LOCAL WEATHER

31, అక్టోబర్ 2012, బుధవారం

ప్రజా భూకంపం

ఇది గూగుల్ ఇమేజెస్ లోనిది మాత్రామే

మొన్న పనిమీద వినుకొండ వెళ్ళను....ఆ సమయంలో అక్కడా,  పరిసర ప్రాంతాలలో భూకంపం వచ్చింది........వచ్చినప్పుడు అయిదు సెకండ్ల పాటూ ఉరుములాంటి చప్పుడు  వచ్చి,  కాళ్ళ క్రింద భూమి కంపించింది...అందరం బయటకు పరిగెత్తాము....దగ్గరలో ఉన్న కొన్ని ఇళ్ళకు  కొద్దిగా బీటలు వచ్చినాయి.......కాసేపు హడావిడి.....10 నిమిషాలు గడిచినాయి......రోడ్డు మిదకు వచ్చిన జనం అది ఇదీ మాట్లాడి,  ఎవరి పనిలో వారు నిమజ్ఞమై పోయారు. అసలు ఇందాక భూకంపం ఇక్కడేనా వచ్చింది అనేంత  మళ్ళీ వాతావరణం మాములుగా మారిపోయింది.

టివీ వారు కొద్ది సేపు "బ్రేకింగు న్యూస్" అని హడావిడీ చేసి  ఊరుకున్నారు...విజయవాడ వచ్చిన తరవాత  భూకంప విషయం చెప్పాను......అలా వినీ  విననట్లుగా  విని ఊరుకున్నారు.....నాకు అశ్చర్యం వేసింది.  ఇదే ఇదివరకు రోజుల్లో అయితే వారం పదిరోజులు చెప్పుకొనే వారు...మరి జనంలో చైతన్యం తగ్గిందా....లేక భూకంపం అనేది మనకు అలవాటైయిందా.......భూకంపం అంటే లెక్క లేదా......అదేమంత ముఖ్యమైన విషయం కాదా......కాళ్ళ క్రింద భూమి కదిలినా పట్టించుకోనంతగా జనం మారిపోయారా.......??? 

లేదు. జన చైతన్యంలో మార్పేమీ లేదు....మరి దీనికి బదులు, ఎవరో ఒక రాజకీయ నాయకుడికి ఏదైనా జరిగితే టీవీలూ, ప్రజలూ విపరీతంగా ప్రతిస్పందిస్తున్నారు కదా!!!   రోజుల తరబడి చర్చించుకొంటారు కదా!!!  ఉదయాన్నే ఎంతో మంది పెద్దమనుషులు టీవీల్లొ కూర్చుని రాజకీయ నాయకుల భవిష్యత్తూనూ, ఆరోగ్యాన్నీ  విచారిస్తుంటే,  తమ సమస్యలను మరిచిపోయి మరీ చూసి........ఆ తరవాత,  కనపడిన ప్రతీ వారితో అదే విషయాలని చర్చిస్తూ ఉన్నారు కదా!!! కాబట్టి జనంలో చైతన్యానికి కొదవలేదు.....ఎటొచ్చీ అది దారి తప్పింది. అంతె.

ప్రజలు తమ కాళ్ళ క్రింద భూమి కదిలినా పట్టించుకోకుండా, కేవలం  రాజకీయాల పట్ల విపరీత స్పందనతో   ఉండేట్లుగా మన  ప్రజా నాయకులూ, వారి కనుసన్నలలో నడిచే మీడియా, ప్రజలని హిప్నటైజ్ చేసేశారు...... మరి ఈ జబ్బుకు గురైన ప్రజలు స్వంత విషయాల పట్ల ఎలా స్పందించగలరు.....? భూకంపం వచ్చినా చలించని మన ప్రజ, "ఏమిటి మంత్రి పదవి మన సామాజక వర్గానికే వచ్చిందా? మన ప్రాంతానికే వచ్చిందా?" అనే  ఈ పరిస్తితులలో ఎవరేం చెయ్య గలరు???  ........ఎవరేం చెస్తారు.....ఎవరికి వారే తెలుసుకోవాలి.......అంతె.

28, అక్టోబర్ 2012, ఆదివారం

తెలుగు భాషా నీవు మాకేమిస్తావ్!!!



తెలుగు భాషా సంఘం అధ్యక్షునిగా మండలి బుద్ధ ప్రసాదుగారు ఎన్నికైనందుకు వారికి అభినందనలతో పాటూ మా విన్నపము....... 

