖపట్టణం రైల్వే స్టేషను దగ్గరే దొరుకుతాయి.  విజయవాడ నుండి 5.00 గంటలు ప్రయాణం చేసి  అనకాపల్లి  దిగితే,  అక్కడ నుండి నర్సిపట్నానికి  గంటన్నరలో చేరుకోవచ్చును.


అన్నవరం 

తునికి విజయవాడ నుండి  రైలులొ  నాలుగున్నర గంటలు ప్రయాణం చేసి, అక్కడి నుండి బస్సులో గంటన్నర ప్రయానంతో నర్సీపట్టణం చేరుకోవచ్చును. తుని నుండీ కేవలం 8 కిలో మీటర్ల  దూరంలో ప్రకృతి అందాలుగల  "లోవ"  పుణ్య క్షేత్రానికి  అటోలలో చేరుకోవచ్చును. విజయవాడ నుండి రైలులో షుమారు 4 గంటల ప్రయాణం చేస్తే  ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరం చేరుకోవచ్చును. స్టేషను బయట   దేవస్థానం బస్సులు ఉంటాయి.  విజయవాడ నుండి రైలులొ 3:30 గంటలు ప్రయాణం చేసి సామర్లకోట చేరుకొని, అక్కడ  స్టేషను ఎదురుగా ఉన్న బస్‌స్టాండులో బస్సెక్కి అరగంటలో కాకినాడ చేరుకోవచ్చును......కాకినాడ నుండి బస్సులో గంటన్నర ప్రయాణం చేసి పంచారామ  క్షేత్రమైన ద్రాక్షారామం/కోటిపల్లి చేరుకోవచ్చును. సామర్లకోట నుండీ బస్సులో పుణ్య క్షేత్రం పిఠాపురం అరగంటలో చేరుకోవచ్చును. సామర్లకోట కూడా పంచారామాలలో ఒకటి. విజయవాడ నుండి రైలులో 2.30 గంటలు ప్రయాణం చేసి రాజమండ్రి దిగి,  స్టేషను ఎదురుగా అమలాపురం బస్సెక్కితే కేవలం గంటన్నరలో అమలాపురం చేరుకోవచ్చును. బస్సులో అమలాపురం చుట్టు ప్రక్కల ఉన్న ముక్తేశ్వరం/కోటిపల్లి, అప్పనపల్లి, అంతర్వేది  పుణ్య క్షేత్రాలను చూడవచ్చును.

ద్వారకా తిరుమల 

ఏలూరు వెళ్ళటానికి విజయవాడ నుండి  చాలా నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయి. ఉదయాన వెళ్ళ దలిస్తే 8:15 నిమిషాలకి పాసింజరు  రైలు ఉన్నది. రు.10/- ఇచ్చి ఇందులో గంటన్నర ప్రయాణం చెసి ఏలూరు పట్టణం మధ్యలో ఉన్న పవర్‌పేట స్టేషనులో దిగవచ్చును. మనం బస్సులో రు. 40/- ఇచ్చినా 2 గంటలు ప్రయాణం చేసి ఊరి బయట ఉన్న బస్‌స్టాండులో దిగవలిసినదే.......ఏలూరు దిగితే, అక్కడి నుండి బస్సులో గంటలో కైకలూరు, తాడేపల్లిగూడెం, పుణ్య క్షేత్రమైన ద్వారకా తిరుమల[చిన్న తిరుపతి] చేరుకోవచ్చును. జంగారెడ్డిగూడెం, చింతలపూడి మరియూ భీమవరం, పాలకొల్లు, నర్సాపురాలకి  ఏలూరు నుండి బస్సులు ఎక్కువ దొరుకుతాయి. 

ఈ క్రింద  లింకులు నొక్కితే విజయవాడ -విశాఖపట్టణం-విజయవాడ ఎక్స్‌ప్రెస్   రైళ్ళ టైం టేబుల్స్ ఉన్నవి......