ఇదివరలో తెలుగు భాషా అబివృద్ధి అనీ, సభలూ సమావేశాలూ అంటూ పెట్టి ఎదో కొద్దిమందిని శాలువాలని కప్పి సన్మానం చేసి చేతులు దులుపుకున్నారు.  కానీ, తెలుగు భాషని అభివృద్ధి చెయ్యటానికి ఇదేమంత ఉపయోగ 
పడదు.  ఎదో కొద్ది మంది పడితులను లెక్కలోనికి తీసుకోవటం కన్నా, ఎక్కువ మంది సామాన్య జనానికి తెలుగు పట్ల ఆశక్తి కలిగేట్లు చేస్తే బాగుంటుంది.       

ఎదైనా భాష అబివృద్ధి చెందాలంటే ఆ భాష వలన ప్రజా అవసరాలు తీరాలి.  అలాగే, తెలుగు నేర్చుకోవటం వలన బ్రతుకు తెరువు లభిస్తుంది అన్న నమ్మకాన్ని విద్యార్ధి లోకంలో కలిగించాలి.  ఆ భాష నేర్చుకొన్న వాళ్ళకి గుర్తింపు....... అంటే ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్ర ఉద్యోగాల్లోనైనా కనీసం  50శాతానికి తగ్గకుండా తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రాధాన్యతని ఇస్తే, తెలుగు మాధ్యమంలో చదవటానికి ప్రోత్సాహం లభిస్తుంది. 


ఇక మన వాళ్ళు ఇంగ్లీషుకిచ్చే మర్యాద ఎలా ఉంటుందంటే;  ఇంగ్లీషులో మాట్లాడటమే గొప్ప అయినట్లూ... అందులో కొద్దిగా స్పెల్లింగు తేడా వచ్చినా.....గ్రామరు తేడా వచ్చినా ఆ మాట్లాడే  వాడిని పామరుడు,  ఏ జ్ఞానం లేనివాడుగ నిర్ణయించెసి వ్యంగంగా నవ్వుకుంటారు.... అదే పట్టుదల మన మాతృభాష పట్ల ఉన్నదా...?? తెలుగులో  కూడా అక్షరం మారితే అర్ధాలు మారిపొతాయి,  లేదా అర్ధం లేకుండ  పోతుందిమరి తెలుగు మీద శ్రద్ద ఎందుకు లేదు...???  ఎందుకంటే...... అక్కడికి ఇంగ్లీషు మాత్రమే జ్ఞానికి చిహ్నం అయినట్లుగా  చదువుకున్నామని అనుకున్న వారిలో నమ్మకం ఏర్పడింది.  కాబట్టి,  ఇంగ్లీషు భాష మాత్రమే జ్ఞానానికి చిహ్నమనే మూఢ నమ్మకాన్ని చెరిపేసి, తెలుగుకి కూడా అంతటి ప్రాభవం, తెలుగులో మాట్లాడే వారికి గౌరవం వచ్చే విధంగా గట్టి ప్రయత్నం చెయ్యాలి.  


ఇదే విధంగా, మన రాష్ట్రంలో   వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న మన రైళ్ళ మీద తెలుగులో ఊళ్ళ పేర్లు ఉండేటట్లు గట్టిగా ప్రయత్నం చెయ్యాలి...ఇదివరకు అలా ఉండేవి. ఇప్పుడు కేవలం మన రాష్ట్రంలో బయలుదేరే కొన్నిటి మీద మాత్రమే తెలుగు ఉంటోంది.....బోగిల మీదే కాకుండా టిక్కెట్టు  మీద ఉన్న తెలుగును కూడా తోలగించారు.....ఈ విధమైనటువంటి ప్రజోపయోగకరమైన వాటి మీద తెలుగు ఉండేట్లు   చర్యలు తీసుకొని,  అన్నిటిమీదా తెలుగులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటే కోట్లాది తెలుగు ప్రజలకి ఉపయోగకరంగా  ఉంటుంది.  హిందీ వారికి తామేదో సామంతులమనే భావన పోతుంది. 
 
  రాష్ట్ర రవాణా సంస్థలోనే దిక్కులేని తెలుగు.

తరవాత, ప్రపంచంలోని అనేక ముఖ్యమైన గ్రంధాలను తెలుగులోనికి అనువదించి, వాటిని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలి. అనువాదం అంటే మక్కీకి మక్కి కాకుండా....సులభతరంగా...ఎక్కువ భాగం నామ వాచకాలను మార్చకుండా అనువదించినట్లైతే బాగ ప్రజాదరణ పొదుతాయి. దీనికోసం తెలుగు అకాడమీ అని ఉన్నదో,  ఉండేదో........ అయితే  దాని ఉనికి తెలియటంలేదు.       
 