  విజయవాడ-విశాఖ     @        విశాఖ-విజయవాడ   

విజయవాడ -రాజమండ్రి/కాకినాడ-విశాఖపట్టణం-కాకినాడ/రాజమండ్రి విజయవాడ పాసెంజరు రైళ్ళు 


57201 VIJAYAWADA-RAJAHMUNDRY-VISAKHA[57235]   04:30
57200 [67299] RAJAHMUNDRY-VIJAYAWADA   17:15

67261 VIJAYAWADA-RAJAHMUNDRY   18:20
67262 RAJAHMUNDRY-VIJAYAWADA   03:45 

67295 RAJAHMUNDRY-VISAKHA   11:15
57236 VISAKHA-RAJAHMUNDRY   17:00
67296 VISAKHA-RAJAHMUNDRY   18:10
[ఈ రైళ్ళు విజయవాడ రావు]  

57457 Vijayawada[Tpty]-Kakinada Port   12-30
57458 Kakinada Port-Vijayawada[Tpty]   07:00

57255 KAKINADA-VISAKHA   04:30
57256 VISAKHA-KAKINADA   17:00
[ఈ రైళ్ళు విజయవాడ రావు]

57231 VIJAYAWADA-KAKINADA[FAST]   17:25
57232 KAKINADA-VIJAYAWADA[FAST]   04:45

57225 VIJAYAWADA-VISAKHA   08:25
57226 VISAKHA-VIJAYAWADA   09:15

57229 MACHILIPATNAM/NARSAPURAM-VISAKHA   21:15
57230 VISAKHA-MACHILIPATNAM/NARSAPURAM   20:10
    [ఈ రైళ్ళు విజయవాడ రావు]

57271 VIJAYAWADA-VISAKHA-RAYAGADA   21:00
57272 RAYAGADA-VISAKHA-VIJAYAWADA   15:45


పైన అన్ని ఊళ్ళకీ విజయవాడ నుండి  డైరెక్టు బస్సులు కూడా ఉన్నాయి.  కానీ, మన ప్రయాణ కాలం మరియూ   అమూల్యమైన కష్టార్జితాం వృధా అవుతుంది. అలాగే డైరెక్టు రైళ్ళు కూడా ఉన్నాయి....కానీ అవి ఎక్కువ లేకపోవటం, రిజర్వేషను అనుకున్న సమయానికి దొరకక పోవటం  వలన చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.  


ఈ లింకు నొక్కితే   విజయవాడ నుండి వరంగల్ వైపునకు ప్రయాణ వివరాలు ...........

*************
కర్టేసి  ఇండియా రైల్  ఇన్ ఫో 
 

13, నవంబర్ 2012, మంగళవారం

భారత్‌కి మిత్రులా లేక చైనాకి తొత్తులా మన మీడియా.....


భారత్‌కి  మిత్రులా లేక చైనాకి తొత్తులా మన మీడియా.....ఉదయాన్నే లేచిన దగ్గర నుండీ మన దేశాభివృద్ధి, దానికి సంబంధించిన విషయాలు చూపించాలిసిన మన మీడియా వారు, పనికిమాలిన రాజకీయ సొల్లు కబర్లు చెప్పుకొంటూ...దేశంలోని ప్రజలను తప్పుదోవ పట్టించటమే కాకుండా....... ప్రపంచంలో మరే దేశం దొరకనట్లు చైనాతో మన దేశాన్ని పోలుస్తూ ఒకటే ఊకదంపుడు విషయాలు....చైనాలో అయితే ప్రజలు లైన్లో నుంచొని రైలెక్కుతారుట, అదే మన దేశంలో అయితే తొక్కుకు చస్తారుట.....   అక్కడికి, వీరు చైనా అంతా తిరిగి చూసినట్లుగా పిచ్చి వాగుడు.....అదీ కూడా  ఒక చైనా వెబ్ సైటులో ఉంచిన,  ఒకే ఒక్క ఫొటో ఆధారంగా.......