ఇంకో  విషయం,  మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం స్కూళ్ళు ఉన్నట్లుగానే, ఇతర రాష్ట్రాలలో  ఎక్కువగా తెలుగు  వాళ్ళు నివశించే  ప్రాంతాలలో  కూడా తెలుగు 
మాధ్యమం స్కూళ్ళని నడిపితే అక్కడ ఉన్న మన తెలుగు వారికి ఉపయోగకరంగా ఉంటుంది.  లేక పోతే అక్కడి తెలుగు వారు క్రమంగా అక్కడి భాష వారుగా మారిపొయ్యే ప్రమాదం ఉన్నది.... ఇప్పటికే అలా మారిపోయి, తెలుగును మాట్లాడటమే కానీ వ్రాయటం మర్చిపోయిన  తెలుగు వారు  ఇతర రాష్రాలలో లక్షలాదిగా ఉన్నారు. కాబట్టి,  ఈ విషయం మీద శ్రద్ధ పెట్టినట్లైతే,  ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రచారం మాట అటుంచి, కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకున్న వారవుతాము.  

అన్నిటికన్నా ముఖ్యంగా మన రాష్ట్ర వ్యవహారాలన్నీ తెలుగులోనే సాగించాలి. దీని వలన తెలుగు నేర్చుకొన్న వాళ్ళకి ఉద్యోగవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇతర రాష్ట్రాల వారితో సంప్రదించాలంటే....ఆ భాషను తెలుగులో అనువదించే వారిని పెట్టుకొంటే....ఆ విధంగా కూడా తెలుగు వారికి మేలు చేసిన వారవుతారు. అలాగే, తెలుగులోనే బోర్డులు పెడితే [విపరీత అనువాదం చెయ్యకుండా] చూసే తెలుగు వారికి ఒక విశ్వాసంలాంటిది అభివృద్ధి చెందుతుంది.  

పైవి  కొన్ని  చెయ్యాలి  అంటే  తెలుగు భాషా సంఘానికి వేరే అధికారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉపయోగం ఉండకపోవచ్చు; కానీ,  జరిమానాలు  వేసే అధికారాన్ని మాత్రం ఇస్తే సత్వరం గుణం కలుగుతుంది......జరిమానాలకే  కదా మన వారు లొంగేది.  ఆ జరిమానాలు తెలుగులో తప్పులు మాట్లాడే వారి నుండి వసూలు చేసినట్లైతే మన తెలుగు టీవీల వారి నుండే వందల కోట్లు రూపాయలు వచ్చే అవకాశం వున్నది!!!

****

  తెలుగులో అక్షరం మారితే అర్ధాలు మారిపొతాయి, 
 లేదా అర్ధం లేకుండ  పోతుంది.  
ముఖ్యంగా "ణ" మరియు "ళ" 
ఇవంటే మన తెలుగు టివి వారికి పడదు..ఎందుకో....
వారి కోసం కొన్ని ఉదాహరణలు....

 ళ 
కల్లు [తాగేది]  కళ్ళు [చూసేవి]
పల్లు[చీర పమిట]  పళ్ళు[నోటిలో ఉండేవి]
మంగలం[క్షవరం] మంగళం[శుభప్రదం]
పెల్లి ..........పెళ్ళి 
వాల్లు వీల్లు........వాళ్ళు వీళ్ళు
కల[కలలు]........కళ[కళలు]

ణ 
జాన [కొలిచేది]  జాణ [తెలివిగలది]
ప్రయానం........ప్రయాణం
ప్రమానం[ఒట్టు వెయ్యటం]...ప్రమాణం[కొలత]
నానెం............నాణెం
రనము.....రణము

కారు[వాహనం] [నీరు "కారు"[క్రియ]] కాఱు[చిక్కని.... దట్టమైన]

రుషి...ఋషి 
రునము....ఋణము

ఇలా అనేకం...

ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ
ణ ణ ణ ణ ణ ణ ణ ణ
ఋ ఋ ఋ ఋ 
ఱ ఱ ఱ ఱ ఱ 

*****


26, అక్టోబర్ 2012, శుక్రవారం

సేవలందు ఆర్జిత సేవలు వేరయా...వినురా మీడియా మామా.....


ఒకే
రంగంలో ఉండే,  ఒకే  రకమైన  వారి  వార్తలను,  ఒకే రకంగా కాకుండా చూపిస్తున్నప్పుడు,  మన న్యూస్ చానళ్ళు వివక్షతను చూపుతున్నాయని అనుకోవాలా.....? లేక "సేవలందు ఆర్జిత సేవలు వేరయా" అనే బహిరంగ రహస్యమేనా....?? 

మన తెలుగు సినిమా రంగానికి చెందిన ఇద్దరు కుర్రాళ్ళ పెళ్ళిళ్ళు దరిదాపులు ఒకే రోజున జరిగినాయి. అందులో ఒక పెళ్ళి ఒక మెగా కుటుంబం ఆగ్రహానికి గురైన కుర్రాడిది. మరొక పెళ్ళి....మెగా వారి అనుంగు అనుచరుడి కొడుకు పెళ్ళి. మొదటి కుర్రాడి పెళ్ళీ ఎప్పుడైంది అనేంత చిన్న బిట్టు చూపించి,  ఏమీ ఎరగని వాళ్ళలాగా మన మెగా మీడియా మిన్నుకుండి పోయింది. ఈ కుర్రాడి పెళ్ళికి అల్లరి నరేష్ మినహా సినీ పెద్దలెవ్వరూ హాజరవలేదు............[TV9].  మరి రెండవ కుర్రాడి పెళ్ళి లైవ్ టెలికాస్టులు, రిపీటెడ్ ప్రోగ్రాములుగా దరిదాపుల అన్ని న్యూస్ చానళ్ళలో ఊదరగొట్టేసి  విసుగు పుట్టించారు.......      
 
మరి ఇందులో కూడా ఏమైనా రాజకీయం ఉన్నదా లేక సేవలందు ఆర్జిత సేవలు వేరా.....అది మన సెన్సేషనల్ న్యూస్ చానళ్ళ వారికే తెలియాలి.......!!! ఆర్జిత సేవలని దర్శనం కాకుండా చెయ్యటానికి కూడా వాడుతున్నారని ఈ సందర్భంగా అనిపిస్తోంది........

20, అక్టోబర్ 2012, శనివారం

వినోదమా?? విపరీతమా??? లేక బందువులా.. రాబందువులా.......




ఆదివారం, లేక సెలవులు వచ్చినప్పుడు, ఇంట్లో కూర్చుని ఏమి చెస్తామూ, అలా వెళ్ళి నలుగురినీ కలుద్దామని బయలుదేరి  వెళ్ళి ఒక స్నేహితుడిని కలిస్తే వాళ్ళింట్లో ఓ బందువుతో కాలక్షేపం చేస్తున్నారు.....కాసేపు కూర్చున్నాక విసుగు పుట్టి చుట్టాలింటికి వెళితే అక్కడ కూడా మరో రకమైన బందువు చెప్పేది వింటూ చూస్తూ ఉన్నారు.....అక్కడా చిరాకు పుట్టి...దూరపు చుట్టాలైన పెద్ద వాళ్ళ దగ్గరికి వెళితే అక్కడ ఓ బందువు దాపరించటమే కాకుండా....ఆ బందువును  బాగా దగ్గర నుండీ  చెప్పెది వింటూ, చూస్తూ మధ్యలో నవ్వుకొంటూ....కోపగించుకొంటూ కనపడ్డారు....ఇంతకీ అన్ని చోటలా ఆ కనపడ్డ బందువు ఎవరంటారా....?  ఇంకెవరు ప్ఫదో లేక ఇర్రవయ్యో చానళ్ళను చూపించే టీవీనే....!!!

వినోదం అనేది ప్రతీ మనిషికీ అవసరమే......అది లేకుండా మనిషికి ఆనందం కలగదు.......నిజమే....కానీ ఎప్పుడు వినోదం కావాలీ...? మనకి తోచనప్పుడు....కాలక్షేపం జరగనప్పుడూ లేక ఒంటరి తనం ఎక్కువై బాధ కలిగినప్పుడూ వినోదం మంచి ఔషధం లాగా పనిచేస్తుంది.....కానీ....."ఈ వినోదం కూడా ఎంత ఉండాలీ అనే ప్రశ్నను ఇప్పటి టీవీ వినోదం మూలంగా తలెత్తింది..."