చైనాలో  అయితే అవినీతికి ఉరి శిక్షేనట....అదే కనుక మన దేశంలో అయితేనా.......మరి మొన్నటి సమావేశాల్లో వారి దేశాధినేతలే అవినీతి గురించి పెద్ద ఎత్తున బాధ నటించేశారు....???  అంటే, చైనాలో అవినీతికి ఉరి శిక్ష అన్నా ఆగని  అవినీతి పెద్దదా....?  లేక భారత్‌లో   "ఆ  ఇక్కడ మన దేశంలో  ఆ ఏమి చేస్తారులే"  అన్న నిర్లక్ష్యం వల్ల పెరిగిన అవినీతి పెద్దదా......? అవినీతి విషయంలో చైనా వారికి  ఉరి శిక్ష అన్నా భయం లేదన్నమాట!!!!  అదే మన దేశంలో కనుక అవినీతికి ఉరి శిక్ష అమలు చేస్తే,  అక్షరాలలో నుండీ కూడా "అ" అనే అక్షరాన్ని కూడా తొలగించేస్తారు.

మొన్నటికి మొన్న, ఆ దిక్కుమాలిన చైనా యుద్ధం  గురించి [50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా] మన మీడియా వారు చాలా వక్రీకరించి, తమ శాయా శక్తులా తమ చైనా విశ్వాసాన్ని చాటుకున్నారు.....ఆ యుద్ధంలో చైనా వారి తప్పేమీ లేదట.....వారు మనకి ముందుగానే చెప్పే దాడి చేశారని ఒక భారతీయ ...చైనా మిత్ర బ్లాగు ఒగచింది......పైగా మన దేశం అసమర్ధతే మన ఓటమికి కారణంట...మన దిక్కుమాలిన ఎర్ర బానిస మనస్థత్వంగల మీడియా ఉవాచ.... అంతేగానీ, నెహ్రూ గారు శాంతి సందేశాన్ని తన వెంట తీసుకెళితే, అక్కడ విషపు నవ్వులతో ఆమోదించినట్లు కనపడి..... ఆయన వెనుకాలే వచ్చి వెనుక దాడి చేసిన ద్రోహే చైనా అనీ ; ..... చైనా ద్రోహి అని తెలియక మనం సిద్దంగా లేము అనీ,   అందుకనే  ఇబ్బంది పడ్డామునీ...... ఏ  ఒక్క మీడియా  చెప్పలేదు.  ఈ సత్యాన్ని వధించటమే కాకుండా, మన దేశం విషయంలో మన మీడియావారు వాడే పదజాలం........ దేశం,  దేశ ప్రజల  మనొభావాలనూ,  మనోధైర్యాన్నీ దెబ్బతీసే విధంగా ఉన్నది. 

అయ్యా, మీడియా వారు,  ఒక విషయం తెలుసుకోండి.......ఇక్కడలాగా మీ చైనాలో కనుక అవాకులూ చవాకులూ పేలితే......అవినితి పరులనేమోగానీ,  ఒక్క మీడియా జనం మిగలకుండా ఉరితీసి పారేస్తారు.......అందుకనే అక్కడి విషయాలు చాలా చక్కగా అందంగా కనపడుతూ వస్తాయి.......మీరు  భారత్ దేశంలోని   స్వేచ్చని వాడుకొంటూ.......దానికి తగ్గట్లు ప్రవర్తించండి.  లేకపోతే,  మీ అతి స్వేచ్చ బాగా ముదిరి, మన భారత ప్రభుత్వం కూడా చైనాని........ అదే మీ చైనాని ఆదర్శంగా తీసుకొంటుంది.......అప్పుడు మాకు బాగానే ఉన్నా....మీకు మటుకూ బ్రతుకుతెరువు  ఉండదు!!!!!!! 