సమాజంలో మనుషులు ఒకరికొకరు దగ్గరగా నివసించటానికి కారణం.....మానవుడు సంఘజీవి కాబట్టి. కానీ ఇప్పుడు ఇదే మానవుడు సంఘజీవిగా కాకుండా స్వార్ధ జీవి లాగా మారిపోయారు.....ఎవరితోనైనా పని ఉంటేనే పలకరింపులు సాగుతున్నాయి.....ఏ పనీ లేకుండా ఎవరిని ఎవరూ పలకరించుకోనంతగా దిగజారిపోయారు....ఎవరైనా ఊరికే ఏ పనీ లేకుండా వస్తే కూడా "వీడికి మనతో ఏంపని ఉందబ్బా" అని మనసులోనూ మొఖంలోనూ అనుమానం వెలిబుచ్చెంతగా మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. 
  

కారణాలు ఏమైనప్పటికీ, ఎవరి స్వార్ధం గురించి  వారు కారణాలు వెతుక్కున్నప్పటికీ,  దీని వలన మన సమాజానికి విపరీతమైన కీడు చెడూ జరుగుతో ఉన్నది. టీవీలు చూసి చూసీ, తమ సమస్యలకన్నా సీరీయల్లోని   కేరక్టర్ల్ సమస్యలకీ, సమాజ సమస్యలకన్నా రాజకీయ నాయకుల సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తునారు.   మన ప్రక్కన ఉన్న వాడి గురించి మనకు అఖర్లేదు....చివరికి మొగుడూ పెళ్ళాలు కూడా  బందువు కాని బందువు రాబందును చూస్తూ వారిలో వారు సరదాగా మాట్లాడు కోవటం తగ్గించేశారు....దీని వలన సమాజంలో ఒకరికీ మరొకరికీ మధ్య సంబంధ   బాంధవ్యాలు బలహీన పడుతున్నాయి.....

పోనీ, మన మీడియా వారు ఇంత జనాదరణ పొదుతూ వుండి కూడా, ప్రజలను సక్రమమైన ఆలోచనల వైపుకి వెళ్ళేటట్లు తమ కార్యక్రమాలని రూపొందిస్తునారా  అంటే.....అదీ లేదు... జనం ఎగబడి చూస్తున్నారు కదా అనీ....మన టీవీల వారు కూడా ఎక్కడ లేని కధలూ, రియాలిటీ షోలు, న్యూస్ చానళ్ళ పేరుతో ప్రజా జీవితానికి ఏమాత్రం సంబంధం లేని పనికిమాలిన విషయాలతో ప్రజల బుర్రలని పాడి చేస్తున్నారు.....వీరికి కావాలిసినది కేవలం డబ్బు సంపాదన మాత్రమే; ఆ క్రమంలో సమాజంలో ఎన్నో దుష్‌ ప్రభావాలను చూపించే అనేక కార్యక్రమాలను తమ ఇష్టారాజ్యంగా వేస్తున్నారు.....పైగా దానినే మీడియా స్వేచ్చా అంటున్నారు.  మన రాజకీయ వ్యవస్థ లోని కొందరు,  ఇదే సందని ఈ పనికి మాలిన మీడీయాలో ప్రేతాత్మలుగా చేరి ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నారు......   

ఇక, మొదటికొస్తే......మనుషుల మధ్య వినోదం పేరుతో విభజన జరుగుతుంటే దీనిని కంట్రోలు చెయ్యాలి అనే విషయాన్ని కూడా అలోచించేంత తిరిక లేనట్లు నటిస్తో,  సమాజం తన దారిన తను దిక్కు లేకుండా పరిగెడుతో దిక్కులేనిదైపోయింది. దీని చెడు ప్రభావం పెద్దల మీద కన్నా పిల్లల మీద బాగా పడబోతోంది......ఈ విపరీత వినోదం లేని  కాలంలో ఒకరినొకరు పలకరించుకొంటూ, కలుసుకుంటూ కలివిడి వాతావరణంలో  పెరిగిన పెద్దలే  ఈ రోజున సమాజానికి దూరంగా ఉంటుంటే,  చిన్నప్పటి నుండీ టీవీయే లోకం అన్న రీతిన పెరిగిన ఇప్పటి చిన్న పౌరులు, రేపటి సమాజాన్ని "సమాజం" అనేట్లుగానైనా చూస్తారా.....? 

 కాబట్టి,  ప్రజలందరూ వినోదం పట్ల విపరీత ధోరణులను  తగ్గించుకొని, ఎంతో కొంత కాలాన్ని  ఒకరికొకరు కేటాయించ గలిగితే రేపటి సమాజం బాగుంటుంది.  లేకపోతే "మన దేశం పేరు భారత్ అయితే ఏమిటీ...? పాకిస్తాను అయితే ఏమిటి...??? మనం మన దారిన బ్రతుకుతున్నామా లేదా......"  అన్నంత వరకే అలోచించే స్తితికి దిగజారిపోయే ప్రమాదం ఉన్నది. 





 ఇందులోని బొమ్మలన్ని గూగూల్ లోనివే .....మిక్సింగ్  కే.ఆర్.కే 


16, అక్టోబర్ 2012, మంగళవారం

"గూఢచారి 116... నెవర్ ఆన్ సండె" [NEVER ON SUNDAY]

మన  సూపర్ స్టార్   క్రిష్ణా గారి గూఢచారి 116  లోని [1967]   "మనసుతీరా నవ్వులె నవ్వులె"  పాట, "NEVER ON SUNDAY"   అనే ఇంగ్లీషు సినిమా [1960]  టైటిల్ సాంగ్.......ఈ రెండూ చాలా చక్కగా ఒకే ట్యూనులో ఉన్నాయి.......మన తెలుగులో సంగీతం వహించినది...టి.చలపతిరావు గారు.....రెండు పాటలూ కలిపి పెట్టాను చూసి,  విని ఆనందించండి.  ఈ పాటను తెలుగులో పీ సుశీల.....Connie Francis ఇంగ్లీషులోనూ పాడారు.



మన  తెలుగు  వాళ్ళు కాపీ కొట్టేశారని బాధ పడవలసిన పని లేదు....... ఇదే పాట  చైనిస్‌లోనూ, స్పానిష్‌లోనూ  ఉన్నది......ఇంతకీ,  ఒరిజినల్  గ్రీకు వాళ్ళ  "Pote tin Kyriaki aka" అనే సినిమాలోనిది....దీనికి సంగీతం Mr. Manos Hatzidakis.  ఈ సినిమానే  ఇంగ్లీషులో ఉన్నది.


 కర్టెసి  యుట్యూబ్

5, అక్టోబర్ 2012, శుక్రవారం

బీరకాయ కారం పెట్టి కూర

బిరకాయకూర ఆరోగ్యానికి మంచిది.  కానీ, ఈ కూర చప్పిడిగా ఉండటం వలన చాలా మంది ఇష్టపడరు. కాబట్టి,  ఈ క్రింది విధంగా చేసి చూడండి....రుచీ...ఆరోగ్యం రెండూ ఉంటాయి. 


ముందరగా ఒకే సైజులోని బీరకాయలు తీసుకోవాలి. వాటికి స్నాపర్‌తో పైన ఉన్న చెక్కు తీసివేయాలి. తరవాత వాటిని మధ్యకి సగానికి కట్‌చేయ్యాలి. ఇప్పుడు సగంగా ఉన్న బీరకాయను నాలుగు భాగాలుగా అయ్యేటట్లు కోయాలి. అయితే,  క్రింద దాకా కోయకుండా కలిసి ఉండేటట్లు ఉండాలి. ఇదే సమయంలో ప్రతీకాయలోనూ చిన్న ముక్క కోసి రుచి చూడటం మంచిది......దొండకాయలో లాగానే బీరకాయలో కూడా చేదు వచ్చే అవకాశం ఉన్నది. 




                                 
తరవాత, వాటిని కొద్దిగా నూనె వేసి నిమ్మదిగా వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉంచితే బీరకాయలోని నీరు నూనెతో కలిసి చక్కగా ఉడుకుతుంది. ఆ తరవాత మూత తీసివేసి  దానిలోని నీళ్ళు కొద్దిగా తగ్గేవరకూ   ఉంచి,  గరిటతో జాగ్రత్తగా కలపాలి.  ఎందుకంటే బీరకాయ చాలా సున్నితంగా ఉండి ముక్కలు విడిపోయే అవకాశం ఉన్నది. చివరగా ఉప్పూ కారం మరియూ కొద్దిగా శనగపిండి[అవసరం అనుకుంటే] కలిపిన మిశ్రమాన్ని ఉడికిన బీరకాయల మీద వేసి గరిటతో కొద్దిసేపు కలపాలి.  తరవాత  వేసిన ఈ మిశ్రమం కూడా కొద్దిగా వేగే వరకూ ఉంచితే,   కూర చక్కటి రుచి వస్తుంది.