జై హింద్ 



11, నవంబర్ 2012, ఆదివారం

తిరుమల భద్రత.......ఇల్లెక్కి కూయాలా...???


హిందువుల పార్టీ అని  పైకి కనపడుతున్న ఒక రాజకీయ పార్టీకి చెందిన  జాతీయ  నాయకుడూ, ఆయన అనుచరుడూ నిన్న తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకొన్నారు.  పాపం,  ఆ తరువాత.........మర్యాద విషయంలో ఏమైనా తేడాలు వచ్చినాయో లేక మన మీడియా వారు పట్టించుకోలేదో  ఏమో మరి.......ఉన్నట్లుండి తిరుమల బధ్రత గురించి వారికి ఎక్కడిలేనీ శ్రద్ధ వచ్చి అక్కడి అధికారులని కడిగి పారేశారు. "ఒక వేళ బొంబయి తరహా దాడులు జరిగితే[?]" ఏమి చేస్తారని పేద్ద పేద్ద డైలాగులు వాడేశారు.......అసలు వీళ్ళలాంటి వాళ్ళు రావటం, వచ్చి అనవసర వాగుడు వాగటం వల్లనే టెర్రరిస్టులకి దారి చూపిస్తున్నట్లు అవుతోంది అనే విషయం ఈయనకు తట్ట లేదా.....? ప్రతీదీ సెన్సేషనే కానీ తరవాత ఏమి జరుగుతుందనే బాధ లేదా?? తిరుమల బధ్రతలో లోపాలుంటే అలా ఇల్లెక్కి కూయాలా...??? రెండో కంటి వాడికి తెలియ కుండా అక్కడున్న అధికారులతో సమావేశమై, తనకు తోచింది చెప్పి జాగ్రత్త పడమని చెప్ప వచ్చును కదా....!!! 

తిరుమలకి లక్షలలో, కోట్లలో భక్తులూ, ప్రజలూ వస్తున్నారు హాయిగా అయినంత వరకూ దర్శనం చేసుకు పోతున్నారు. ఎవరికీ బధ్రత అనేది ఒక పెద్ద విషయంగా కనపడటం లేదు......అయితే ఈ వీఐపీలు అంటూ వచ్చి అనవసర హడావిడీ చేసి నలుగురి దృష్టిలో పడాలన్న వీరి తాపత్రయం వల్లనే తిరుమల బధ్రతకి లోటు వస్తోంది. ఈ ప్రచార నాయకులు ఓహ్ మర్చే పోయాను.....అదే ప్రజానాయకుల ప్రచార ధొరణుల వలననే తిరుమల లాంటి చక్కటి ప్రదేశాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి.....


ఏదైనా పండుగ వస్తే చాలు అప్పటిదాకా హిందువుల మీద ఎవరు నోరు పారేసుకొన్నా కిమ్మన కుండా నోరు మూసుకొని చిమూ నెత్తురూ లేని వాళ్ళ లాగా ఉన్న ప్రతీ వాళ్ళూ, స్వామి వారి దర్శనానికి ఎగబడటమే.....అదీ జనం బాగా రద్దీగా ఉన్నప్పుడు వచ్చి, తమ దర్పం ప్రజల దగ్గర ప్రదర్శించటం పరిపాటైపోయింది. ఇలాంటి వాళ్ళూ, వారి వెనుక తిరిగే చెంచాలూ.......వీరి కోసం స్కెచ్చిలు వేసే టెర్రరిస్టు మూకలూ..........కేవలం ఈ విధంగా మాత్రమే తిరుమల లాంటి ప్రదేశాలకి ముప్పు వాటిల్లుతోంది.....

వీరికి తోడు వీరి చెంచా మీడియాలు....టీవీలలో హొరెత్తిచటం.... ఇలా లక్షలూ, కోట్లూ ప్రజలు గుమికూడతారు అన్న విషయాన్ని చక్కగా టీవీలలో ప్రచారం చేసి టెర్రరిస్టు మూకలకి సహాయ పడుతున్నారు.  ముంబాయిలో  టెర్రరిస్టు మూకల దాడి సమయంలో కూడా మన అతి స్వేచ్చగల మీడియా విపరీత లైవ్ టెలీ కాస్టు చెయ్యటం వల్లనే, లోపల ఉన్న టెర్రరిస్టు మూకలు హాయిగా టీవీలు చూస్తూ తమ యుద్ధ రచనని చేసేయి. ఒక విధంగా వారికి సహాయకులుగా పని చేశాయి మన మిడి మిడి మీడియా. ఇప్పుడు కూడా సందు దొరికింది కదా అని   "ఒరేయ్ టెర్రరిస్టు బాబులూ ఇక్కడ భద్రత ఏమీ లేదు రారండోయ్......"  అని పిలిచినట్లుగా గొల గొల చేసి,  పనికి మాలిన మూకల దృష్టి పడేటట్లు చేస్తున్నాయి మన మూఢియాలు.......

ఎక్కడన్నా, ప్రజలకి సంబంధించి ఘోరం జరిగితే,  సంయమనం  పాటించమనే ఈ పెద్ద మనుషులు; తమ వర్గానికి[రాజాకీయ/మీడియా]ఏదైనా జరిగితే, ఎదో ప్రపంచం తలక్రిందులు అయినట్లు ప్రవర్తిస్తారు. "నాయకులకే రక్షణ లేకపోతే ఎలా......?"అనీ,  "మీడియా స్వేచ్చకి భంగం వాటిల్లితే ఎలా....??" అని తెగ కాకి గోల చేసేస్తారు.   

కాబట్టి ఓ నాయకులారా, మీడీయ పెద్దలారా.......ప్రజల స్వంత విషయాలలో కానీ, ధార్మిక విషయాలలో కానీ బాగా జనం గుమికూడే దగ్గరకి మీరు రాకండి, అక్కడి విషయాలలో తల దూర్చకండి, అక్కడి పరిపాలనకి సంబంధించిన వాటిలో వేలు పెట్టకం
డి.....బధ్రత అదే వస్తుంది. 


చివరగా, పైన చెప్పిన హిందూ పార్టీగా పిలుచుకోబడుతున్న  పార్టిలోని  పెద్దలలో ఒకతను, నిన్న శ్రీరాముని గురించి అవాకులూ చవాకులూ పేలాడు. అతని పేరు రామ.............జఠల.....మల.....అని... అనుకుంటా.  ఈ విషయమై దేశంలోని మిగిలిన అన్ని పార్టీల వారు దుమ్మెత్తి పొశారు.  ఒక సాధువు గారు,  "నీ పెరులో ఉన్న రాం తోగించి రావణ్ అని పెట్టుకోమని"  సలహా ఇచ్చారు...........కానీ,  హిందువులకి తామే   ప్రతినిదులుగా తమకు తాముగా  ఫోజు కొట్టి, హిందువుల విషయాలలో తల దూర్చి,  వారికి అనవసర తల నొప్పులను  తెస్తున్న ఈ పార్టీలోని పెద్ద మనుషులు ఎవ్వరూ అతని మాటలను వారించలేదు.....ఖండించలేదు.  తిరుమల భద్రత గురించి తల్లడిల్లిన  ఆయన, ఆయన ప్రముఖ అనుచర గణం    నోరిప్పలేదేందుకో .........!!!!


*************


 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

-----------------------------------------------------------------------------------------------------------------

****************************** 

అంరికీ   దీపాళి  శుభాకాంక్షలు 

******************************** 
----------------------------------------------------------------------------------------------------------------
 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


బొమ్మలన్నీ గూగల్వె  ...మిక్సింగు కేఆర్కే